
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి 2021 ఖరీఫ్ సీజన్‌లోని అర్హుల జాబితా లెక్కతేలింది. ఈ సీజన్‌కు సంబంధించి 10.76 లక్షల మంది రూ.లక్ష లోపు రుణాలు పొందినట్లు గుర్తించగా, వారిలో నిర్ణీత గడువులోగా చెల్లించడం, ఈ–క్రాప్ ప్రామాణికంగా పంటలు సాగుచేసిన 5.68 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరికి రూ.115.33 కోట్లు జమచేయనున్నారు. అలాగే, రబీ 2020–21 సీజన్‌లో 2.54 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
వీరికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.45.22 కోట్లు జమచేయనున్నారు. ఈ జాబితాలను జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ఈ నెల 19–22 వరకు ప్రదర్శిస్తుండగా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీలో భాగంగా బుధవారం నుంచి 25వరకు ప్రదర్శిస్తారు. అంతేకాదు.. ఎస్వీపీఆర్ పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ హోంపేజీలో ''know your status''అనే విండోలో తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకోవచ్చు.
రైతులు తమ వివరాలు సరిచూసుకుని వారి పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లలో తప్పులుంటే తగిన వివరాలు సంబంధిత ఆర్బీకే సిబ్బందికి అందించి సరిచేసుకోవాలి. అర్హత కలిగి తమ పేరులేని రైతులు బ్యాంకు అధికారి సంతకంతో ధృవీకరించి ఆర్బీకేల్లో దరఖాస్తు సమర్పిస్తే పునఃపరిశీలన చేసి అర్హత ఉంటే జాబితాల్లో చేరుస్తారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి 8.22లక్షల మంది ఖాతాలకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఈ నెల 28న సీఎం జగన్ జమ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment