‘రూపే’ ఉంటేనే రుణం | District Cooperative Bank is the only rupee kisan card | Sakshi
Sakshi News home page

‘రూపే’ ఉంటేనే రుణం

Published Fri, Jun 2 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

District Cooperative Bank is the only rupee kisan card

రైతులకు తప్పనిసరి చేస్తూ నాబార్డు ఆదేశాలు
జిల్లాకు చేరిన కార్డులు 40 వేలు.. పంపిణీ చేసినవి 22 వేలు
ఖరీఫ్‌ ఆసన్నమవుతున్నా ప్రారంభం కాని రుణాల ప్రక్రియ


ఆదిలాబాద్‌టౌన్‌: రూపే కిసాన్‌ కార్డు ఉంటేనే జిల్లా సహకార బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని నాబార్డు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటికీ పంట రుణాల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈయేడాది మార్చిలోనే సహకార బ్యాంకుల పరిధిలోని రైతులందరికీ రూపే కార్డులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు సగం మందికే జారీ చేశారు. గ్రామస్థాయిలో రైతులకు అందే సేవలను డిజిటల్‌ చెల్లింపుల్లో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సహకార బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు రైతులందరికీ కార్డులు అందించాలని   నాబార్డు బ్యాంకులకు సూచించింది.

ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో 29 సహకార బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో 76 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సహకార బ్యాంకుల్లో 55,626 మందికి ఖా తాలు ఉన్నాయి. రూపే కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 22 వేల మంది రైతులకు మాత్రమే పంపిణీ చేశారు. కా గా జిల్లాకు 40వేల కార్డులు వచ్చాయని డీసీసీబీ అ ధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులందరికీ రూపే కార్డుల పంపిణీ చేస్తారా అనేది అనుమానంగానే ఉంది.

బోగస్‌ ఖాతాలకు చెక్‌..
రూపేకార్డులను వంద శాతం పంపిణీ చేస్తే సహకార బ్యాంకుల్లో రైతుల పేరిట తీసుకునే బడా బాబులకు చెక్‌ పడనుంది. రూపే కార్డు ఏటీఎం కార్డు లాగా పనిచేస్తుంది. రైతులకు పంట రుణ ఖాతా, పొదుపు బ్యాంక్‌ ఖాతా ఈ కార్డుకు అనుసంధానమై ఉంటాయి. రైతులకు మంజూరైన రుణాలు ఇక నగదు రూపంలో ఇవ్వకుండా రూపే కార్డును రైతు పేరుతో ముద్రించి రైతుకు అందజేస్తారు. రైతులకు కార్డులు అందించే సమయంలో ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో రైతులందరి నుంచి సంతకాలు తీసుకోవడానికి మరింత జాప్యం జరగనుంది. కార్డులను రైతులకు ఇవ్వాలంటే వారి కుటుంబానికి భూమికి సంబంధించిన 17 అంశాలు ఆధార్‌ సంఖ్యను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది.

 ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 76 సంఘాలకు గాను 52 సంఘాలకు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఇంకా 21 సంఘాలు ఆన్‌లైన్‌లో సేవలకు సంబంధించి నమోదు కాలేదు. ఈ లావాదేవీలు పాసు పుస్తకాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో పంట రుణాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పుస్తకంలో సర్దుబాటు విధానంతో బ్యాంకులు నెట్టుకొస్తున్నాయి. రూపే కార్డు విధానం వల్ల ఈ బోగస్‌ వ్యవహారానికి అడ్డుకట్ట పడనుంది. రైతులకు అందించే రుణాల మంజూరు, చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరపడం వల్ల ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిపోతుంది. ఏవైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఎం–పాస్‌ యంత్రాలు ఇచ్చేందుకు..
జిల్లా సహకార బ్యాంకుల ద్వారా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఎం–పాస్‌ యంత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిమగ్నమవుతున్నట్లు తెలుస్తోంది. రైతులకు జారీ చేసే రూపే కార్డులను సంఘాల్లో ఉపయోగించేందుకు వీలుంటుంది. వీటితో స్వైపింగ్, ఏటీఎంలో వినియోగించుకోవచ్చు. లావాదేవీలు జరుపుకోవచ్చు. త్వరలో సహకార బ్యాంకులకు సంబంధించి ఏటీఎంలను జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement