అజయ్ (ఫైల్)
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ మండల కేంద్రం శివారు గ్రామం సిరిపురంలో ఆదివారం ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అక్కా నాకు బతకాలని లేదు..బావిలో దూకి చనిపోతున్నా’ అంటూ తన అక్కకు చివరగా ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన పర్స లింగన్న–కళావతి దంపతులకు అజయ్ (21), ముగ్గురు కూతుళ్లు సంతానం. అజయ్ జగిత్యాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి, ప్రస్తుతం రెండో సంవత్సరం చదవాల్సి ఉంది. లింగన్న ముగ్గురు కూమార్తెల్లో ఇద్దరికి వివాహం చేశాడు. రెండో కుమార్తె కుటుంబం మంచిర్యాలలో ఉంటుంది. ఈక్రమంలో అజయ్‌కు కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేక భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు లింగన్న తెలిపాడు. (‘అమ్మ’మ్మలే హతమార్చారు.. )
ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అజయ్ మంచిర్యాలలో ఉంటున్న అక్కకు ఫోన్ చేసి ‘అక్కా నాకు బతకాలని లేదు, నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని తెలిపి జైశ్రీరాం అంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేసి బావిలో దూకాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మంచిర్యాలలో ఉన్న అజయ్ అక్క తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని బావిలన్నింటినీ గాలించారు. బీర్‌పూర్ ఎస్సై మనోహర్‌రావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై తన సిబ్బందితో పాటు, గ్రామస్తులతో బావుల వద్దకు చేరుకుని గాలించారు. చివరకు ఓ బావి వద్ద అజయ్ చెప్పులు కనిపించడంతో బావిలో గాలించారు. కొక్కాలు వేసి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అజయ్ మృతదేహం కోసం ఎస్సై, ఏఎస్సై వెంకటయ్యతో పాటు ఎంపీపీ మసర్తి రమేష్, సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, ఉపసర్పంచ్ హరీష్, గ్రామస్తులు బావి వద్ద అవసరమైన చర్యలు తీసుకున్నారు.(మాతృదేవతా మన్నించు! )
Comments
Please login to add a commentAdd a comment