ఏలూరు జిల్లా పల్లంట గ్రామంలో ఈ పంట నమోదు.లో భాగంగా రైతు వేలి ముద్రలు సేకరిస్తున్న ఆర్బీకే వలింటీర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) వలంటీర్ల సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా రైతుల సేవలో భాగస్వాములు కానున్నారు. ఆర్బీకే సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే సమయంలో రైతుల సేవల్లో అంతరాయం కలగకుండా గ్రామాల్లో చురుగ్గా పని చేసే వలంటీర్లను ఆర్బీకేలకు ప్రభుత్వం అనుసంధానించింది. రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లోనూ ఒక్కోవలంటీర్ చొప్పున కేటాయించింది. ఇంటర్‌లో బయాలజీ చదివిన వారికి ప్రాధాన్యతనిచ్చింది.
ఈ కేవైసీ నమోదులో వలంటీర్లు
ఈ పంట నమోదులో ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే 100 శాతం ఈ పంట నమోదు పూర్తయ్యింది. వీఏఏ/ వీహెచ్‌ఏలు 87 శాతం, వీఆర్‌ఏలు 77 శాతం ఈ కేవైసీ (వేలిముద్రలు) పూర్తి కాగా, 10 శాతం రైతుల నుంచి వేలిముద్రల సేకరణ పూర్తయ్యింది. ఈ దశలో వలంటీర్లను రైతుల ఇళ్లకు పంపి వారి వేలిముద్రల నమోదులో భాగస్వామ్యం చేశారు. స్పెషల్ డ్రైవ్ రూపంలో ఈ నెల10 కల్లా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ధాన్యం సేకరణలోనూ భాగస్వామ్యం
అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ ధాన్యం సేకరణలోనూ వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఏ కేటగిరీ ఆర్బీకేలకు నలుగురు, బి, సి కేటగిరీ ఆర్బీకేలకు ఇద్దరు చొప్పున వలంటీర్లను కేటాయిస్తున్నారు. వీరిలో ఒకరు ఆర్బీకేకు అనుసంధానించిన వలంటీర్ కూడా ఉంటారు. ధాన్యం సేకరణ అసిస్టెంట్, రూట్ అసిస్టెంట్‌లుగా వీరి సేవలను వినియోగించుకుంటారు.
కల్లాల్లోని ధాన్యం శాంపిళ్లను తీసుకొచ్చి తేమ శాతం తదితర ఐదు రకాల పరీక్షలు నిర్వహించడం, గోనె సంచులు సిద్ధం చెయ్యడం, లోడింగ్, అన్ లోడింగ్‌కు హమాలీలు, రవాణాకు వాహనాలను సమకూర్చడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడం, మొత్తం ప్రక్రియను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం వంటి సేవలందిస్తారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు వీరికీ శిక్షణ ఇస్తారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరికి నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు.
దసరా తర్వాత రెండ్రోజుల పాటు శిక్షణ
ఆర్బీకే కార్యకలాపాలపై వలంటీర్లకు దసరా తర్వాత రెండ్రోజులు శిక్షణ ఇస్తారు. ఆర్బీకేలకు వచ్చే రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్‌పుట్స్ కోసం కియోస్క్ ద్వారా దగ్గరుండి బుక్ చేయించడం, ఆర్బీకేలకు కేటాయించే ఇన్‌పుట్స్‌ను స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పంటల వారీగా శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో కూడిన వీడియోలను స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, డిజిటల్ లైబ్రరీలో ఉండే పుస్తకాలను, ఇతర సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు ఆర్బీకే ద్వారా అందించే ఇతర సేవల్లోనూ రైతులకు తోడుగా నిలిచేలా తర్ఫీదునిస్తారు.
సీఎం ఆశయాల మేరకు..
నేను పల్లంట్ల 2వ వార్డు వలంటీర్‌ను. నా పరిధిలో 93 కుటుంబాలున్నాయి. ఇప్పటివరకు వారికి అవసరమైన సేవలు మాత్రమే అందిస్తున్నా. ఇప్పుడు పల్లంట్ల ఆర్బీకేకు నన్ను అటాచ్ చేశారు. రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉంది. వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సీఎం వైఎస్ జగన్ ఆశయాల మేరకు సేవలందిస్తా.
– పి.సందీప్, పల్లంట్ల ఆర్బీకే, ఏలూరు జిల్లా
రైతులకు తోడుగా ఉంటా
ఊళ్లో ఉన్న రైతులందరికీ సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. రైతులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టే. కొత్తగా వచ్చే తెగుళ్లు, పురుగుల సమాచారాన్ని పై అధికారులకు తెలియజేసి వాటి నివారణలో రైతులకు తోడుగా ఉంటాను.
–పూల అన్వర్‌బాషా, ఎర్రగుడిదిన్నె ఆర్బీకే, నంద్యాల జిల్లా
ఆర్బీకే సేవలు రైతు ముంగిటకు తీసుకెళ్తా
మూడేళ్లుగా వలంటీర్‌గా సంతృకరమైన సేవలందించాను. ఇప్పుడు మా ఆర్బీకే పరిధిలో రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటా. ఆర్బీకే సేవలు రైతుల ముంగిటకు తీసుకెళ్తాను.
– గంగదాసు ఉషారాణి,పెద్దవరం ఆర్బీకే, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment