‘రూపే’ ఉంటేనే రుణం
► రైతులకు తప్పనిసరి చేస్తూ నాబార్డు ఆదేశాలు
► జిల్లాకు చేరిన కార్డులు 40 వేలు.. పంపిణీ అయినవి 22 వేలు
► ఖరీఫ్ సీజన్ ఆసన్నమవుతున్నా ప్రారంభం కాని రుణాల ప్రక్రియ
ఆదిలాబాద్‌టౌన్: రూపే కిసాన్ కార్డు ఉంటేనే జిల్లా సహకార బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని నాబార్డు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ పంట రుణాల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈయేడాది మార్చిలోనే సహకార బ్యాంకుల పరిధిలోని రైతులందరికీ రూపే కార్డులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు సగం మందికే జారీ చేశారు. గ్రామస్థాయిలో రైతులకు అందే సేవలను డిజిటల్ చెల్లింపుల్లో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సహకార బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు రైతులందరికీ కార్డులు అందించాలని నాబార్డు బ్యాంకులకు సూచించింది.
ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో 29 సహకార బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో 76 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సహకార బ్యాంకుల్లో 55,626 మందికి ఖాతాలు ఉన్నాయి. రూపే కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 22 వేల మంది రైతులకు మాత్రమే పంపిణీ చేశారు. కాగా జిల్లాకు 40వేల కార్డులు వచ్చాయని డీసీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులందరికీ రూపే కార్డుల పంపిణీ చేస్తారా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. ఈ కార్డులు ఇవ్వకపోతే రైతులకు రుణాలు అందడం కష్టంగా మారనుంది.
బోగస్ ఖాతాలకు చెక్..
రూపేకార్డులను వంద శాతం పంపిణీ చేస్తే సహకార బ్యాంకుల్లో రైతుల పేరిట తీసుకునే బడా బాబులకు చెక్ పడనుంది. రూపే కార్డు ఏటీఎం కార్డు లాగా పనిచేస్తుంది. రైతులకు పంట రుణ ఖాతా, పొదుపు బ్యాంక్ ఖాతా ఈ కార్డుకు అనుసంధానమై ఉంటాయి. రైతులకు మంజూరైన రుణాలు ఇక నగదు రూపంలో ఇవ్వకుండా రూపే కార్డును రైతు పేరుతో ముద్రించి రైతుకు అందజేస్తారు. రైతులకు కార్డులు అందించే సమయంలో ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో రైతులందరి నుంచి సంతకాలు తీసుకోవడానికి మరింత జాప్యం జరగనుంది.
రూపే కార్డు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా బోగస్ రుణాలు తీసుకున్నా నగదు తీసుకోవాలంటే సదరు రైతు నుంచి రూపే కార్డు పిన్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు రుణ మంజూరు విషయం తెలిసిపోతుంది. కార్డులను రైతులకు ఇవ్వాలంటే వారి కుటుంబానికి భూమికి సంబంధించిన 17 అంశాలు ఆధార్ సంఖ్యను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో బోగస్ రైతులకు రూపే కార్డులు అందకుండా అక్రమాలను అడ్డుకోవచ్చు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 76 సంఘాలకు గాను 52 సంఘాలకు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఇంకా 21 సంఘాలు ఆన్లైన్లో సేవలకు సంబంధిం చి నమోదు కాలేదు. ఈ లావాదేవీలు పాసు పుస్తకాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో పంట రుణాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పుస్తకంలో సర్దుబాటు విధానంతో బ్యాంకులు నెట్టుకొస్తున్నాయి. రూపే కార్డు విధానం వల్ల ఈ బోగస్ వ్యవహారానికి అడ్డుకట్ట పడనుంది. రైతులకు అందించే రుణాల మంజూరు, చెల్లింపులు ఆన్లైన్లో జరపడం వల్ల ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిపోతుంది. ఏవైనా అక్రమాలు జరిగితే సంబం ధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎం–పాస్ యంత్రాలు ఇచ్చేందుకు..
జిల్లా సహకార బ్యాంకుల ద్వారా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఎం–పాస్ యంత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిమగ్నమవుతున్నట్లు తెలుస్తోంది. రైతులకు జారీ చేసే రూపే కార్డులను సంఘాల్లో ఉపయోగించేందుకు వీలుంటుంది. వీటితో స్వైపింగ్, ఏటీఎంలో వినియోగించుకోవచ్చు. లావాదేవీలు జరుపుకోవచ్చు. త్వరలో సహకార బ్యాంకులకు సంబంధించి ఏటీఎంలను జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
4 వరకు కార్డుల పంపిణీ పూర్తి చేస్తాం
సహకార బ్యాంక్ పరిధిలోని రైతులందరికి జూన్ 4 వరకు రూపే కార్డులను పంపిణీ చేస్తాం. ఉమ్మడి జిల్లా పరిధిలో 55వేల మంది రైతులు ఉన్నారు. ఇప్పటివరకు 22వేల వరకు కార్డులను పంపిణీ చేయడం జరిగింది. మిగతావి గడువులోగా పూర్తి చేస్తాం. పంట రుణాలను జూన్ 2వ వారంలో అందజేస్తాం. రూపే కార్డులను ఏటీఎం మాదిరిగా వినియోగించుకోవచ్చు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా సహకార బ్యాంక్ సీఈవో.