మేట్రిన్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఐ, ఎస్సై
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం (జీలుగుమిల్లి): జీలుగుమిల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న బొడ్డు నవ్యశ్రీ (16) సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ ఏఎన్‌ఎన్ మూర్తి కథనం ప్రకారం నవ్యశ్రీ మధ్యాహ్న భోజనం అనంతరం హాస్టల్‌లో తోటి విద్యార్థులతోపాటు విశ్రాంతి తీసుకుంది. అయితే మళ్లీ చదువుకునేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తున్న సమయంలో నవ్యశ్రీ కనిపించలేదు. దీంతో ఆమె కోసం వెతకగా పక్కనే ఉన్న 8వ తరగతి గదిలో చున్నీతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంది. దీంతో హాస్టల్ సిబ్బంది నవ్యశ్రీని హుటాహుటిన జీలుగుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
తల్లిదండ్రులు అచ్యుతరావు, ఝాన్సీల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని సీఐ మూర్తి తెలిపారు. హాస్టల్ మేట్రిన్ రాజ్యలక్ష్మిని వివరాలు అడిగి తెసుకున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పి.వెంకటేశ్వరరావు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థిని మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన నవ్యశ్రీ మూడేళ్ల క్రితం ఆశ్రమ పాఠశాలలో చేరిందని, చదువులోనూ ముందుండేదని ఉపాధ్యాయులు తెలిపారు. నవ్యశ్రీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురు మృతిపై మేట్రిన్ సమాధానం చెప్పాలంటూ ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులతోపాటు సీపీఎం ఆధ్వర్యంలో బంధువులు ఆందోళన చేశారు. మృతి చెందిన నవ్యశ్రీ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేయాలని న్యాయవాది జువ్వల బాజీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment