సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జూన్... ఖరీఫ్ సీజన్‌కు ప్రారంభకాలం! రుతుపవనాలు రైతన్నలను పలకరించే సమయం. కానీ వరుణుడు మాత్రం సయ్యాట ఆడుకున్నాడు. వస్తే అధిక వర్షాలు... లేదంటే చిరుజల్లులతో సరి. జూన్ మొదటి వారంలో ముఖం చూపించి మూడు రోజులు మురిపించి నా జిల్లాలో మూడో తేదీన మాత్రమే
ఎక్కువ వర్షం పడింది. తర్వాత ఆ స్థాయి లో వర్షం 25వ తేదీ తర్వాత మాత్రమే కనిపించింది.
కానీ విడవకుండా చివరి ఐదు రోజులు వర్షాలు కురవడం వల్ల రైతన్నలకు ఊరట కలిగించినా... మరోవైపు నష్టం కూడా తప్పలేదు. అప్పటికే వరి విత్తనాల ఎదలు వేసిన పొలాలు నీటిమునిగాయి. విత్తనాల నారు పోతలకూ ఆలస్యమైంది. జిల్లాలో జూన్ నెలలో 6,265.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 5,125. 9 మిమీ కన్నా 22.2 శాతం అధికం. సగటు వర్షపాతం పరిశీలిస్తే 164.9 మిమీ కురిసింది. ఇది జిల్లా సాధారణ సగటు వర్షపాతం 134.9 మిమీ కన్నా కాస్త ఎక్కువ. జూన్ నెల మొత్తంమీద 28వ తేదీన అత్యధికంగా 1,163.4 మిమీ అంటే సగటున 30.6 మిమీ వర్షపాతం నమోదైంది.
కానీ ఆ రోజున వీరఘట్టం మండలంలో చినుకు రాలలేదు. తర్వాత 30వ తేదీన 884.8 మిమీ అంటే సగటున 23.3 మిమీ వర్షం కురిసింది. ఈరోజున జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం పడ టం విశేషం. ఈ స్థాయిలో వర్షపాతం మొ దటివారంలో మూడో తేదీన మాత్రమే కనిపించింది. జిల్లాలో మొత్తం 1,093.9 మిమీ అంటే సగటున 28.8 మిమీ వర్షపాతం నమోదైంది. కానీ జూన్ 11, 13, 15, 16వ తేదీల్లో జిల్లాలో ఎక్కడా చినుకు పడలేదు. ఆ రోజుల్లో ఎండలు మండిపోయాయి. 15, 16వ తేదీల్లో గతంలో లేనంతగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పులకించిన లావేరు
ఏటా జూన్ నెలలో వర్షపాతం తక్కువగా ఉండే లావేరు మండలం ఈసారి మాత్రం వర్షాలతో పులకించింది. సాధారణ వర్షపాతం (107.9 మిమీ) కన్నా 130.2 శాతం అధికంగా (248.4 మిమీ) వర్షం కురిసింది. అలాగే జిల్లాలో అత్యధికంగా పాతపట్నం (265.6 మిమీ) మండలంలో వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (134.6 మిమీ) కన్నా 97.3% అధికం. ఇదే వరుసలో టెక్కలిలో 247 మిమీ, రణస్థలంలో 229.2, ఇచ్ఛాపురంలో 224.8, రాజాం 219.8, వంగర 213.4, సరిబుజ్జిలి 212.4, ఎల్‌ఎన్ పేటలో 210.4 మిమీ వర్షపాతం నమోదైంది.
ఎచ్చెర్లపై శీతకన్ను.
జిల్లాలోని అన్ని మండలాలతో పోల్చితే ఎచ్చెర్లలో సాధారణ వర్షపాతం (113.2 మిమీ) కన్నా 50.7% తక్కువగా 55.8 మిమీ మాత్రమే నమోదైంది. తర్వాత జలుమూరు మండలంలో 129.7 మిమీ సాధారణ వర్షపాతం కాగా 42.5% తక్కువగా 76.6 మిమీ మాత్రమే పడింది. భామినిలో 146.2 మిమీ సగటు వర్షపాతం కాగా, 27.4 శాతం లోటుతో 106.2 మిమీ వర్షపాతం నమోదైంది. అలాగే సారవకోట మండలంలోనూ 22.7 శాతం లోటుతో 127.4 మిమీ వర్షం పడింది. కాగా ఇక్కడి సగటు వర్షపాతం 164.8 మిల్లీమీటర్లు.
సీతంపేటకు చిరుజల్లులే
ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట మండలంలో గత నెలలో అత్యధికంగా 14 రోజులు వర్షపాతం నమోదైనా అవి చిరుజల్లులే. దీంతో సాధారణ వర్షపాతం 189.6 మిమీ కాగా 11.8 మి.మీ లోటుతో 167.2 మిమీకే పరిమితమైంది. హిరమండలంలో 13 రోజులు వర్షం పలుకరించినా సాధారణ వర్షపాతం (167.8 మిమీ) కన్నా కాస్త ఎక్కువగా (175.6 మిమీ) పడింది. సారవకోట మండలంలో పది రోజులు వర్షం పడినా 22.7 శాతం లోటు వర్షపాతం తప్పలేదు. జూన్ నెల మొత్తం పరిశీలిస్తే 18 మండలాల్లో సగటు వర్షపాతం కన్నా అధికంగానూ, 16 మండలాల్లో సగటు వర్షపాతంతో సమానంగా, నాలుగు మండలాల్లో సగటు కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి.
కనిపించిన జలకళ
గత ఏడాది జూన్ ప్రారంభం నాటికే జిల్లాలోని ప్రాజెక్టులు, జలాశయాలు నిండుగా కనిపించాయి. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. నెలాఖరులో ఐదు రోజులుగా పడిన వర్షాలతో ఇప్పుడిప్పుడే జలకళ కనిపిస్తోంది. వంశధార నదిలో గొట్టా బ్యారేజీ వద్ద ప్రస్తుతం 1,530 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. గత ఏడాది ఇదే సమయ్యానికి మూడు వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం ఉంది.
నాగావళి నదిలో శ్రీకాకుళం పాతవంతెన వద్ద శుక్రవారం 22,800 క్యూసెక్కుల నీరు పారుదల ఉంది. నారాయణపురం జలాశయం వద్ద 21,350 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 105 మీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న తోటపల్లి ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రానికి 103.55 మీటర్ల నీటిమట్టం ఉంది. ఒడిశాలోని క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు పడుతుండటంతో జలాశయంలోకి 1,011 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు 3,489 క్యూసెక్కుల నీ టిని వదులుతున్నారు.
నీట మునిగిన ఎదలు
జూన్ నెల ప్రారంభంలో పడిన వర్షాలతో రైతులు దాదాపు 50 వేల హెక్టార్లలో వరి విత్తనాలు పొలాల్లో ఎదజల్లారు. కానీ నెలాఖరున ఐదు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో సుమారు 30 వేల హెక్టార్లలో ఎదపొలాలు పూర్తిగా నీటమునిగాయి. మిగతా ఎదపొలాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు మళ్లీ విత్తన కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తొలిసారే రాయితీ విత్తనాలు అరకొరగా అందాయి. ఇప్పుడు అవీ దొరకని పరిస్థితి. పెట్టుబడి కూడా అధికమవుతోంది.
మోదం... ఖేదం!
Published Sat, Jul 2 2016 12:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement