సరికొత్త "డ్రామా'!
సరికొత్త "డ్రామా'!
Published Mon, Jun 19 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
– ప్రతిపాదనల మేరకే ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ నిధులు
– అదనంగా అర్ధ రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం
– ఎప్పుడూ లేనివిధంగా ఇన్‌పుట్‌తో ఇన్సూరెన్స్ ముడిపెట్టి భారం తగ్గించుకోవాలని భావించిన వైనం
– న్యాయపరంగా చిక్కులు తప్పవని వెనక్కి తగ్గిన చంద్రబాబు
– కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందన్న భయంతో యథావిధిగా పరిహారం
– సర్కారు ఏదో ఘనకార్యం చేసినట్లు అధికార పార్టీ హడావుడి
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
- జిల్లాలో 6,25,050 మంది వేరుశనగ రైతులు, వారి తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిసి బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.280 కోట్ల ప్రీమియం చెల్లించారు. పంట నష్టపోయినందుకు రూ.419 కోట్ల బీమాను కంపెనీ రైతులకు చెల్లిస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు.
- 2016 ఖరీఫ్‌లో వేరుశనగ, ఇతర పంటలు వేసిన రైతులు రూ.3,700 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల దాకా నష్టపోయారు. ప్రభుత్వం కేవలం రూ.1,032.69 కోట్లతో ఇన్‌పుట్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరించింది. తక్కిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇన్‌పుట్ విషయంలో ఇది ఏటా జరిగే తంతే. జిల్లా రైతులకు ప్రభుత్వం అదనంగా చేసిందేమీ లేదు. అయినా ప్రభుత్వం ఏదో పెద్ద సాయం చేసినట్లుగా ‘డ్రామా’ను రక్తికట్టించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు.
ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో కొన్నేళ్లుగా నిబంధనల మేరకు పరిహారం ఎలా వస్తోందో ఈసారీ అలాగే వచ్చింది. ఇంకా చెప్పాలంటే రైతులకు వాటిల్లిన నష్టంతో పోలిస్తే చాలా తక్కువ పరిహారమే మంజూరైంది. కరువు రైతులను ఆదుకోవడం, పరిహారం చెల్లించడమనే విషయాలను ప్రభుత్వం మానవీయకోణంలో చూడాలి. కానీ ఇందులోనూ రాజకీయ కోణంలోనే చూసింది. ఆర్థికంగా భారం తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో పరిహారం విషయంలో చరిత్రలో ఎప్పుడూలేని అసంబద్ధ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రకటనలతో పాటు అధికారులు జీవోలు కూడా విడుదల చేశారు. అయితే.. రెండు విషయాల్లో తప్పులు చేశారు. ఈ రెండు ఆధారాలతో రైతులు న్యాయపోరాటం చేస్తే, ప్రభుత్వం కోర్టుమెట్లెక్కక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి విధిలేని పరిస్థితుల్లో గతంలో మాదిరిగానే ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నారు.
సర్కారు చేసిన తప్పిదాలు ఇవే..
ఇన్సూరెన్స్ డబ్బుపై సర్కారుకు హక్కు ఉండదు. పరిహారాన్ని సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ సీఎం చంద్రబాబు కొన్ని నెలలుగా హెక్టారుకు రూ.15 వేలకు మించకుండా ఇన్సూరెన్స్ లేదా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తామని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1,620 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ జీవో 67 జారీ చేసింది. ఇందులో రూ.1,032.69 కోట్లు జిల్లావాటా. ఈ మొత్తంలో 50 శాతం అంటే రూ.516 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మరో రూ.516 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ వాతావరణ బీమా సొమ్ము రూ.419 కోట్లు, ఫసల్ బీమా సొమ్ము రూ.37 కోట్లు.. మొత్తం రూ.456 కోట్లను రాష్ట్రవాటాలో కలిపి, తక్కిన రూ.60 కోట్లను ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని భావించింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై విపక్షాలు, రైతుసంఘాలు కూడా మండిపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరు చేస్తూ ఆయా జిల్లాల వ్యవసాయశాఖ జేడీలకు మెమోలు విడుదల చేసింది. హెక్టార్‌కు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని, ఇందులో ఇన్సూరెన్స్ పోగా మిగిలిన మొత్తాన్ని ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో చెల్లించాలని పేర్కొంది. బీమా సొమ్ముపై హక్కును కాలరాస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసి తప్పిదానికి పాల్పడింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు కోర్టుకు వెళితే సర్కారుకు చిక్కులు తప్పవు. అలాగే రాయదుర్గంలో రూ.1,032.69 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెక్కును ముఖ్యమంత్రి విడుదల చేశారు. అంటే బీమాతో సంబంధం లేకుండా ఆ మేర మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచి విడుదల చేసినట్లన్నమాట! ఈ క్రమంలో బీమా సొమ్ముకు, ఇన్‌పుట్ సబ్సిడీకి లింకు పెడితే రూ.1,032 కోట్ల నిధులు ఏమయ్యాయనే అంశంపైనా రైతులు కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వానికి కచ్చితంగా తిప్పలు తప్పవు. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు కూడా నివేదించారు. దీంతో సీఎం చంద్రబాబు హడావుడిగా మంత్రులు, ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. కుటుంబరావుతో పాటు వ్యవసాయాధికారులు, న్యాయనిపుణులతో చర్చించారు. ప్రభుత్వం చేయాలనుకున్నదే పొరపాటని, పైగా దీనికి మెమో, చెక్కు విడుదల ద్వారా ప్రభుత్వమే ఆధారాలు ఇచ్చినట్లయ్యిందని, రైతులు కోర్టును ఆశ్రయిస్తే వారే గెలుస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేక ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని ఎప్పటిలాగే విడుదల చేసింది.
అధికార పార్టీ ఆర్భాటం
వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే చంద్రబాబు జిల్లాకు ఏదో ఘన కార్యం చేశారని, రైతులను ఆదుకున్నారనే కోణంలో అధికార పార్టీ నేతలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జిల్లాలో ‘రైతు కృతజ్ఞత యాత్రలు’ చేపడతామని మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ప్రకటించారు. చంద్రబాబు పలు సందర్భాల్లో బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ కలిపి ఇస్తామని చెప్పినప్పుడు... ఇది తప్పు అని, వేర్వేరుగా ఇవ్వాలని ఏ ఒక్కరోజూ కోరని సునీత, శ్రీనివాసులు ఇప్పుడు ప్రభుత్వం చేసిన గోరంత సాయాన్ని..కొండంతగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Advertisement