మంత్రునాయక్ మృతదేహం, వెంకటస్వామి (ఫైల్)
పెద్దదోర్నాల: చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మేఘావత్ మంత్రునాయక్ (23)గ్రామ సమీపంలో రోడ్డు పక్కనున్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అబ్దుల్ రహిమాన్ హుటాహుటిన నల్లగుంట్లకు చేరుకుని కేసు విచారణ చేపట్టారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మంత్రునాయక్ తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి సాధునాయక్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి, సవతి తల్లి శ్రీశైలంలో నివాసం ఉంటున్నారు. మంత్రునాయక్ తన తల్లిదండ్రులతో పాటు వెళ్లకుండా నల్లగుంట్లలో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. ఆటోలు, ట్రాక్టర్లకు బాడుగలకు వెళ్తూ తద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. వివాద రహితుడిగా, ఎటువంటి గొడవల్లో తలదూర్చని మంత్రునాయక్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతుడి చేతిపై గతంలో ఏర్పడిన గాట్ల ఆధారంగా ప్రేమ వ్యవహారమే అతడి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసుకు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.
మరొకరు కూడా..
వేటపాలెం: ఓ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. వేటపాలెం చుండూరిలొంపకు చెందిన యాసం వెంకటస్వామి (42) కుందేరు రోడ్డులోని తన సిమెంటు ఖార్ఖానాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి సన్నిహితులు, బంధువులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరికి సుపరిచితుడైన వెంకటస్వామి అకాల మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment