ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య | Married Woman Commits End Lives With Boyfriend in Vikarabad | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

Published Thu, Jun 18 2020 6:32 AM | Last Updated on Thu, Jun 18 2020 6:32 AM

Married Woman Commits End Lives With Boyfriend in Vikarabad - Sakshi

మీన, కార్తిక్‌

నవాబుపేట: ‘ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మీనకు ఇష్టం లేని పెళ్లి చేశారు. కలిసి బతకలేమని తెలుసుకున్నాం. కలిసి చావాలని నిర్ణయించుకున్నాం. మా చావుకు ఎవరూ కారణం కాదు. ఎవరూ బాధపడవద్దు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం నారెగూడ(పూలపల్లి)లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్‌ (21), ఇదే గ్రామానికి చెందిన కటికె రాజారాం కూతురు మీన(21) ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కార్తీక్‌ ఇంటర్‌ వరకు చదివి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మీన 10 వరకు చదివి ఇంటవద్దే ఉంటోంది. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి కులాలు వేరు కావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు.

రోదిస్తున్న మీన తల్లిదండ్రులు
అయినా ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునేవారు. ఇది గమనించిన మీన తల్లిదండ్రులు నెల రోజుల క్రితం మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన ఓ యువకునికి ఇచ్చి అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. అయినా మీన.. కార్తీక్‌లు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. మంగళవారం మీన అత్తవారింటి నుంచి (గట్టుపల్లి నుంచి) ఎవరికి చెప్పకుండా వచ్చేసింది. అనంతరం కార్తీక్‌ ఆమెను తీసుకొని తన బైక్‌(టీఎస్‌ 07 ఎఫ్‌కే3871)పై నారెగూడకు చేరుకున్నారు. ఎలాగూ కలిసి బతకలేం కాబట్టి కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. నైలాన్‌ తాడుతో నారెగూడ(పూలపల్లి) శివారులోని ప్రభుత్వ భూమిలో ఉన్న వేప పెట్టుకు ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పూలపల్లి గ్రామానికి చెందిన హరిజన మల్లయ్య పొలానికి వెళ్తుండగా ఇరువురూ వేలాడుతూకనిపించారు. విషయాన్ని సర్పంచ్‌ నర్సింహ్మరెడ్డికి చేరవేయగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ క్రిష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వద్ద ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా కార్తిక్‌.. మీనగా గుర్తించి వారి ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వికారాబాద్‌ డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వీఆర్‌ఓ సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రిష్ణ తెలిపారు.  (నువ్వులేని లోకం నాకెందుకని..!)

పెళ్లి చేసుకొని అనంతరం ఆత్మహత్య....
కార్తిక్‌.. మీన ఆత్మహత్యకు ముందు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మీనకు ఇంతకు ముందు పెళ్లి కావడంతో ఆమె ఒంటిపై ఉన్న పుస్తెల తాడు, గాజులు, మెట్టెలు, 4 సెల్‌ ఫోన్లను తీసి ఒక నల్ల గుడ్డలో కట్టి పక్కన పెట్టారు. కానీ మీన మెడలో నూతన పుస్తె ఉంది. పసుపు కొమ్ముదారంతో పుస్తె ఉండటాన్ని గమనించి వీరు చనిపోవడాకిని ముందు పెళ్లి చేసుకొని ఉంటారని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement