
కరీంనగర్‌క్రైం/కొత్తపల్లి(కరీంనగర్): మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గబ్బిలాలపేటలో ఇద్దరు మహిళలు, చిన్నారి మృతి ఘటన కరీంనగర్ పట్టణంతోపాటు కొత్తపల్లి మండలం చింతకుంటలో విషాదం మిగిల్చింది. మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి ఎలా వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? ఎవరు సహకరించారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 10న కొత్తపల్లి మండలం రేకుర్తిలో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వీళ్లు ఏ కారణంతో వెళ్లారనేది మిస్టరీగా మారింది. కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న అనూష(26), సుమతి(29) మృతదేహాలు సోమవారం ఉదయం మేడ్చల్ జవహర్‌నగర్ పరిసరాల్లో వేలాడుతూ కనిపించగా, అనూష కూతురు ఉమామహేశ్వరి(8) బాత్రూం శుభ్రం చేసే రసాయనాలు తాగి మృతిచెంది ఉంది. ఈ నెల 10న పేదకూలీలకు కరీంనగర్ శివారు రేకుర్తిలో మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన బియ్యం పంపిణీ వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలస్యంగా ఇంటికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది. అదే రోజు సాయంత్రం మేడ్చల్ జవహార్‌నగర్‌కు పయనమైనట్లు సమాచారం.
కుటుంబ నేపథ్యం...
ఖమ్మం ప్రాంతానికి చెందిన అనూషకు కరీంనగర్ కాపువాడకు చెందిన నాగరాజుతో వివాహం కాగా అదే ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం కోసం అనుమతి ప్రయత్నాలు కొనసాగించినట్లు తెలిసింది. అనూష రెండు నెలల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్కడ పనిచేసే క్రమంలోనే జవహార్‌నగర్‌లోని గబ్బిలాలపేటలో ఒక చర్చి ఫాస్టర్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే అనూష కూతురు, ఆమె స్నేహితురాలు సుమతి జవహార్‌నగర్‌కు వెళ్లడానికి కారణమైనట్లు సమాచారం. వెల్గటూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మోతె బానయ్య, నాగమ్మ కుటుంబం కొత్తపల్లి మండలం చింతకుంటలో నివాసం ఉంటోంది. వీరి కూతురు సుమతి డ్రైవర్ శ్యాంను ప్రేమ వివాహం చేసుకుంది. జ్యోతినగర్‌లో ఉండే వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. లాక్‌డౌన్ ఉండగా కరీంనగర్ నుంచి 160 కిలోమీటర్లు మేడ్చల్‌కు ఎలా వెళ్లారు.. ఎవరి సహకారంతో వెళ్లారు.. ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలియరాలేదు. 10న కరీంనగర్ నుంచి వెళ్లిన తర్వాత వీరి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎక్కడా ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment