కౌలు రైతులకూ భరోసా | Assurance to tenant farmers | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకూ భరోసా

Published Sun, Aug 20 2023 5:05 AM | Last Updated on Sun, Aug 27 2023 5:28 PM

Assurance to tenant farmers - Sakshi

సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది.

గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు.

కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు.  

సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు 
సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్‌లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్‌లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది.

నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. 

రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 
2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు.

ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. 

ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు 
రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది.  – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా 
 
కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా 

నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్‌లోడ్‌ చేశారు. చాలా సంతోషంగా ఉంది.   – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement