అమాయకంగా చూస్తున్న కుమారుడు
ప్రకాశం, వెలిగండ్ల: దంపతుల మధ్య మనస్పర్థల నేపథ్యంలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని రామగోపాలపురం పంచాయతీ వెంగళరెడ్డిపల్లిలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ టి.రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. వెంగళరెడ్డిపల్లికి చెందిన కొత్తకోట ఆదిలక్ష్మి(22)కి గన్నవరం గ్రామానికి చెందిన కొత్తకోట వెంకట చెన్నయ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 15 రోజుల క్రితం ఆదిలక్ష్మి వెంగళరెడ్డిపల్లిలోని తన ఇద్దరు బిడ్డలను తీసుకొని పుట్టింటికి వచ్చింది. భర్త వెంకట చెన్నయ్య వెలిగండ్లలోని ఓ వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తూ రోజూ భార్య వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. భర్త వచ్చి వెళ్లిన తర్వాత ఇంట్లో ఆమె చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీఆర్వో జి.శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని, మృతదేహాన్ని కనిగిరి సీఐ కె.వెంకటేశ్వర్లు పరిశీలించి వివరాలు సేకరించారు.
తల్లిని కోల్పోయిన చిన్నారులు
దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇద్దరు చిన్నారులకు కన్నతల్లి దూరమైంది. తల్లి చనిపోయిన విషయం కూడా తెలియని వయసులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులను చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఆదిలక్ష్మి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపిస్తున్నారు.
మరో వివాహిత కూడా..
కొమరోలు (గిద్దలూరు): ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని రాములవారి వీధిలో బుధవారం జరిగింది. వివరాలు.. రాములవారి వీధిలో నివాసం ఉండే నక్కా శ్రీవాణి (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త నారాయణ ఇంటికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. శ్రీవాణి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment