సగంలోపే ఖరీఫ్ పంటరుణాలు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. కానీ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, బ్యాంకులు విఫలమయ్యాయి. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన పంటరుణ లక్ష్యంలో సగం కూడా బ్యాంకులు పూర్తి చేయలేదు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ బకాయి రూ. 2,020 కోట్లు విడుదల చేయకపోవడంతో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేశాయి. ఫలితంగా అన్నదాతలు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిస్థాయిలో పడక పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆందోళనలో పడిపోయారు. అప్పుల భారం పెరిగి ఆత్మహత్యల వైపు వెళ్తున్న భయానక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.
రుణమాఫీ సొమ్ముకు పంట రుణాల విడుదలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెప్పినా బ్యాంకులు నమ్మలేదని అర్థమవుతోంది. ఈ ఖరీఫ్‌లో రూ. 17,489 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాంకులు ఇప్పటివరకు రూ. 8,060 కోట్లే రైతులకు ఇచ్చాయి. రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కాగా బ్యాంకులు మా త్రం రుణ లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా ఇవ్వలేదు. సాగు విస్తీర్ణం పెరిగినా బ్యాంకులు స్పందించకపోవడంతో అన్నదాతలు ప్రైవేటు అప్పులవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు రూ.10 వేల కోట్ల మేరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసినట్లు అంచనా.
ఇన్‌పుట్ సబ్సిడీపై నీలినీడలు
కేంద్ర ప్రభుత్వం గతేడాది కరువు నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికసాయం చేసింది. కానీ ఆ నిధులను రైతులకు అందజేయడంలో సర్కారు నాలుగు నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోంది. 2015 ఖరీఫ్‌లో కరువుదెబ్బకు 30.58 లక్షల ఎకరాలకు తీవ్రంగా నష్టం జరిగిన సంగతి తెలిసిందే. కరువు ప్రభావంతో 20.91 లక్షల మంది రైతులు నష్టపోయారు. కరువు సాయంగా కేంద్రం రాష్ట్రానికి నాలుగు నెలల కిందట రూ.712 కోట్లు, రాష్ట్ర విపత్తు నిధికి రూ.108 కోట్లు మొత్తంగా రూ.820 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మూలుగుతోంది. ఈ సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.198 కోట్లు కలిపి రూ. 1,018 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీగా ఖరీఫ్ ప్రారంభానికి ముందే పంపిణీ చేయాల్సి ఉం డగా రేపు మాపు అంటూ జాప్యం చేస్తోంది.