భార్య వేధింపులకు తాళలేక భర్త ఆత్మహత్య | Husband Commits Suicide With Wife Harassment in Prakasam | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం

Published Thu, Jun 18 2020 12:42 PM | Last Updated on Thu, Jun 18 2020 12:42 PM

Husband Commits Suicide With Wife Harassment in Prakasam - Sakshi

దేవరాజుగట్టు (పెద్దారవీడు): తరుచూ భార్య వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన భర్త చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని దేవరాజుగట్టులో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కటికల దావీదు (50)కు ఆయన భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. స్థానికులు ఉదయం ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లారు. కాలనీలో ఎవరూ లేని సమయంలో గ్రామం సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంకు వెనుక వేప చెట్టుకు ఉరేసుకుని దావీదు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు దావీదు తన చిన్న తమ్ముడికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. వెంటనే బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడికి భార్య బాలకుమారి, వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు.

పురుగుమందు తాగి ..
కొండపి: మండలం గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన గోనెల వెంకటేశ్వర్లు (21) బుధవారం పొలాల్లో మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించే వెంకటేశ్వర్లు కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగాడు. కుటుం బసభ్యులు సమాచారం అందుకుని అతడిని కొండపి వైద్యశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం 108లో ఒంగోలు తీసుకెళ్తుండగా  మార్గంమధ్యలో వెంకటేశ్వర్లు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ హనుమంతురావు తెలిపారు.

మరో యువకుడు కూడా..
ఉలవపాడు: పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రం ఉలవపాడులో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక దర్గా సెంటర్‌కు చెందిన మున్వర్‌బాషా (25) మంగళవారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆయన్ను స్థానిక వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మున్వర్‌ బాషా మృతి చెందాడు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. మృతుడికి వివాహం కాలేదు. హోటల్‌ వ్యాపారంలో తండ్రికి అండగా ఉంటున్నాడు.  ఎస్‌ఐ దేవకుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత బలవన్మరణం
మద్దిపాడు: కడుపునొప్పి తాళలేక వివాహిత ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నేలటూరు ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఎలీసమ్మకు నేలటూరు ఎస్సీ కాలనీకి చెందిన వడేల సుబ్బారావుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.  భర్త పనికి వెళ్లిన తర్వాత కడుపునొప్పి విపరీతంగా రావడంతో భరించలేక  ఎలీసమ్మ (28) ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement