సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి అన్ని సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లింది. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏకంగా రూ.12 వేల కోట్ల విలువ చేసే పనులను కేవలం 16 నెలల పాలన కాలంలోనే మొదలుపెట్టింది.
ఐదు కేటగిరీల్లో పనులు
► అన్ని గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది.
► ఈ ఐదు కేటగిరీల పనులను ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలుగా గుర్తించి గత ఏడాదే రూ.7,846 కోట్లు విలువ చేసే 52,606 పనులను మంజూరు చేసింది. వీటిలో రూ.1,081.68 కోట్ల విలువ చేసే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
► ఇవి కాకుండా పలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ మురుగు కాల్వలు, కొన్ని చోట్ల కంకర రోడ్ల నిర్మాణానికి మరో రూ.2,091 కోట్ల విలువ చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
► వీటికి తోడు గ్రామాల్లో అన్నిచోట్లా రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, కొత్తగా వివిధ అభివృద్ధి పనులకు ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున కేటాయించిన మొత్తం కలుపుకుంటే గ్రామాల్లో దాదాపు రూ.12 వేల కోట్ల విలువ చేసే పనులు కొనసాగుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
అదనంగా మరో రూ.5 కోట్లు
► గతేడాది కాలంలో మంజూరు చేసిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తయిన నియోజకవర్గాల్లో అదనంగా మరో రూ.5 కోట్లు చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
► గ్రామీణ మౌలిక వసతుల కల్పనపై గత నెలలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు.
► ఇందుకు సంబంధించి పనుల ప్రతిపాదనలు పంపాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేందరికీ లేఖలు రాశారు.
నిధుల ఖర్చుకు పకడ్బందీ ప్రణాళిక
► పనులను చేపట్టేందుకు అవసరమైన నిధుల విడుదలకు అధికారులు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ విభాగం నిధులను ఈ పనుల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు.
► ఉపాధి హామీ పథకంలో కూలీల ద్వారా చేపట్టిన పనులకు 60–40 విధానంలో 40 శాతం మొత్తాన్ని మెటీరియల్ నిధులుగా మౌలికవసతుల కల్పనకు ఖర్చు చేసుకోవచ్చు.
► ఈ ఏడాది ఈ పథకం కింద జరిగిన పనులకు ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తం కాకుండా మరో రూ.2,867 కోట్లు వినియోగించుకోవడానికి వీలుంది. ఆర్థిక ఏడాది చివరి నాటికి ఈ మొత్తం రూ.3,500 కోట్లకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క పథకం ద్వారానే ఏటా రూ.4 వేల కోట్లకు పైగా మెటీరియల్ నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment