చికిత్సపొందుతున్న సాగర్
మంచిర్యాలక్రైం: ఓ యువకుడి అత్యుత్సాహం అతడి ప్రాణాల మీదకే తెచ్చింది. ఓ బాలికను వెంటపడి వేధిస్తుండగా.. గమనించిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దీనిని గమనించిన సదరు యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. సీఐ ముత్తి లింగయ్య కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మల్యాల సాగర్ (22) కొద్ది కాలంగా మంచిర్యాలలోని చున్నంబట్టివాడలో ఉంటూ పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను కొంతకాలంగా ప్రేమించాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఆదివారం సదరు బాలిక ఇంటికి వెళ్లిన సాగర్.. ఇంటిముందు గొడవకు దిగాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో సాగర్ ఉంటున్న రూమ్‌కు వెళ్లి మందలించినట్లు తెల్సింది. దీంతో సాగర్ తనపై పోలీస్ కేసు అవుతుందన్న భయంతో వారికంటే ముందుగానే పోలీసులను కలిసేందుకు స్టేషన్‌కు బయల్దేరాడు. అప్పటికే బాలిక కుటుంబ సభ్యులు ఠాణాలో ఉండడంతో భయాందోళనకు గురై వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన సీఐ డ్రైవర్ లక్ష్మణ్, డ్యూటీ ఆఫీసర్ తిరుపతి సాగర్‌పై గొంగడి కప్పి మంటలను ఆర్పివేశారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మె రుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు సాగర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment