పేదింట పుట్టినా ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ తనకంటూ గుర్తింపు సాధించుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘రోజూ చనిపోవడం కంటే ఒకసారే చనిపోవాలనుకున్నాను’ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొనడం హృదయాలను కలిచివేస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమే కారణమని పోలీసులు చెబుతున్నారు.
గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్‌స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ సమాచారం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన వంకబోయిన గాలయ్య, నాగమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు వంకరబోయిన శ్రీనివాసులు(27) గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసే అన్న కృష్ణమూర్తితో కలిసి సుదర్శన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం 8.30 గంటలకు తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే బెడ్‌రూమ్ గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. (ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!)
ఎంత పిలిచినా తమ్ముడు శ్రీనివాసులు పలుకలేదు. దీంతో తలుపు విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కాల్ చేయగా 108 వచ్చి చూసి శ్రీనివాసులు అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్‌తో పాటు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు ‘తన చావుకు ఎవరు కారణం కాదని... బతకాలని లేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... రోజు చావడం కంటే ఒకే సారి చస్తున్నా’నని సూసైడ్ నోట్‌లో రాశాడు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రేమ విఫలమే కారణమా?
మేస్త్రీ పని చేసే గాలయ్య, కూలీ పనులు చేసే నాగమ్మల చిన్న కొడుకు శ్రీనివాసులు ఉన్నత చదువు చదివి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతిని ప్రేమించగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు సోదరుడు కృష్ణమూర్తి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆరు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. లాక్‌డౌన్ సమయంలో ఊరికి వెళ్లిన సోదరుడు ఇంటి నుంచే కొద్ది రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేశారని తెలిపారు. యువతి కుటంబ సభ్యులతో తాను వెళ్లి మాట్లాడతానని చెప్పినా తన తమ్ముడు శ్రీనివాసులు అంగీకరించలేదన్నారు. మూడు నెలల క్రితం నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుదర్శన్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని మరువలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment