రైతులందరికీ రుణమాఫీ
శ్రీకాకుళం అర్బన్:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ఏపీ రైతుసంఘం, కౌలు రైతుల సంఘం, దాని అనుబంధ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాల యంలో గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు అంపలాం మాధవరావు, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.మోహనరావులు మాట్లాడుతూ ఎటువంటి షరతులూ లేకుండా ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకూ వాడిన రుణాలకు రుణమాఫీ వర్తింపజేయాల న్నారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం వద్ద సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం 10 గంటలకు ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు.
జీవో నం బరు 174 పూర్తి సవరణలతో రైతులకు పూర్తిగా సహాయం చేసే వరకూ పోరా టం ఆగదన్నారు. అఖిలభారత కూలీ సంఘ అధ్యక్షుడు తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ రుణమాఫీపై తొలి సం తకం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం కమిటీ వేసి కాలయాపనతో పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడు కె.నారాయణరావు మాట్లాడుతూ రైతులకు పూర్తి రుణ మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన తరువాత ఇవ్వలేమని చెప్పడం శోచనీయమన్నా రు. ఏపీ రైతు కౌలుదారుల జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ రుణమాఫీ వల్ల రాష్ట్రంలో కౌలు రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఏపీ రైతు కూలీ సంఘం కార్యదర్శి తాండ్ర అరుణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు.
డిమాండ్‌లు
మార్చి 31, 2014 వరకూ రైతులు తీసుకున్న పంటరుణాలకు రుణమాఫీ వర్తింపజేయాలని, నిబంధన 3ను సవరించి రుణగ్రస్తుని అప్పుల ఖాతాకు జమచేయాలని, పట్టాదారు పాసుపుస్తకం/రుణ అర్హత తీర్పు ఉంటేనే మాఫీ అన్న 21వ నిబంధన తొలగించాలని, రైతుమిత్ర, జాయింట్ లైబిలిటీ గ్రూపు లు ద్వారా తీసుకున్న రుణాలన్నింటినీ పంట రుణాలుగా పరిగణించాలని, కౌలు రైతులు, సన్న, చిన్నకారురైతులు బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలను పంట రుణాలుగా పరిగణించాలని, సహకార బ్యాంకులలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వాల్యూ డిక్లరేషన్లు ద్వారా తీసుకొన్న సన్న, చిన్నకారు రైతులు పొందిన రుణమొత్తాలను పట్టాదారు పాస్ పుస్తకంతో నిమిత్తం లేకుండా రుణమాఫీ వర్తింపజేయాలని, ఉద్యానవన పంటలకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని, 2013 పంటల బీమా క్లెయిమ్‌ల సొమ్ములు ప్రభుత్వం జమ చేసుకోవాలన్న నిబంధనలోని 6వ అంశాన్ని తొలగించాలని, కుటుంబంలో విడిపోయి భూములు వేరుకానివారు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌లు చేశారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు ఎస్.భాస్కరరావు, టి.నందోడు, పి.ప్రసాదరావు పాల్గొన్నారు.