పంట రుణాలు తీసుకున్న రైతుల బంగారు ఆభరణాలకు సంబంధించి బకాయి తీర్చాలని నోటీసులిస్తున్నట్టు, వేలం హెచ్చరికలు జారీచేస్తున్నట్టు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తెలియదా.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి అన్న మాటలు నిజమో కాదో జిల్లాలో బాధిత రైతన్నల్ని చూస్తే తెలుస్తుంది. రుణం మాఫీ కాకపోగా ..తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని బ్యాంకర్లు బెదిరిస్తుంటే అన్నదాత భయంతో వణికిపోతున్నాడు. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని గద్దెనెక్కిన బాబు ప్రభుత్వం తర్వాత మాటే మార్చిన వైనం రైతులకు శాపంలా వెంటాడుతోంది. తాజాగా అందుతున్న బ్యాంకు నోటీసులు చూసి వారంతా తల్లడిల్లిపోతున్నారు. పరిస్థితిలా ఉంటే నోటీసులు, వేలం విషయం తన దృష్టికి రాలేదని మంత్రి చెప్పడంపై వీరంతా విస్తుపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో సుమారు 2.94లక్షలమంది రైతులు రూ.1200కోట్ల మేర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. చాలా మంది ఉన్న కొద్ది బంగారాన్ని తనఖా పెట్టి తీసుకున్నారు. రూ.50వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ వర్తింపజేయడంతో తొలివిడత లో కేవలం రూ.400 కోట్లే మంజూరైంది. మిగతా మొత్తానికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో చెప్పలేం అని బ్యాంకర్లే తేల్చేశారు. సుమా రు 254బ్యాంకులు రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలపై, బంగారు ఆభరణాలపై ఇచ్చిన రుణాలకు సంబంధించి లెక్కలేయడం ఆరంభించాయి. 2014డిసెంబర్ 31లోపు బకాయి ఉన్న రైతులంతా వడ్డీతో సహా బ్యాంకులకు అప్పుతీర్చాల్సిందేనని మొండికేస్తున్నాయి. దీంతో రైతన్నలు బ్యాంకులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏపీజీవీబీ, ఎస్‌బీఐ,ఆంధ్రాబ్యాంకు, డీసీసీబీ సహా ఇతర కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రుణపత్రాల్ని చూసి గగ్గోలు పెడుతున్నారు.
30వేల మంది..రూ.275కోట్లు
జిల్లాలో సుమారు 30వేల మంది రైతులు బంగారు ఆభరణాలపై సుమారు రూ.275కోట్ల రుణం తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 31ని కటాఫ్ డేట్‌గా ప్రభుత్వం ప్రకటించి మాఫీ అంటూ కొత్త రాగం తీసింది. గ్రామీణ వికాస్ బ్యాంకు సహా వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఇందులో మాఫీ మొత్తం ఎంతన్నది ఇప్పటికీ బ్యాంకు అధికారులు చెప్పలేకపోతున్నారు. 30శాతం మందికి మాఫీ ప్రయోజనం కలి గిందంటున్నా అందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారు. మాఫీలో భాగం గా వ్యవసాయ రుణాలతోపాటు ఆభరణాల రుణాలు లెక్క కూడా చూపిస్తున్నారు. ఇలా రూ.900కోట్లు జిల్లా వ్యాప్తంగా రుణాలివ్వ గా అందులో రూ. 625కోట్లు వ్యవసాయరుణాలేనని చెబుతున్నారు.
ఉద్యాన పంటరైతుల పరిస్థితి బాధాకరం
ఉద్యాన వన పంటల్ని వేసిన రైతులు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకున్నారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాల్లో ఈ అంశం లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తేరుకుని ఒక్కో రైతుకు రూ.10వేల సాయం అంటూ ప్రకటించారు. అది జిల్లాలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదు. చేనేత, డ్వాక్రా సంఘాల సభ్యుల పరిస్థితీ దారుణంగా ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాల రుణాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ వెలువడ లేదు. సుమారు 1017మందికి వివిధ బ్యాంకులు ఇప్పిటికే నోటీసులందించాయి. గడువులోగా స్పందించకపోతే నగల్ని వేలం వేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఆ నోటీసుల్ని చూసి రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను నిలువునా ముంచేసిందని ఆందోళన చెందుతున్నారు.
మచ్చుకు కొన్ని..
పలాస ఎస్‌బీఐలో పరిధిలో గతేడాది 217 మంది రైతులు నగలు తనఖా పెట్టి రూ.2.26 కోట్ల రుణం పొందారు. 2013-14లో 46మంది రూ.39.76లక్షల రుణాలు తీసుకున్నా మాఫీ అవుతుందన్న భరోసాతో సొమ్ము చెల్లించలేకపోయారు. వీరి ఆభరణాల్ని వేలం వేసేందుకు నిర్ణయించామని ఎస్‌బీఐ మేనేజర్ యు.వి.రాజకుమార్ స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేశామన్నారు.
నరసన్నపేట పరిధిలో కరూర్ వైశ్యాబ్యాంకు 10మందికి నోటీసులు పంపించింది.
పాతపట్నం పరిధిలో హిరమండలం ఎస్‌బీఐ పరిధిలో తొమ్మిది మందికి నోటీసులిచ్చారు.
పాల కొండ పరిధిలో తమ బకాయి చెల్లించాలని బ్యాంకులు సర్క్యులర్‌లు పంపాయి.
టెక్కలి పరిధిలో సంతబొమ్మాళిలో 32మందికి, కోటబొమ్మాళి పరిధిలో 42మందికీ నోటీసులెళ్లాయి.
గార మండల పరిధిలో 36మందికి నోటీసులు జారీ చేయగా, బ్యాంకు హెచ్చరికలు, వడ్డీ భయంతో 32మంది రైతులు సుమారు రూ.28లక్షల మేర సొమ్ము చెల్లించేశారు. చెల్లించనివారంతా ఆందోళనతో ఉన్నారు.
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో 11413 మంది రైతులు రూ. 35 కోట్ల 98లక్షల 54వేల 062 రుణం వాడుకున్నారు.
28వేల మంది కేవలం పంట మదుపు కోసమే నగలు తాకట్టు పెట్టి సుమారు రూ. 9 కోట్ల రుణం పొందారు. బ్యాంకర్లు తమ బకాయిపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారు. నోటీసులు జారీ కానప్పటికీ వారంతా మధనపడుతున్నారు.
రాజాం పరిధిలో కరూర్ వైశ్యాబ్యాంక్ ఇప్పటివరకూ 90 మంది రైతులకు నోటీసులు జారీ చేయగా, బ్యాంక్‌ఆఫ్ ఇండియా 64మందికి, రాజాం బ్రాంచ్ ఎస్‌బీఐ 120మంది రైతులకు, కార్పొరేషన్ బ్యాంకు పరిధిలో 75మందికి, కెనరాబ్యాంకు 43మందికి, డోలపేట ఎస్‌బీఐ పరిధిలో 22మందికి, ఆంధ్రాబ్యాంకు పరిధిలో మరో 110మంది రైతులకు నోటీసులందాయి.