గొలుసు కట్టు.. గుట్టు రట్టు! | Fraud in the name of Green Gold Biotech Company | Sakshi
Sakshi News home page

గొలుసు కట్టు.. గుట్టు రట్టు!

Published Thu, Jan 24 2019 2:09 AM | Last Updated on Thu, Jan 24 2019 2:09 AM

Fraud in the name of Green Gold Biotech Company - Sakshi

గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

హైదరాబాద్‌: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించారు.. ఏజెంట్ల ద్వారా భారీ ప్రచారం చేశారు.. యంత్రం కొనుగోలు చేసిన వారికి నెలకు రూ.20 వేలు ఇస్తామని నమ్మబలికారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు.. చివరికి వారందరినీ మోసం చేసి బోర్డు తిప్పేయాలని పన్నాగం పన్నారు. చివరికి పోలీసులు ఈ మోసగాళ్ల గుట్టు విప్పారు.  

ఇదీ మోసం.. 
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జిన్నా శ్రీకాంత్, భాస్కర్‌ అనే మరో వ్యక్తితో కలసి హైదరాబాద్‌ ఉప్పల్‌లో గ్రీన్‌గోల్డ్‌ బయోటెక్‌ పేరిట గతేడాది ఓ కంపెనీ ప్రారంభించారు. రూ.లక్ష చెల్లిస్తే వేరు శనగ గింజల నుంచి నూనె తీసే యంత్రం ఇస్తామని చెప్పేవారు. ప్రతి నెలా రూ.20 వేలు ఇస్తామని ఏజెంట్ల ద్వారా చాలా మందిని నమ్మించారు. ఏజెంట్లకు కూడా భారీ నజరానాలు ఇస్తామని ఆశ చూపెట్టారు. ఇలా కొద్ది కాలంలోనే అక్కడి ప్రజలకు నమ్మకంగా ఉంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. బుధవారం రంగంలోకి దిగిన పోలీసులు ఉప్పల్‌లో ఉన్న సంస్థ కార్యాలయంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. 

మోసం బయటపడిందిలా.. 
సరూర్‌నగర్‌లో నివాసం ఉండే ఎన్‌.ఇందిరా కిరణ్‌ (28) అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. ఓ రోజు వేరుశనగల నుంచి నూనె తీసే యంత్రం స్కీం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. నూనెతో పాటు నెలకు రూ.20 వేలు కూడా వస్తాయని నమ్మి, మరుసటి రోజే గ్రీన్‌గోల్డ్‌ కార్యాలయానికి వెళ్లి నిర్వాహకులను సంప్రదించాడు. ఆ ‘స్కీం’గురించి అన్ని వివరాలు చెప్పి కిరణ్‌ను శ్రీకాంత్‌ నమ్మించాడు. ఇచ్చిన లక్ష రూపాయల నుంచి నెలనెలా రూ.20 వేల చొప్పున ఇస్తామని అగ్రిమెంట్‌ కూడా రాసుకున్నారు. అయితే నెల దాటినా కూడా డబ్బులు రాకపోవడంతో కంపెనీ యాజమాన్యాన్ని ఆశ్రయించాడు. అయినా ఫలితం లేకపోయింది. తనలాగే చాలా మందిని కంపెనీ యాజమాన్యం మోసం చేసిందని గుర్తించిన బాధితుడు కిరణ్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. సూత్రధారులు శ్రీకాంత్, భాస్కర్‌ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఆశ చూపి మాయ చేశారు 
ఆశలు చూపి మాయ చేశారు,, హంగులు ఆర్భాటాలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపి చివరకు నట్టేట ముంచారని చిలుకానగర్‌కు చెందిన రాంరెడ్డి తన ఆవేదనను తేలిపారు. మూడు నెలల క్రితం రూ.70 వేలు కట్టించుకున్నారని మొదట్లో మూడు నెలల వరకు రూ.10 వేలు నెలకు బ్యాంకు ఖాతాల్లో వేసేవారని తరువాత కొత్త కష్టమర్లను నమ్మడానికి పాత వారిని వదిలేసి కొత్త వారికి డబ్బులు వేసి అనేక రకాలుగా నమ్మించి మోసం చేశారని తన ఆవేదనను వెల్లడించారు. 
–చిలుకానగర్‌కు చెందిన రాంరెడ్డి బాధితుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement