పహాడీషరీఫ్: కాళ్లు, చేతులు కట్టేసి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉంచిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ భాస్కర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బురాన్‌ఖాన్ చెరువు ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఉండడాన్ని శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందించారు. వనస్థలిపురం ఏసీపీ జయరాం, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, ఎస్సై నాగరాజ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని కాళ్లు, చేతులు కట్టి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉంచారు. మృతుడి వయసు 20 ఏళ్లు ఉండవచ్చునన్నారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడాన్ని బట్టి మూడు నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించడంతో పాటు ఇతర ఠాణాల్లో నమోదైన మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment