ఇబ్బందులు తప్పేనా? | this year Problems in Rice cultivation | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు తప్పేనా?

Published Sat, Nov 5 2016 4:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

ఇబ్బందులు తప్పేనా? - Sakshi

ఇబ్బందులు తప్పేనా?

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2.14 లక్షల హెక్టార్లలో వరి సాగు అయింది. సుమారు 7.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యసాయాధికారుల అంచనా. అలాగే ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులకు అనుకూలంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉన్నతాధికారులు, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలులో అవినీతి అక్రమాలకు తావులేకుండా, నగదు చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఈఏడాది చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. కానీ గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు సహకారం అందించకపోవడంతో లెవీ ఆలస్యమైంది. పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి ధాన్యం చేర్చడానికి అయ్యే రవాణా చార్జీలను రైతులే భరించాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే తీరు ఉంది. రవాణా చార్జీలు పూర్తిగా ప్రభుత్వం భరించాలని రైతులు కోరుతున్నా ఈ విషయంలో అధికారులు హామీలేవీ ఇవ్వట్లేదు.
 
 గిట్టుబాటు అయ్యేనా...
 ఈ ఏడాది ధాన్యం క్వింటాలు (వంద కిలోలు)కు కామన్ గ్రేడ్ రూ.1,470, మేలు రకం (ఎ గ్రేడ్)కు రూ.1,510 చొప్పున రైతులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరలను బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో వారికేమీ గిట్టుబాటు అయ్యేట్లు లేదు. సాధారణంగా అనుకూల పరిస్థితుల్లో ఎకరాకు సగటున 15 నుంచి 20 క్వింటాళ్ల వరకూ ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్క ప్రకారం రూ.22 వేల నుంచి రూ.25వేల వరకూ నగదు చేతికందుతుంది. కానీ పెట్టుబడి మాత్రం ఎకరాకు రూ.30 వేలకు పైమాటే. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈనెల మూడో వారం నుంచే జిల్లాలో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఈ కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.
 
 కోరిన చోట కొనుగోలు కేంద్రాలు
 గత ఏడాది జిల్లాలో 114 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 6.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ ఏడాది 150 కేంద్రాల ద్వారా 7 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలనేది లక్ష్యం. అయితే గత ఏడాది కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఏర్పాటు చేయలేదు. కానీ ఈసారి మాత్రం రైతులు కోరినచోట ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 129 కేంద్రాలను అధికారులు గుర్తించారు. డీఆర్‌డీఏ-వెలుగు ఆధ్వర్యంలో 41, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ద్వారా 50, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 14, గిరిజన సహకార కేంద్రాల ద్వారా 11, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 11, జీఈసీఎస్ తదితర సహకార సంస్థలతో రెండు కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించారు.
 
  కాగా మరో 20 కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. నరసన్నపేట, కోటబొమ్మాళి, ఆమదాలవలస తదితర మండలాల్లో రైతులు తమకు అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అభ్యర్థనలు అందినట్లు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ హెచ్‌వీ జయరాం చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో  తూనిక యంత్రాలు, తేమను కొలిచే పరికరాలు, టార్పాలిన్‌లు, గోనె సంచులు సిద్ధం చేస్తున్నారు. కనీసం 1.50 కోట్ల గోనెసంచులు అవసరం కాగా, ప్రస్తుతం 35 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావాటిని పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించనున్నారు.
 
 రెండ్రోజుల్లోనే నగదు చెల్లింపులు..
 గత ఏడాది ధాన్యం అమ్మకం అయిన నెల రోజుల వరకూ చాలామంది రైతుల చేతికి నగదు అందలేదు. ఈ దృష్ట్యా ఈసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండ్రోజుల వ్యవధిలోనే నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ధాన్యం అమ్మకం సమయంలోనే రైతు నుంచి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement