స్రవంతి (ఫైల్)
రంగారెడ్డి ,దౌల్తాబాద్: ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని కుదురుమళ్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మొసట్ల శైలేందర్, సరోజిని దంపతుల పెద్ద కుమార్తె స్రవంతి(23) మహబూబ్‌నగర్‌లో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుండేది. ఆమె, కుదురుమళ్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం వివాహం చేసుకొని ఫొటోలు కూడా దిగారు. లాక్‌డౌన్ నేపథ్యంలో స్రవంతి గ్రామానికి వచ్చింది. ఆమెకు రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన యువకుడితో వివాహం కుదిరింది. కుటుంబీకులు ఈనెల 30న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. (ప్రేమ వివాహం.. బాలిక బలవన్మరణం )
ఈ విషయం తెలుసుకున్న తిరుపతయ్య స్రవంతిని వివాహం చేసుకునే అబ్బాయి గ్రామానికి వెళ్లి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిపాడు. అలాగే ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో స్రవంతిని నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అయితే, స్రవంతి, తిరుపతయ్య ప్రేమకు అదే గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య సహకరించాడు. మృతురాలి తండ్రి శైలేందర్ ఫిర్యాదు మేరకు తిరుపతయ్య, కోస్గి వెంకటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వజాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment