కట్టుకున్నోడే కడతేర్చాడు
►భార్యను చంపిన భర్త
►నిందితుడు హోంగార్డు
►వీరికి నలుగురు సంతానం
కడప అర్బన్ /సిద్దవటం : హోంగార్డు తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలి బంధువులు, సిద్దవటం ఎస్ఐ బి.అరుణ్‌రెడ్డి తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం భాకరాపేటలో నివసిస్తున్న దర్బార్, రెడ్డెమ్మ కుమారుడు రాజశేఖర్ హోంగార్డు(డ్రైవర్)గా జీవనం సాగిస్తున్నాడు. సుండుపల్లి మండలం బండకాడ ఈడిగపల్లెకు చెందిన రామకృష్ణ, వెంకటశేషమ్మ మొదటి కుమార్తె ఆదిలక్ష్మి (26)ని రాజశేఖర్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి, తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం కలిగారు. ముగ్గురు కుమార్తెలు శ్రీచరిత (7), సుదేష్ణ (5), నిషిత(3), కుమారుడు సిద్దార్థ (6 నెలలు) ఉన్నారు. వీరింట్లో రాజశేఖర్ నానమ్మ లక్ష్మీనరసమ్మ ఉంటూ పిల్లలను చూసుకునేది. ఆయన తల్లిదండ్రులు దర్బార్, రెడ్డెమ్మ కుటుంబ జీవనాధారం కోసం కువైట్‌లో ఉన్నారు.
మద్యానికి బానిసై
రాజశేఖర్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ తాగి ఇంటికి వచ్చే వాడు. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఆరు నెలల క్రితం భార్యను, నానమ్మ లక్ష్మీనరసమ్మను చితకబాదాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. భార్య, నానమ్మ పోలీస్ అధికారులకు విన్నవించడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య,భర్తల మధ్య గొడవ జరిగింది. తన జల్సాలకు ఆమె అడ్డుగా వస్తోందని భావించాడు. అతను బలంగా కొట్టాడు. చివరకు గోడకు నెట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. ఎక్కువ రక్తస్రావం కావడంతో చనిపోయింది. తర్వాత రక్తం అంతా శుభ్రం చేసి తన టీషర్టును, లోయర్‌ను తొడిగాడు. బంధువులకు మాత్రం తన భార్య చనిపోయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. చివరకు తన భార్య శరీరంపై ఉన్న బంగారు చైన్, కమ్మలు, ఉంగరాన్ని సైతం తీసుకున్నాడని నానమ్మ ఆరోపించారు. రిమ్స్‌లో మృతదేహానికి సిద్దవటం ఎస్ఐ అరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి పోస్టుమార్టం నిర్వహింపజేశారు. మృతురాలి తల్లి వెంకట శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నా కుమార్తెను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. పిల్లల ముఖం కూడా చూడకుండా ఇలా ప్రవర్తించాడు. ఆ బిడ్డలను ఇప్పుడు ఎవరు చూసుకుంటారు. వారి పరిస్థితి ఏమిటి? బంగారు ఆభరణాలను కూడా తీసేసుకున్నాడు.
– మృతురాలి తల్లి వెంకట శేషమ్మ