
కుషాయిగూడ: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాస్తా హత్యకు దారితీసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు భర్త. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. శుక్రవారం ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం, తేజ్‌పూర్‌కు చెందిన సంతోష్ చౌహాన్ (35), దీపాలి (26) దంపతులు జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. చర్లపల్లిలోని ఓ కంపెనీలో పని చేస్తూ వెంకట్‌రెడ్డినగర్‌లో నివాసముంటున్నారు.
సంతోష్‌చౌహాన్ గురువారం కంపెనీలో పని ముగించుకొని రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో జీతం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు ఇంట్లో ఉండగానే భార్య దీపాలిని గదిలోకి తీసుకెళ్లి పట్కార్‌తో కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య మెడకు చున్నీకట్టి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. తాను మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని స్థానికులను, పోలీసులను నమ్మించాడు. అయితే...పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment