25 శాతం మందికే లబ్ధి
శ్రీకాకుళం: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో పూటకో నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వ తీరుతో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న రైతులు.. తాజా నిర్ణయంతో తొలివిడతలో 25 శాతం మందికే రుణమాఫీ వర్తిస్తుందని తెలుసుకొని నీరుగారిపోతున్నారు. మిగతా వారందరూ వడ్డీలతో సహా బకాయిలు కట్టాల్సిందేనని బ్యాంకులు స్పష్టం చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీకి సంబంధించి గురువారం విధాన నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలివిడతలో రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని.. మిగిలిన రుణాలను దశలవారీగా మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
రుణమాఫీ పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొంది, అధికారంలోకి వచ్చాక ఆ ఫైలుపైనే తొలి సంతకం అంటూ హంగామా చేసిన చంద్రబాబు.. ఇప్పటికే నానారకాల ఆంక్షలతో అర్హుల జాబితాను దాదాపు సగం కుదించేశారు. రుణగ్రహీతల్లో దాదాపు 50 శాతం మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. నాలుగు రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి అధికార ప్రకటన విడుదల చేస్తూ అర్హుల జాబితాను ఈ నెల ఆరో తేదీనే బహిరంగంగా ప్రదర్శిస్తారని ప్రకటించినా.. అలా జరగలేదు. చివరికి శనివారం రాత్రి ఆ జాబితాలు లీడ్ బ్యాంకులకు చేరాయి. వాటిని సోమవారం ఆయా బ్యాంకు శాఖలకు పంపాలని లీడ్ బ్యాంకు అధికారులు నిర్ణయించారు.
కాగా తొలివిడతగా రూ. 50 వేల వరకు పంట రుణాలు ఉన్న వారి బకాయిలనే తీరుస్తున్నామని, మిగిలిన వారి విషయం ఆలోచించి దశల వారీగా చెల్లిస్తామని చెప్పడం కూడా గందరగోళానికి గురిచేస్తోంది. వీరిలో ఎంతమందిని చివరి క్షణంలో అనర్హులన్న ముద్ర వేసి తొలగిస్తారోనన్న బెంగ రైతుల్లో ఉంది. ఆరు నెలల పాటు రైతులను రుణ వాయిదాలు చెల్లించనివ్వకుండా చేయడంతో ప్రస్తుతం రైతులు అదనంగా 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. చక్రవడ్డీతో సహా చెల్లించాల్సి రావడం తలకు మించిన భారంగా పరిణమించింది. జిల్లాలో అన్ని రకాల రుణాలు కలసి రూ.1900 కోట్ల వరకు ఉన్నాయి. బంగారం ఆభరణాలపై 1.03 లక్షల మంది రైతులు రూ.772 కోట్ల రుణాలు తీసుకున్నారు. 3.16 లక్షల మంది రైతులు రూ.1142 కోట్ల వ్యవసాయ రుణాలు పొందారు. మరో 29 వేల మంది రైతులు రూ.80 కోట్ల మేరకు చిన్న(టర్మ్) రుణాలు తీసుకున్నారు.
అయితే తొలివిడతలో రూ. 50 వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో 25 శాతం మంది రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. మిగిలిన వారిపై బకాయిలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. బంగారంపై రుణాలు తీసుకున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. బకాయిలు చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చంద్రబాబు చేతిలో మరోసారి దగాకు గురయ్యామని ఆవేదన చెందడం తప్ప చేసేది లేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. విషయాన్ని లీడ్‌బ్యాంకు మేనేజర్ ఎం. రామిరెడ్డి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తొలి జాబితా తమకు చేరిందన్నారు. ఇప్పటికే బ్యాంకుల వారీగా జాబితాలను పంపించామని తెలిపారు. సోమవారం ఈ జాబితాను బ్యాంకులు తమ శాఖలకు పంపిస్తాయని చెప్పారు. అటు తరువాతే ఎంతమంది రైతులు ప్రయోజనం పొందారు? ఎంతమేర మాఫీ జరిగిందన్నది చెప్పగలుగుతామని అన్నారు.