మాఫీకి మరో టోపీ
జిల్లాలో రుణాల లెక్కలు ఇవీ...
జిల్లాలో అర్హులైన రైతులు 3.16 లక్షలు
రుణమాఫీ కావాల్సిన మొత్తం రూ.1142 కోట్లు
బంగారు ఆభరణాల ఖాతాలు : లక్షా 3వేలు
మాఫీ మొత్తం సుమారు : రూ.772 కోట్లు
చిన్న చిన్న (టర్మ్) అప్పులు తీసుకున్న ఖాతాలు : 29 వేలు
చెల్లించాల్సిన మొత్తం :రూ.88 కోట్లు
జిల్లా మొత్తం (అన్ని రకాలు కలిపి) సుమారు రూ.1900 కోట్లు
డ్వాక్రా రుణాలు
జిల్లాలో మొత్తం గ్రూపులు 43వేలు
వారి నుంచి బకాయిలు సుమారు రూ.705 కోట్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :అంతా అనుకున్నట్టే అరుు్యంది. చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రాసంఘాలు, చేనేతవర్గాల రుణాలు, పవర్‌లూమ్స్‌పై తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేస్తామని, బ్యాంకులకు డబ్బు చెల్లించొద్దని ఎన్నికల ముందు బాబు చేసిన ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. ఆరు నెలలవుతున్నా రుణమాఫీ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. పైగా వ్యవసాయం కాదు.. పంట రుణాలని ఓ సారి, అంత కాదు, ఇంతకే అంటూ మరోసారి చేసిన ప్రకటనలు జిల్లా రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టేశాయి. రూ.50వేల లోపు తీసుకున్న రుణాలకు తొలివిడతగా మాఫీ వర్తింపజేస్తామని, ఇందుకు సంబంధించి బ్యాంకుల నుంచి జాబితా రావాలని, ఈ నెల 6వ తేదీన తొలిజాబితా విడుదల చేస్తామని గురువారం చంద్రబాబు ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. డ్వాక్రా సంఘాల ప్రస్తావనే ఇందులో లేదు. పవర్‌లూమ్స్/చేనేత రుణాల గురించి బాబు మాటమాత్రమైనా చెప్పలేదు. పైగా తమ బాబు ఏదో చేసేశారంటూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని జిల్లా ప్రజలు ఈసడించుకుంటున్నారు. తుపాను బాధితుల్ని పట్టించుకోక, ఆరుగాలం శ్రమిస్తున్న రైతులకు ఊరటనివ్వకపోవడంపై మండిపడుతున్నారు.
బాబు ప్రకటన ప్రకారం..
గురువారం నాటి చంద్రబాబు ప్రకటన ప్రకారం కేవలం 65శాతం మంది రైతులే లబ్ధి పొందే అవకాశం ఉంది. అది కూడా అన్ని రకాల రుణాలపై కాదు. ఇప్పుడున్న 3లక్షల 60వేల ఖాతాల్లో నిబంధనలు/పరిశీలన/తప్పొప్పులు/బ్యాంకర్లు ఇచ్చిన జాబితా ప్రకారం సుమారు లక్షమంది రైతులు రుణమాఫీ పథకానికి అర్హులు కాలేరని బ్యాంకర్లే చెబుతున్నారు. అంటే లక్ష ఖాతాలు హాంఫట్టేనన్నమాట. జిల్లాలో 49వేల డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తామన్న బాబు..అది ఇంకెప్పుడు నెరవేరుతుందోనని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారు రుణాల ఖాతాలు సుమారు లక్షా 3వేలుంటే అందులో ఆధార్, రేషన్, సర్వే పేరిట కోత పడగా 80వేల ఖాతాలకే జాబితాలో చోటు దక్కినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన పావలా వడ్దీ, వడ్డీ లేని రుణాలైనా ఇప్పుడందే పరిస్థితి లేదు. మరోవైపు పంటరుణాలపై బీమా కూడా లేకపోయింది. వాటిపైనా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.
‘రాష్ట్రం విడిపోయింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అయినా రైతుల్ని ఆదుకుంటున్నామం’టూ జిల్లా టీడీపీ నేతలు గురువారం సంబరాలు చేసుకోవడ ంతో పాటు మీడియా సమావేశాలేర్పాటు చేయడాన్ని కూడా జిల్లా వాసులు తప్పుబడుతున్నారు. జిల్లాలో బంగారు రుణాలు మాఫీ కాని నేపథ్యంలో కౌలు రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2500 మంది కౌలు రైతులు ఉన్నట్లు తెలుస్తుండగా, అనధికారికంగా లక్ష మంది వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో 13 శాతం వరకు వడ్డీ పడే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా గతంలో రైతులు నష్టపోరుు బీమా మంజూరైన మొత్తాన్ని బ్యాంకులు జమచేసుకుంటున్నాయి. ఈ విషయమై రైతు సంఘాల నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నారు.