పాతాళ గంగ.. అడుగంటే అదనంగా!
- అదనంగా 2.86 మీటర్ల లోతుల్లోకి పడిపోయిన భూగర్భ జలాలు
- వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : పాతాళగంగా ఇంకా పైకి రావడంలేదు. రాష్ట్రంలో భూగర్భ జలాలు గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 2.86 మీటర్ల అదనపు లోతుల్లోకి పడిపోయాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ బుధవారం నివేదిక విడుదల చేసింది. గతేడాది జూన్‌లో రాష్ట్రంలో 12.56 మీటర్ల లోతుల్లో జలాలు లభ్యం కాగా, ఈ ఏడాది అదే నెలలో 15.42 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గతేడాది జూన్ నెలలో 14.54 మీటర్ల లోతుల్లో జలాలు లభిస్తే, ఈ ఏడాది అదే నెలలో 20.64 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ గతేడాది జూన్ నెలతో పోలిస్తే భూగర్భ జలాలు మెరుగైనస్థితిలో లేవు.
51 శాతానికి చేరుకున్న పంటలసాగు
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. ఖరీఫ్‌లో సాధారణంగా 1.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు 54.92 లక్షల ఎకరాల్లో (51%) సాగైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం సాధారణం కంటే పెరిగింది. ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.55 లక్షల ఎకరాల్లో (104%) సాగైంది. అందులో కంది 104 శాతం, పెసర 109 శాతం, మినప నూటికి నూరు శాతం సాగైనట్లు నివేదిక వెల్లడించింది.
వరి నాట్లు మాత్రం ఇంకా 8 శాతానికి మించలేదు. సాధారణంగా ఖరీఫ్‌లో 24.65 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 2.05 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. ఇక పత్తి 23.52 లక్షల ఎకరాల్లో సాగైంది. అందుకు ప్రత్యామ్నాయంగా చెప్పుకున్న సోయాబీన్ కేవలం 6.75 లక్షల ఎకరాల్లో సాగైంది. వాస్తవానికి సోయాబీన్ సాగు విస్తీర్ణాన్ని ప్రభుత్వం 12 లక్షల ఎకరాలకు పెంచాలని భావించింది. మున్ముందు సోయా సాగుకు అనువైన కాలం కాదు. దీంతో మిగిలిన చోట్ల రైతులు సోయాకు బదులు పత్తి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
33 శాతం అధిక వర్షపాతం
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటివరకు 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 713.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. బుధవారం నాటికి 214.4 ఎం.ఎం.లు నమోదు కావాల్సి ఉండగా, ఏకంగా 285.5 ఎం.ఎం.లు నమోదైంది. నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో అధికం, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.