వ్యవసాయరంగాన్ని ఆదుకోవాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వ్యవసాయరంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షుడు బి. బలరాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన రైతు రుణ మాఫీ, పగలు 9 గంటల నాణ్యమైన నిరంత విద్యుత్ సరఫరా హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రుణ కార్యాచరణ ప్రకటించకపోవడం దుర్మార్గమన్నారు. రుణ ప్రణాళికలో సన్న, చిన్నకారు, పేద, కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
బ్యాంకుల నుంచి రుణాలు పొందని పేద, కౌలు రైతులు నూటికి 70 నుంచి 80 శాతం మంది ఉన్నారన్నారు. వీరు ప్రైవేటు అప్పులు, వడ్డీల భారంతో కుంగిపోతున్నారన్నారు. విత్తనాల కొరత లేకుండా అవసరమైన అన్ని పంటల విత్తనాలు సకాలంలో అందించాలని కోరారు. విత్తనాల సబ్సిడీ కుదింపు రేట్ల పెంపు తగదన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి కె.మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశా రు. విత్తనాల కొరత లేకుండా చూడాల న్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సావనీర్ విడుదల చేశారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు పి.ప్రసాదరావు, పినకాన కృష్ణమూర్తి, బమ్మిడి శ్రీరాములు, ఎస్.లక్ష్మీనారాయణ, భూపతిరావు నందోడు పాల్గొన్నారు.