ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది దాదాపు 85 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక తెలిపింది. పంట నష్టం, అప్పుల భారంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. మెదక్, నల్గొండ, అదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధిక రైతు బలవన్మరణాలు సంభవించినట్లు బి. కొండల్‌రెడ్డి నిర్వహించిన సర్వేలో తేలిందని ఆర్‌ఎస్‌వీ నివేదిక పేర్కొంది. ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న భూపాలపల్లి జిల్లాకు చెందిన కొమురయ్య అనే రైతు అప్పులు తీర్చలేక మే 5న పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపింది. అదే విధంగా కామారెడ్డి జిల్లా డోంగ్లి గ్రామానికి చెందిన ఆశాబాయి అనే మహిళా రైతు ఆశించిన దిగుబడి రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
పెళ్లి కోసం మూడు ఎకరాలు అమ్మి..
రైతు ఆత్మహత్యలపై సర్వే నిర్వహించిన కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి దాదాపు 4,600 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ 1600 మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాల్లో పొందుపరిచారు. వీటిపై మరింత స్పష్టత రావాలి. కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో పత్తి రైతులే ఎక్కువ మంది ఉన్నారు.
ఖమ్మంలోని లచ్చిరాం తండాకు చెందిన రైతు దంపతులు మే 17న ప్రాణాలు తీసుకున్నారు. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆరు ఎకరాల్లో మూడు ఎకరాలు అమ్మారు. మిగిలిన భూమిలో వ్యవసాయం చేయగా నష్టాలు, అప్పులే మిగిలాయి. దీంతో వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో మంది రైతులు వీరిలాగే బలవంతంగా తనువు చాలిస్తున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రైతు ఆత్మహత్యలపై స్టేట్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇంతవరకు ఎటువంటి నివేదిక విడుదల చేయలేదు. ఆర్‌ఎస్‌వీ నివేదికపై వారు స్పందించలేదు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment