నీటి ఆదా బాధ్యత రైతులదేనా? | Ground Water Saving Methods In Agriculture | Sakshi
Sakshi News home page

నీటి ఆదా బాధ్యత రైతులదేనా?

Published Sat, Aug 25 2018 12:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Ground Water Saving Methods In Agriculture - Sakshi

రోజు రోజుకు తరిగిపోతున్న భూగర్భ జలాలను ‘నీరు విపరీతంగా తాగే’ పంటల సాగు ద్వారా తోడేస్తూ, వాడుకుంటూ పోతే ఏమవుతుందో మనం ఆలోచించడం లేదు. తరిగిపోతున్న నీటి లభ్యత ఫలితంగా ముదురుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో కొత్త సాగు పద్ధతుల అమలుకు కట్టుదిట్టంగా జోక్యం చేసుకోకుండా, త్యాగాలు చేయాలని మనం రైతులను మాత్రమే కోరితే లాభం లేదు. ఈ విషయంలో త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శప్రాయంగా నిలవాల్సింది సంపన్నులే. ఫైవ్‌స్టార్‌ హోటళ్లు సహా అన్ని హోటళ్లలో స్నానాల తొట్టెలను నిషేధించడంతో నీటిని పొదుపు చేసే పని ప్రారంభించాలి. ఆ తర్వాతే అందరూ నీటి పొదుపును పాటిస్తారు.

కొన్నేళ్ల క్రితం నీటి సంక్షో భం, వాతావరణ మార్పు లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నాను. దేశంలో అనేక ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు నడిపే ఓ బడా భారత కంపెనీ ఉన్నతాధికారి మాట్లా డుతూ, తమ సంస్థ ఎలా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తోందో వివరించారు. అంట్లు తోమేట ప్పుడు నీరు వృథా కాకుండా ఎలా చూడాలో ఇళ్లలో పనిచేసేవారికి నేర్పడానికి గురుగ్రామ్‌లో ఈ కంపెనీ ఓ కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. వెంటనే ఆయన మాటలకు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు మోగాయి. పనిమనుషుల్లో సామాజిక బాధ్యత పెంపొందించడానికి ఈ కంపెనీ ప్రయత్నిస్తోందని అర్థమైంది. ఓ బకెట్‌ నీటిలో ఒక మగ్గు నీటిని పొదుపు చేసినా, గురుగ్రామ్‌ వంటి నగరంలో ఎంత మొత్తంలో నీరు వృథా కాకుండా మిగులుతుందో ఊహించుకోవచ్చు. నీటిని పొదుపుగా వాడాలనే విషయం చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు ఆయ నకు నేను నా ప్రసంగంలో కృతజ్ఞతలు చెప్పాను.

దేశంలో తలసరి నీటి లభ్యత ఆందోళనకరమైన రీతిలో తగ్గిపోతున్న తరుణంలో ఐదు నక్షత్రాల హోటళ్లు బాత్రూముల నుంచి స్నానాల తొట్టెలను ఎందుకు తొలగించవని నేను ప్రశ్నించాను. నీటిని పొదుపు చేయడం అంత ముఖ్య విషయం అయి నప్పుడు స్నానాల తొట్టెలు వాడవద్దని ధనికులు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎందుకు చెప్పరు? భారీ మొత్తంలో హోటల్‌ గదులకు అద్దె చెల్లించే స్తోమత కొందరికి ఉన్న కారణంగా ఇలా వందలాది లీటర్ల నీరు వృ«థాగా పోతున్నప్పుడు ఓ మగ్గు నీరు ఆదా చేయడం ఎలాగో ఇళ్లలో పనిచేసేవారికి నేర్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? 30అంగుళాల వెడల్పు, 60 అంగుళాల పొడవు ఉన్న స్నానం తొట్టెలో 300 లీటర్ల నీరు పడుతుంది. ఏదైనా లగ్జరీ హోటల్‌లో సగటున వంద గదులుంటే ప్రతి రోజూ స్నానాల కారణంగా 30 వేల లీటర్ల నీరు వాడేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఓ పక్క సంపన్నులు విలాస జీవన శైలి పేరుతో ఇంతగా నీటిని వృథా చేయడాన్ని అను మతిస్తూ మరో పక్క పేదలను నీరు లేకుండా త్యాగాలు చేయాలని బలవంతపెట్టలేం. 

వ్యవసాయంపైనే అనవసర ఫిర్యాదులు!
కొన్ని నెలల క్రితం కజకిస్తాన్‌లోని అల్మటి నగరంలో జరిగిన ఐరోపా–ఆసియా సమావేశంలో కూడా ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాను. ప్రపంచ నీటి సంక్షో భంపై ఏ జాతీయ లేదా అంతర్జాతీయ సమావేశాల్లో జరిగిన చర్చల్లోనైనా ఒకే విషయం ప్రస్తావిస్తున్నారు. నీటిని అతిగా వినియోగించే రంగం వ్యవసాయమే నని ఈ సదస్సుల్లోని వక్తలు ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపు 70 శాతం నీటి వాడకం జరిగేది వ్యవ సాయంలోనే. ఇది వాస్తవమే. దీంతో సాగు రంగంలో జల వినియోగం తగ్గించడంపైనే దృష్టినంతా కేంద్రీ కరిస్తున్నారు. మంచు పర్వతాలు శరవేగంతో కరిగి  పోతున్నాయి. భూగర్భజలాలను అడ్డూ అదుపూ లేకుండా వాడడంతో నీటి పారుదలకు ఆస్కారమిచ్చే నేలలోని రాళ్లు ఎండిపోతున్నాయి. ఫలితంగా నానా టికి తీవ్రమౌతున్న నీటి సంక్షోభం మనిషికి మనిషికి మధ్య, దేశాల మధ్య అనేక ఘర్షణలకు కారణమౌ తోంది.


భారతదేశంలో దేశ ధాన్యాగారంగా పిలిచే పంజాబ్‌–హరియాణా ప్రాంతం మరో పదిహేనేళ్లలో నీరులేక ఎండిపోతుంది. 2025 నాటికి వ్యవసాయా నికి లభ్యమయ్యే భూగర్భజలాల పరిమాణం బాగా తగ్గిపోతుందని కేంద్ర భూగర్భ జల మండలి తన 2007 నివేదికలో అంచనా వేసిందని ఆంగ్ల దినపత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఇప్పటికే పంజా బ్‌లో ప్రతి సంవత్సరం 45 శాతం కన్నా ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తోంది. జంట ఉపగ్రహాలు ‘గ్రేస్‌’ పంపిన వివరాల ఆధారంగా అమెరికా అంత రిక్ష సంస్థ నాసా తాజాగా రూపొందించిన నివేదికలో వెల్లడించిన విషయాల నేపథ్యంలో పై అధ్యయనా నికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే ఆరు సంవత్సరాల్లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు 109 ఘనపు కిలోలీటర్ల నీటిని వినియోగిస్తాయని నాసా నివేదిక చెబుతోంది. దేశంలోని వాయవ్య ప్రాంతాల్లో 38,061 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్న కారణంగా ఇక్కడ ఏటా భూగర్భ జలాలు ఓ అడుగు చొప్పున కిందికి పోతున్నాయి. 1990లతో పోల్చితే, ప్రస్తుత దశాబ్దంలో భూగర్భ నీటి మట్టాలు తరిగిపోవడం 70 శాతం ఎక్కువని గంగానదీ పరీ వాహక మైదానప్రాంతాలపై జరిపిన మరో అధ్యయ నంలో నాసా వెల్లడించింది. గత కొన్ని సంవత్సరా లుగా పరిస్థితి వాస్తవానికి క్షీణించింది.

రెండేళ్ల అనావృష్టితో ముదిరిన సంక్షోభం!
వరుసగా 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టి ఫలి తంగా నీటి సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం నెల కొన్న కరువు పరిస్థితులకు (వరదలకు కూడా) 30 శాతం కారణం సరిగా కురవని వర్షాలైతే, 70 శాతం బాధ్యత మనుషులపైనే ఉందని నేనెప్పుడూ చెబు తుంటాను. మానవ తప్పిదాలే నీటి సంక్షోభానికి ప్రధాన కారణాలని నమ్ముతున్నాను. గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా, విచక్షణారహితంగా భూగర్భ జలా లను తోడేస్తూ వాడుకోవడం వల్లే మౌలికంగా మనం ఈ సమస్య ముదిరిపోవడానికి దోహదం చేస్తున్నాం. అయితే, మనం దీని నుంచి ఏవైనా గుణపాఠాలు నేర్చుకున్నామా? సమస్య పరిష్కారానికి అవసర మైన కీలక మార్పులు చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే దానికి లేదనే జవాబు వస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఇచ్చిన జవాబు నాకు చాలా సంతృప్తినిచ్చింది. పంటల అభివృద్ధి కార్యక్రమాల కింద వివిధ పంటల పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని కిందటి వారం పార్లమెంటుకు ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల వ్యవసాయ –వాతావరణ పరిస్థితి, నేల, నీటి వంటి వనరుల లభ్యత, మార్కెట్‌ శక్తులు, రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పంటలు సాగుచేసే పద్ధతులు, వాటిలో మార్పులు ఆధారపడి ఉంటాయి. బిందు, తుంపర సేద్య విధానాలు, డ్రిప్‌ సాగు, రెయిన్‌గన్‌ సాగు పద్ధతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడంతోనే ప్రభు త్వం బాధ్యత తీరిపోదు.

సాగు పద్ధతుల్లో మార్పులకు సమగ్ర విధానం
నీటి లభ్యత, వినియోగం ఆధారంగా పంటల మార్పు పద్ధతుల్లో మార్పులు తేవడానికి వ్యవ సాయం జోరుగా సాగే ప్రాంతాలపై సమగ్ర విశ్లేషణ అవసరం. అవసరాలకు తగ్గట్టు పంటల మార్పు విధానం అమలు చేయాలని నేనెప్పటి నుంచో కోరుతున్నాను. 2005 జూన్‌ రెండున ఇంగ్లిష్‌ దిన పత్రిక డెక్కన్‌ హెరాల్డ్‌లో ‘పంటల మార్పు పద్ధ తులు’ శీర్షికతో రాసిన వ్యాసంలో, ‘‘మెట్ట ప్రాంతాల్లో నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు పండించడంలో అర్థం లేదు. అలాంటి పంటలు బీడు భూములను పెంచేస్తాయి. రాజస్తాన్‌ వంటి నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో నీటిని విపరీతంగా పీల్చుకునే చెరకు సాగు ఏ విధంగానూ న్యాయం కాదు. కిలో మెంథాల్‌ ఆయిల్‌కు అవసరమైన పుదీనా పంట సాగుకు లక్షా 25 వేల లీటర్ల నీరు అవసర మౌతుంది. బుందేల్‌ఖండ్‌ వంటి నీరు తక్కువగా దొరికే చోట్ల పుదీనా సాగు మేలు. ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ నీరు అవసరమైన పంటల సాగే మేలని చెప్పడానికి పెద్ద ఆలోచన అవసరం లేదు. నీరు తగినంత లభ్యంకాని భూముల్లో మనం వాస్త వానికి సంకర జాతి వరి, హైబ్రిడ్‌ జొన్న, హైబ్రిడ్‌ మక్క జొన్న, హైబ్రిడ్‌ పత్తి, హైబ్రిడ్‌ కూరగాయలు వంటి సంకర పంటల సాగు చేస్తున్నామంటే ఇది మనం దిగ్భ్రాంతి చెందాల్సిన

విషయం. ఎందుకంటే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల కంటే ఈ సంకర జాతి పంటలకు ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువ నీరు అవసరం. అయినా నీటి వినియోగం ఎక్కువగా ఉండే హైబ్రిడ్‌ పంటల సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నాం. నీటి సంక్షోభం ముదిరిపోవడానికి కారణ మౌతున్నాం’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాను. అదీగాక, జన్యు మార్పిడి పంటల సాగుకు ప్రభుత్వం ఇప్పుడు విపరీత ప్రాధాన్యం ఇస్తోంది. విచక్షణారహితంగా ప్రోత్సహిస్తోంది. మొదట ఈ తరహా బీటీ పత్తి సాగును ప్రోత్సహించింది (ఇప్ప టికీ చేస్తోంది). సంకర జాతి పత్తి కన్నా బీటీ పత్తి సాగుకు పది నుంచి 12 శాతం ఎక్కువ నీరు అవ సరం. జన్యు మార్పిడి ఆవాలు వాణిజ్య సాగుకు అనుమతి కోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖలోని జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రయిజల్‌ కమిటీ (జీఈఏసీ) ప్రస్తుతం ఆతృతతో ఎదురు చూస్తోంది. జీఎం ఆవాల పంటకు ఎంత పరిమాణంలో నీరు అవ సరమో నాకు తెలియదు గాని, బీటీ పత్తి సాగు అను భవం ప్రకారం చూస్తే–ఈ కొత్త ఆవాల పంటకు 20 శాతం ఎక్కువ నీరు అవసరమౌతుందని అంచనా వేయవచ్చు.

రోజు రోజుకు తరిగి పోతున్న భూగర్భ జలా లను ఇలాంటి ‘నీరు విపరీతంగా తాగే’ పంటల సాగు ద్వారా తోడేస్తూ, వాడుకుంటూ పోతే ఏమవు తుందో మనం ఆలోచించడం లేదు. తరిగిపోతున్న నీటి లభ్యత ఫలితంగా ముదురుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం సూచిస్తున్న మార్పులు, కొత్త సాగు పద్ధతుల అమలుకు కట్టుది ట్టంగా జోక్యం చేసుకోకుండా, తీవ్రమౌతున్న సాగు నీటి సమస్యకు నిందను మార్కెట్‌ శక్తులపై వేయడం న్యాయం కాదు.గత కొంత కాలంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. త్యాగాలు చేయాలని మనం రైతులను మాత్రమే కోరితే లాభం లేదు. ఈ విష యంలో త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శప్రా యంగా నిలవాల్సింది సంపన్నులే. ఫైవ్‌స్టార్‌ హోటళ్లు సహా అన్ని హోటళ్లలో స్నానాల తొట్టెలను నిషేధించడంతో నీటిని పొదుపు చేసే పని ప్రారం భించాలని నేను భావిస్తున్నాను. దీని ద్వారా నీటిని వృథాగా వాడడాన్ని రైతులేగాక, పట్టణప్రాంతాల జనం కూడా తగ్గించుకుంటారు.


దేవిందర్‌శర్మ 
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement