ఏపీ: ఎరువుకు రాదు కరువు | AP Govt is making extensive arrangements to support farmers for kharif | Sakshi
Sakshi News home page

ఏపీ: ఎరువుకు రాదు కరువు

Published Mon, May 10 2021 3:31 AM | Last Updated on Mon, May 10 2021 9:27 AM

AP Govt is making extensive arrangements to support farmers for kharif - Sakshi

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సాగువేళ రైతు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెలలో వైఎస్సార్‌ రైతుభరోసా మొదటి విడత సొమ్ము, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా సొమ్ము దాదాపు రూ.6,230 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈనెల 13న వైఎస్సార్‌ రైతుభరోసా కింద 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,230 కోట్లను ప్రభుత్వం జమచేయనుంది.

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా – 2020 ఖరీఫ్‌కు సంబంధించి 38 లక్షల మంది రైతులకు ఈనెల 25న సుమారు రూ.2 వేల కోట్లు సొమ్ము ఇవ్వనుంది. సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు సబ్సిడీ విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్‌ సాగులో ఎంతో కీలకమైన ఎరువులకు కొరత లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించింది. గతంలో సీజన్‌ ప్రారంభమైన తర్వాత కూడా.. అదును దాటకముందు ఎరువులు అందుతాయో లేదో అనే ఆందోళనతో అన్నదాతలు కొట్టుమిట్టాడేవారు. కానీ ప్రస్తుతం సీజన్‌కు ముందే స్థానికంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కావాల్సిన ఎరువులను క్షేత్రస్థాయిలో నిల్వ చేస్తుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

20.20 లక్షల టన్నుల కేటాయింపు
ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో 92.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 21.70 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎంటీల) ఎరువులు అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం 20.20 లక్షల ఎంటీలు కేటాయించింది. వీటిని నెలవారీ డిమాండ్‌కు అనుగుణంగా ఆయా కంపెనీల ద్వారా కేటాయించనుంది. కోవిడ్‌ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 1.50 లక్షల టన్నుల ఎరువుల కొనుగోలుకు.. ఎరువుల పంపిణీకి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.75 కోట్లు విడుదల చేసింది. ముందస్తుగా 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను నాలుగంచెల çపద్ధతిలో క్షేత్రస్థాయిలో నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేశారు.

గ్రామస్థాయిలో ఒక్కో రైతుభరోసా కేంద్రం (ఆర్‌బీకే) వద్ద కనీసం 5 టన్నులు నిల్వచేస్తారు. ఇందుకోసం ఏపీ మార్క్‌ఫెడ్‌ వద్ద 40 వేల టన్నులు సిద్ధం చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు)/జిల్లా కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీల్లో కనీసం 40 వేల మెట్రిక్‌ టన్నులు నిల్వ చేయనున్నారు. ఇక సబ్‌ డివిజన్‌ స్థాయిలో ఆర్‌బీకే హబ్‌లలో 20 వేల టన్నులు నిల్వచేస్తారు. జిల్లాస్థాయి మార్క్‌ఫెడ్‌ గొడౌన్లలో 50 వేల టన్నులు, రిటైలర్, హోల్‌సేల్‌ డీలర్ల వద్ద 5 లక్షల టన్నులు, కంపెనీ గోదాముల్లో 1.50 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అదేవిధంగా ఆర్‌బీకేల వద్ద గ్రామస్థాయిలో ఖరీఫ్‌ కోసం కనీసం 2 లక్షల టన్నులు (యూరయా 85 వేల టన్నులు, డీఏపీ 28 వేల టన్నులు, ఎంవోపీ 9 వేల టన్నులు, కాంప్లెక్స్‌ 78 వేల టన్నులు) ఉంచాలని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్లకు నిర్దేశించారు. అవసరమైనచోట ఆర్‌బీకేల ద్వారా ఎక్కువ పరిమాణంలో రైతులకు ఎరువులను అందించేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ స్థాయిల్లో గోడౌన్లలో ముందస్తుగా నిల్వచేసే ఎరువుల నమూనాలను ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని జేడీలకు ఆదేశాలిచ్చారు. 

చరిత్రలో తొలిసారి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకనుగుణంగా చరిత్రలో తొలిసారి ఖరీఫ్‌ సీజన్‌లో సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువులను ఆర్‌బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నాం. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే లభ్యం కానున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కృత్రిమ ఎరువుల కొరత, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement