Vislashana
-
ఆధార్ లేదని పింఛన్ ఆపితే...
సాధారణంగానే కేంద్ర సమాచార కమిషన్ దృశ్య శ్రవణ ప్రసారం ద్వారా సుదూర ప్రాంతాల అప్పీలు విచారణ సాగి స్తుంది. గుంటూరులో ఉన్న దరఖాస్తుదారుడు గుంటు పల్లి ఆంజనేయులు కేసును కూడా ఇలా విచారించింది. ఈయన వృద్ధ రంగస్థల కళాకారుడు. ఆ విషయం నిరూపించడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యా లయంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గది నుంచి వీడియోలో ఒక పద్యం పాడి ఏకపాత్రా భినయంలో కొంత భాగాన్ని అభినయించేశారు. తెలుగు మాత్రమే వచ్చిన ఈ కళాకారుడి కోసం సీఐసీ ఈ కేసులో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో తీర్పు ఇచ్చారు. ఆంజనేయులు రంగస్థల కళాకారులకు ఇచ్చే పింఛను కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కాని జవాబు లేదు. తన దరఖాస్తుపై చర్య తీసుకున్నదీ, లేనిదీ ఎంతకీ చెప్పకపోతే మరో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కూడా అధికారులు స్పందించలేదు. 2016 జూలై 9న ఆర్టీఐ చట్టం కింద తన ఫిర్యాదుపై ఏం చేసిందీ తెలపాలని అడిగారు. దానికీ జవాబు లేదు. ఆయనకు 80 ఏళ్లు. పౌరాణిక నాటకాల్లో ఉత్తమ కళాకారుడిగా పేరు పొందారు. ఏకపాత్రాభి నయాల్లో ఎలుగెత్తి పద్యాలు పాడటంలో అనుభవ మున్న నటుడు. కావాలంటే ఓ పద్యం పాడేందుకు అనుమతించాలని ఆయన ప్రతినిధి కోరారు. కర్ణుడి ఏకపాత్రాభినయం నుంచి ఒక పద్యాన్ని ఆయన రాగయుక్తంగా, వయసు ప్రభావం ధ్వనిపైన పడ కుండా పాడి మెప్పించారు. నియమాల ప్రకారం దరఖాస్తును పరిశీలించి పింఛను గురించి తేల్చి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ సాంస్కృతిక శాఖది. ముందుగా దరఖాస్తుదారుడికి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సీపీఐఓ ఐఏ కమాల్ ప్రతి అంశంపై పూర్తి సమాచారం 30 రోజుల్లో ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. ఈ దరఖాస్తుపై ఏ చర్యా తీసుకోకుండా నిర్ల క్ష్యం ప్రదర్శించినందుకు ఆర్టీఐ చట్టం సెక్షన్ 20 కింద జరిమానా ఎందుకు విధించకూడదో, ఆ కళా కారుడికి జవాబివ్వక వేధించినందుకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వసంస్థను ఎందుకు ఆదేశించకూ డదో వివరించాలని ఐఏ కమాల్‌ను కమిషన్ ఆదే శించింది. ఇలా వ్యవహరించిన అధికారులెవరో విచారించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కార ణాలు తెలపాలనే ఉత్తర్వుకు మోహిత్ కుమార్ శేఖర్ జవాబిస్తూ, పింఛనుదారుకు జీవన ధ్రువపత్రం ఇవ్వాలని తెలుసనీ, తమ అధికారులు కూడా సకా లంలో ఆ విషయం ఆయనకు తెలిపారని, దరఖాస్తు దారుడికి సమాచారం ఇవ్వడంలో జాప్యం జరగనం దున తమపై జరిమానా విధించరాదని వివరిం చారు. పింఛను చెల్లింపునకు ఆధార్ కార్డుతో అను సంధానంచేసే పని జరుగుతోందని మోహిత్‌కుమార్ శేఖర్ తెలిపారు. ఏటా సంబంధిత బ్యాంకు శాఖలో జీవన ప్రమాణ పత్రం ఇస్తే పింఛను నెలనెలా చెల్లించడం సాధ్యమవుతుందని కూడా తెలిపారు. కేంద్రప్రభుత్వ అండర్ సెక్రటరీ ఐఏ కమాల్ దరఖాస్తుదారుడికి ఉత్తరం రాస్తూ జీవన్ ప్రమాణ్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ ఆర్డర్ వివరాలు ఇస్తూ డిజిటల్ జీవన ప్రమాణ పత్రం డీఎల్సీ ఇవ్వాలని కోరారు. దరఖాస్తుదారుడు 2018 ఆగస్టు 5న కమిషన్‌కు రాసిన ఉత్తరంలో జీవన ప్రమాణ పత్రం ఇవ్వాలని తనకు లేఖ అందిందనీ, తాను వెంటనే డీఎల్సీ ఇచ్చాననీ, అయినా ఇంకా పింఛను అందలేదని వివరించారు. ఇందులో రెండు సమస్యలున్నాయని కమిషన్ గమనించింది. ఒకటి పింఛనుదారుడికి పింఛను నిలిపివేయడానికి నిర్ధా రించిన ఆఖరితేదీకి చాలా ముందుగానే డీఎల్సీ ఇవ్వాలని తెలపడం. రెండోది పింఛను చెల్లింపును ఆధార్ కార్డుకు అనుసంధానించడం. డిజిటల్ పద్ధ తిలో జీవన ప్రమాణ పత్రం ఇచ్చే సౌకర్యం కల్పిం చడం మంచి దేగాని పింఛను చెల్లింపు నిలిపివేసే ముందు ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా పింఛ నుదారుడికి డీఎల్సీ గురించి తెలపాలి. పింఛను దారుల వయసు, కంప్యూటర్ విజ్ఞానం లేకపోవడం దృష్టిలో ఉంచుకుని, పింఛను ఆపాలనే కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు, ఫోన్లో పింఛను దారుడికి డీఎల్సీ గురించి హెచ్చరించడం లేదా వీలైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని కమి షన్ నిర్దేశిస్తోంది. డిజిటల్ జీవన ప్రమాణ పత్రం ఇచ్చినా ఈ కేసులో పింఛను ఇవ్వలేదు. ఆయనకు పింఛను చెల్లించినట్టు తెలుపుతూ సీఐసీ ఆదేశాన్ని అమ లుచేసిన విషయాన్ని వివరిస్తూ ఓ నివేదికను 15 రోజుల్లో పంపాలని ఆదేశించారు. (గుంటుపల్లి ఆంజనేయులు వర్సెస్ పీఐఓ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నాగ్‌పూర్ DID/MCULT/A/ 2017/134438 కేసులో 2018 ఆగస్టు 28 న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
నీటి ఆదా బాధ్యత రైతులదేనా?
రోజు రోజుకు తరిగిపోతున్న భూగర్భ జలాలను ‘నీరు విపరీతంగా తాగే’ పంటల సాగు ద్వారా తోడేస్తూ, వాడుకుంటూ పోతే ఏమవుతుందో మనం ఆలోచించడం లేదు. తరిగిపోతున్న నీటి లభ్యత ఫలితంగా ముదురుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో కొత్త సాగు పద్ధతుల అమలుకు కట్టుదిట్టంగా జోక్యం చేసుకోకుండా, త్యాగాలు చేయాలని మనం రైతులను మాత్రమే కోరితే లాభం లేదు. ఈ విషయంలో త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శప్రాయంగా నిలవాల్సింది సంపన్నులే. ఫైవ్‌స్టార్ హోటళ్లు సహా అన్ని హోటళ్లలో స్నానాల తొట్టెలను నిషేధించడంతో నీటిని పొదుపు చేసే పని ప్రారంభించాలి. ఆ తర్వాతే అందరూ నీటి పొదుపును పాటిస్తారు. కొన్నేళ్ల క్రితం నీటి సంక్షో భం, వాతావరణ మార్పు లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నాను. దేశంలో అనేక ఫైవ్ స్టార్ హోటళ్లు నడిపే ఓ బడా భారత కంపెనీ ఉన్నతాధికారి మాట్లా డుతూ, తమ సంస్థ ఎలా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తోందో వివరించారు. అంట్లు తోమేట ప్పుడు నీరు వృథా కాకుండా ఎలా చూడాలో ఇళ్లలో పనిచేసేవారికి నేర్పడానికి గురుగ్రామ్‌లో ఈ కంపెనీ ఓ కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు. వెంటనే ఆయన మాటలకు ప్రశంసాపూర్వకంగా చప్పట్లు మోగాయి. పనిమనుషుల్లో సామాజిక బాధ్యత పెంపొందించడానికి ఈ కంపెనీ ప్రయత్నిస్తోందని అర్థమైంది. ఓ బకెట్ నీటిలో ఒక మగ్గు నీటిని పొదుపు చేసినా, గురుగ్రామ్ వంటి నగరంలో ఎంత మొత్తంలో నీరు వృథా కాకుండా మిగులుతుందో ఊహించుకోవచ్చు. నీటిని పొదుపుగా వాడాలనే విషయం చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు ఆయ నకు నేను నా ప్రసంగంలో కృతజ్ఞతలు చెప్పాను. దేశంలో తలసరి నీటి లభ్యత ఆందోళనకరమైన రీతిలో తగ్గిపోతున్న తరుణంలో ఐదు నక్షత్రాల హోటళ్లు బాత్రూముల నుంచి స్నానాల తొట్టెలను ఎందుకు తొలగించవని నేను ప్రశ్నించాను. నీటిని పొదుపు చేయడం అంత ముఖ్య విషయం అయి నప్పుడు స్నానాల తొట్టెలు వాడవద్దని ధనికులు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎందుకు చెప్పరు? భారీ మొత్తంలో హోటల్ గదులకు అద్దె చెల్లించే స్తోమత కొందరికి ఉన్న కారణంగా ఇలా వందలాది లీటర్ల నీరు వృ«థాగా పోతున్నప్పుడు ఓ మగ్గు నీరు ఆదా చేయడం ఎలాగో ఇళ్లలో పనిచేసేవారికి నేర్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? 30అంగుళాల వెడల్పు, 60 అంగుళాల పొడవు ఉన్న స్నానం తొట్టెలో 300 లీటర్ల నీరు పడుతుంది. ఏదైనా లగ్జరీ హోటల్లో సగటున వంద గదులుంటే ప్రతి రోజూ స్నానాల కారణంగా 30 వేల లీటర్ల నీరు వాడేస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఓ పక్క సంపన్నులు విలాస జీవన శైలి పేరుతో ఇంతగా నీటిని వృథా చేయడాన్ని అను మతిస్తూ మరో పక్క పేదలను నీరు లేకుండా త్యాగాలు చేయాలని బలవంతపెట్టలేం. వ్యవసాయంపైనే అనవసర ఫిర్యాదులు! కొన్ని నెలల క్రితం కజకిస్తాన్‌లోని అల్మటి నగరంలో జరిగిన ఐరోపా–ఆసియా సమావేశంలో కూడా ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాను. ప్రపంచ నీటి సంక్షో భంపై ఏ జాతీయ లేదా అంతర్జాతీయ సమావేశాల్లో జరిగిన చర్చల్లోనైనా ఒకే విషయం ప్రస్తావిస్తున్నారు. నీటిని అతిగా వినియోగించే రంగం వ్యవసాయమే నని ఈ సదస్సుల్లోని వక్తలు ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపు 70 శాతం నీటి వాడకం జరిగేది వ్యవ సాయంలోనే. ఇది వాస్తవమే. దీంతో సాగు రంగంలో జల వినియోగం తగ్గించడంపైనే దృష్టినంతా కేంద్రీ కరిస్తున్నారు. మంచు పర్వతాలు శరవేగంతో కరిగి పోతున్నాయి. భూగర్భజలాలను అడ్డూ అదుపూ లేకుండా వాడడంతో నీటి పారుదలకు ఆస్కారమిచ్చే నేలలోని రాళ్లు ఎండిపోతున్నాయి. ఫలితంగా నానా టికి తీవ్రమౌతున్న నీటి సంక్షోభం మనిషికి మనిషికి మధ్య, దేశాల మధ్య అనేక ఘర్షణలకు కారణమౌ తోంది. భారతదేశంలో దేశ ధాన్యాగారంగా పిలిచే పంజాబ్–హరియాణా ప్రాంతం మరో పదిహేనేళ్లలో నీరులేక ఎండిపోతుంది. 2025 నాటికి వ్యవసాయా నికి లభ్యమయ్యే భూగర్భజలాల పరిమాణం బాగా తగ్గిపోతుందని కేంద్ర భూగర్భ జల మండలి తన 2007 నివేదికలో అంచనా వేసిందని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటికే పంజా బ్లో ప్రతి సంవత్సరం 45 శాతం కన్నా ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తోంది. జంట ఉపగ్రహాలు ‘గ్రేస్’ పంపిన వివరాల ఆధారంగా అమెరికా అంత రిక్ష సంస్థ నాసా తాజాగా రూపొందించిన నివేదికలో వెల్లడించిన విషయాల నేపథ్యంలో పై అధ్యయనా నికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే ఆరు సంవత్సరాల్లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు 109 ఘనపు కిలోలీటర్ల నీటిని వినియోగిస్తాయని నాసా నివేదిక చెబుతోంది. దేశంలోని వాయవ్య ప్రాంతాల్లో 38,061 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్న కారణంగా ఇక్కడ ఏటా భూగర్భ జలాలు ఓ అడుగు చొప్పున కిందికి పోతున్నాయి. 1990లతో పోల్చితే, ప్రస్తుత దశాబ్దంలో భూగర్భ నీటి మట్టాలు తరిగిపోవడం 70 శాతం ఎక్కువని గంగానదీ పరీ వాహక మైదానప్రాంతాలపై జరిపిన మరో అధ్యయ నంలో నాసా వెల్లడించింది. గత కొన్ని సంవత్సరా లుగా పరిస్థితి వాస్తవానికి క్షీణించింది. రెండేళ్ల అనావృష్టితో ముదిరిన సంక్షోభం! వరుసగా 2014, 2015 సంవత్సరాల్లో అనావృష్టి ఫలి తంగా నీటి సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం నెల కొన్న కరువు పరిస్థితులకు (వరదలకు కూడా) 30 శాతం కారణం సరిగా కురవని వర్షాలైతే, 70 శాతం బాధ్యత మనుషులపైనే ఉందని నేనెప్పుడూ చెబు తుంటాను. మానవ తప్పిదాలే నీటి సంక్షోభానికి ప్రధాన కారణాలని నమ్ముతున్నాను. గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా, విచక్షణారహితంగా భూగర్భ జలా లను తోడేస్తూ వాడుకోవడం వల్లే మౌలికంగా మనం ఈ సమస్య ముదిరిపోవడానికి దోహదం చేస్తున్నాం. అయితే, మనం దీని నుంచి ఏవైనా గుణపాఠాలు నేర్చుకున్నామా? సమస్య పరిష్కారానికి అవసర మైన కీలక మార్పులు చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అంటే దానికి లేదనే జవాబు వస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్లమెంటులో ఓ ప్రశ్నకు ఇచ్చిన జవాబు నాకు చాలా సంతృప్తినిచ్చింది. పంటల అభివృద్ధి కార్యక్రమాల కింద వివిధ పంటల పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తోందని కిందటి వారం పార్లమెంటుకు ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల వ్యవసాయ –వాతావరణ పరిస్థితి, నేల, నీటి వంటి వనరుల లభ్యత, మార్కెట్ శక్తులు, రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పంటలు సాగుచేసే పద్ధతులు, వాటిలో మార్పులు ఆధారపడి ఉంటాయి. బిందు, తుంపర సేద్య విధానాలు, డ్రిప్ సాగు, రెయిన్‌గన్ సాగు పద్ధతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడంతోనే ప్రభు త్వం బాధ్యత తీరిపోదు. సాగు పద్ధతుల్లో మార్పులకు సమగ్ర విధానం నీటి లభ్యత, వినియోగం ఆధారంగా పంటల మార్పు పద్ధతుల్లో మార్పులు తేవడానికి వ్యవ సాయం జోరుగా సాగే ప్రాంతాలపై సమగ్ర విశ్లేషణ అవసరం. అవసరాలకు తగ్గట్టు పంటల మార్పు విధానం అమలు చేయాలని నేనెప్పటి నుంచో కోరుతున్నాను. 2005 జూన్ రెండున ఇంగ్లిష్ దిన పత్రిక డెక్కన్ హెరాల్డ్‌లో ‘పంటల మార్పు పద్ధ తులు’ శీర్షికతో రాసిన వ్యాసంలో, ‘‘మెట్ట ప్రాంతాల్లో నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలు పండించడంలో అర్థం లేదు. అలాంటి పంటలు బీడు భూములను పెంచేస్తాయి. రాజస్తాన్ వంటి నీరు తక్కువగా లభించే ప్రాంతాల్లో నీటిని విపరీతంగా పీల్చుకునే చెరకు సాగు ఏ విధంగానూ న్యాయం కాదు. కిలో మెంథాల్ ఆయిల్‌కు అవసరమైన పుదీనా పంట సాగుకు లక్షా 25 వేల లీటర్ల నీరు అవసర మౌతుంది. బుందేల్‌ఖండ్ వంటి నీరు తక్కువగా దొరికే చోట్ల పుదీనా సాగు మేలు. ఇలాంటి ప్రాంతాల్లో తక్కువ నీరు అవసరమైన పంటల సాగే మేలని చెప్పడానికి పెద్ద ఆలోచన అవసరం లేదు. నీరు తగినంత లభ్యంకాని భూముల్లో మనం వాస్త వానికి సంకర జాతి వరి, హైబ్రిడ్ జొన్న, హైబ్రిడ్ మక్క జొన్న, హైబ్రిడ్ పత్తి, హైబ్రిడ్ కూరగాయలు వంటి సంకర పంటల సాగు చేస్తున్నామంటే ఇది మనం దిగ్భ్రాంతి చెందాల్సిన విషయం. ఎందుకంటే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల కంటే ఈ సంకర జాతి పంటలకు ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఎక్కువ నీరు అవసరం. అయినా నీటి వినియోగం ఎక్కువగా ఉండే హైబ్రిడ్ పంటల సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నాం. నీటి సంక్షోభం ముదిరిపోవడానికి కారణ మౌతున్నాం’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాను. అదీగాక, జన్యు మార్పిడి పంటల సాగుకు ప్రభుత్వం ఇప్పుడు విపరీత ప్రాధాన్యం ఇస్తోంది. విచక్షణారహితంగా ప్రోత్సహిస్తోంది. మొదట ఈ తరహా బీటీ పత్తి సాగును ప్రోత్సహించింది (ఇప్ప టికీ చేస్తోంది). సంకర జాతి పత్తి కన్నా బీటీ పత్తి సాగుకు పది నుంచి 12 శాతం ఎక్కువ నీరు అవ సరం. జన్యు మార్పిడి ఆవాలు వాణిజ్య సాగుకు అనుమతి కోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖలోని జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ (జీఈఏసీ) ప్రస్తుతం ఆతృతతో ఎదురు చూస్తోంది. జీఎం ఆవాల పంటకు ఎంత పరిమాణంలో నీరు అవ సరమో నాకు తెలియదు గాని, బీటీ పత్తి సాగు అను భవం ప్రకారం చూస్తే–ఈ కొత్త ఆవాల పంటకు 20 శాతం ఎక్కువ నీరు అవసరమౌతుందని అంచనా వేయవచ్చు. రోజు రోజుకు తరిగి పోతున్న భూగర్భ జలా లను ఇలాంటి ‘నీరు విపరీతంగా తాగే’ పంటల సాగు ద్వారా తోడేస్తూ, వాడుకుంటూ పోతే ఏమవు తుందో మనం ఆలోచించడం లేదు. తరిగిపోతున్న నీటి లభ్యత ఫలితంగా ముదురుతున్న నీటి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం సూచిస్తున్న మార్పులు, కొత్త సాగు పద్ధతుల అమలుకు కట్టుది ట్టంగా జోక్యం చేసుకోకుండా, తీవ్రమౌతున్న సాగు నీటి సమస్యకు నిందను మార్కెట్ శక్తులపై వేయడం న్యాయం కాదు.గత కొంత కాలంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. త్యాగాలు చేయాలని మనం రైతులను మాత్రమే కోరితే లాభం లేదు. ఈ విష యంలో త్యాగాలు చేయడం ద్వారా ఆదర్శప్రా యంగా నిలవాల్సింది సంపన్నులే. ఫైవ్‌స్టార్ హోటళ్లు సహా అన్ని హోటళ్లలో స్నానాల తొట్టెలను నిషేధించడంతో నీటిని పొదుపు చేసే పని ప్రారం భించాలని నేను భావిస్తున్నాను. దీని ద్వారా నీటిని వృథాగా వాడడాన్ని రైతులేగాక, పట్టణప్రాంతాల జనం కూడా తగ్గించుకుంటారు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
యథా బాబు.. తథా భృత్యులు
విశ్లేషణ ఈ శాసనసభ ఎన్నికలకు ముందు మా ఊరి రైతునొకర్ని 'ఎట్లా ఉంది వాతావరణం?' అని అడిగాను. 'చంద్రబాబు గెలిచేటట్టే ఉన్నాడండీ!'అన్నాడు. మా రైతు మాట దాదాపు జనం మాటే! 'అదేమిటి? అట్లా ప్లేటు మార్చా వు?' అని అడిగితే - 'ఏమోనండి, ఆయనెవరో మోదీ, బీజేపీ నాయకుడు, పవన్‌కళ్యాణ్ చంద్రబాబు వైపు ప్రచారం చేస్తున్నారుగా. పైగా చంద్రబాబు రైతులు, డ్వాక్రామహిళల రుణాలన్నీ తను ముఖ్యమంత్రి అయితే రద్దు చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఇంటింటికీ తిరిగి, అప్పులు కట్టకండి - మా బాబు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం రుణ మాఫీ పైనే పెడతాడని చెవిలో ఇల్లుకట్టుకు చెప్తున్నారు. అవతల జగన్ అట్టా అప్పులు రద్దు చేయడం ఉట్టిమాటే! ఓట్ల కోసం చెప్పే అబద్ధమేగానీ, అది జరిగే పనికాదు' అని చెబుతున్నాడాయె! ఎట్టా అయినా మడిసికి ఆశ ఉంటుంది గదా! అని చిన్న సైజు ఉపన్యాసం జెప్పి 'మనలో మనమాట. అదేదో ఎలినోవానో, ఏదో వచ్చిందట! సకాలంలో వర్షాలు పడవంట. కాలం గాని కాలంలో తుపానులు అవీ వచ్చి పంటలు పండవంటగదా! చెప్పుకుంటున్నారు' అని అంటుంటే ఛ! ఛ! అట్లా అనకూడదు. కరువు కాటకాలు. తుపానులు మనుషులు గెలిస్తే, ఓడిపోతే రావు. ఆ మాటకొస్తే 78లో దివిసీమ ఉప్పెన వచ్చింది. అప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు? అప్పుడు కాంగ్రెసోళ్లే గదా! పది వేల మంది చచ్చి పోయారుగా!' అన్నాను. 'అవును అదీ నిజమే' అన్నాడు మా రైతు. ఇటీవల తుపాను వచ్చి మన రాష్ట్రంలో ఉత్తరకోస్తా మూడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. విశాఖనగరం అల్లకల్లోలమైంది. మోదీ, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం బాగాలేకపోవడం వలన, కాశ్మీర్ వరదలు, మన రాష్ట్రంలో తుపును వచ్చిందని ఓ స్వాముల వారు సెలవిచ్చారు. ప్రస్తుత మంత్రి ఒకరు ఇటీవల విలేకరుల సమావేశం సాక్షిగా 2029 వరకూ, మా తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుంది. 2024 తర్వాత మా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు అని ఒక ప్రకటనే చేశారు. అదేమో గానీ ఈయనే చంద్రబాబును అప్పటికి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశాడన్న మాట! చంద్రబాబుగారు విశాల హృదయంతో తేలికగా తీసుకున్నారు గనుక సరిపోయింది గానీ, నన్ను ముఖ్యమంత్రి నుంచి దించేందుకు నువ్వెవరివి? అని ఆగ్రహం తెచ్చుకున్నట్లయితే? అమాత్యుల పదవికే గండం వచ్చేది కదా! ఆయన విలేకరులను తక్కువ అంచనా వేశారు. ఒక గడుసు విలేకరి, మరి అప్పు డు లోకేష్ మంత్రివర్గంలో మీ అబ్బాయి ఉంటాడా? అని అడిగితే ఆ అమా త్యులు కాస్త సిగ్గుగా మా వాడి ఇష్టాయిష్టాలను బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది అని చెప్పారు. ఇంకా నయం. ఈ మంత్రివర్యుల బోళాతనం చూసి, మా వాడి ప్రస్తావన దేనికి? నేనప్పటికి అరవైలలోనే ఉంటాను కదా! అని అంటాడేమో అనుకున్నాను. ఇవి నవ్వుకునే అంశాలయితే, కొందరు అధికార పార్టీ నేతలు చిర్రుబుర్రు లాడుతున్నారు విలేకరుల ప్రశ్నకు. ఈ మధ్య తెలుగుదేశంలో పాత నేతలను పాతగుడ్డలు మూటగట్టినట్లు పక్కన పెట్టి, కార్పొరేట్ రంగంలో నిష్ణాతులైన బడా పారిశ్రామికవేత్తలను చంద్రబాబు చేరదీస్తున్నారు కదా! అలాంటి కోటీశ్వరుడైన ఒక నేతను 'రాజధాని విషయంలో చక్రం తిప్పుతున్నవారూ, చంద్రబాబుకు అతి ముఖ్య సలహాదారూ మీరేనట కదా! మీకు రాజధాని ఎక్కడో ముందే తెలుసనీ, అందుకే నందిగామ ప్రాంతంలో భూములు కొన్నారని వింటున్నాం' అని అడిగారు. దానికాయన కించిత్ ఆగ్రహం చెంది, 'ఉన్నాయి, భూములు ఉండటం తప్పా, ఆ మాటకొస్తే గన్నవరం దగ్గర కూడా ఉన్నాయి. నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను. మీ దగ్గర డబ్బులుంటే మీరూ కొనుక్కోవచ్చు! అందులో ఏముంది?'అన్నారు. నిజమే, తప్పేం లేదు. కాకుంటే 'డబ్బులు మీ దగ్గరే ఉంటాయ్! కొనుక్కోవలసింది మీరే, మాకంత సీన్ ఎక్కడ?' అని విలేకరులు అడగలేదు. తాజాగా జరిగిన ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే ముచ్చట్లు మరీను. వారి దర్పాన్ని, దబాయింపును చూస్తే (పదవి వచ్చే వరకూ) వినయ విధేయతలు రూపుదాల్చినట్లు ఉండే వీరేనా ఇలా మాట్లాడేది అనిపిస్తుంది. ఇటీవల గుం టూరు జిల్లా యడ్లపాడు వద్ద నేషనల్ హైవే మీద కార్లు రేస్‌లో పాల్గొన్నట్టు అత్యంత వేగంతో వెళ్లాయి. అందులో ఒక కారు విజయవాడకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే కుమారుడు నడుపుతున్నాడట. ఆ పసివాడు గతంలో కూడా ఇలా మోటార్ బైక్ రేసు చేస్తూ మంగళగిరి టోల్గేట్ వద్ద పోలీసులకు చిక్కిపోయాడట. పోలీసులలో సైతం ఒక్కోసారి, రాజకీయ నేతలనూ వారి పుత్రరత్నాలనూ, బంధుగణాలనూ చూసినప్పుడు ఎక్కడలేని మావత్వం పెల్లుబుకుతుంది. అందుకే ఆ పసివాడిని వాళ్లు వదిలేశారు. ఈసారి కార్ల రేసులో పాల్గొన్న ఆ యువనాయకుడు అదుపుతప్పి రెండో కారును డీకొట్టాడు. రెండు కార్లు అంతెత్తు ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష వీక్షకుల కథనం. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. ఈ కారు నడిపిన ఎమ్మెల్యే కుమారుడికీ గాయాలయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 'నన్ను అప్రతిష్టపాలు చేయాలని అన్నెం పున్నెం ఎరుగని నా కుమారుణ్ణి టార్గెట్ చేయాలని చూస్తున్నారు. మా వాడు అత్యధిక వేగంతో ఏమీ వెళ్ల లేదు. 70-80 కి.మీ. వేగంలోనే ఉన్నాడు. అయినా ఎమ్మెల్యేలైనంత మాత్రాన, మా పిల్లలు మోటారు బైక్‌లు, కార్లు నడపకూడదా? అనుకోకుండా కుక్క అడ్డమొచ్చింది. నేషనల్ హైవేల మీద అంత ట్రాఫిక్‌లో కార్ల రేసు సాధ్యమా?’ అని కఠినంగా సమాధానమిచ్చారట. అవును మీరు ఎమ్మెల్యేలు మీకే బైకులు, కార్లు ఉంటా యి, ఉండాలి కూడా. అన్యులకు అలా ఉండే హక్కు ఎక్కడిదీ? చంద్రబాబు తన పార్టీ నేతల పిల్లలు ఇలా కార్ల రేసులో పాల్గొనేందుకు వీలుగా కొత్త రాజధాని చుట్టూ మూడంచెల రింగురోడ్డు, అందులో అవుటెస్టు రింగురోడ్డు, 10 లేన్లతో కార్ల రేసుకు అనుగుణంగానే (ఈ మాట స్వయంగా బాబుగారే అన్నారు) నిర్మించే దాకా ఆగరు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన రాజకీయనేత కూడా 'ప్రపంచంలో ఎవరూ చేయనట్లు ఈ తుపాను సందర్భంగా నష్టాన్ని నివారించాను' అని చెప్పుకున్నారు. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటువంటి విపత్కర పరిస్థితి నుండి రెండేళ్ల క్రితం అతి తక్కువ ప్రాణనష్టంతో ఆ రాష్ట్రాన్ని గట్టెక్కించారన్న విషయం కూడా మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారు. ఇక వారి అంతేవాసులైన తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వంటి వారి సంగతేం చెప్పాలి? అయితే ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ మీడియా సలహాదారు కాదు. ప్రభుత్వ ఉద్యోగి. ఆ విషయం కూడా మర్చిపోయి, ఇంకా తాను విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడినన్నట్లు వ్యవహరించడం కూడని పని. ఆయన హుందాగా, ప్రభుత్వం తరఫున వాస్తవాలను వివరించాలి. కావాలంటే విపక్షాల వాదనలో అవాస్తవాన్ని విశదీకరించాలి. అంతేగానీ తెలుగుదేశం పార్టీ నేతలాగా వ్యవహరించరాదు. వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి అర్హుడు కానప్పటికీ వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడంటూ విలేకరుల సమావేశంలోనే పేరు పెట్టి మరీ చెప్పారు. కొందరు అనర్హులు ఈ పెన్షన్ పొందుతున్నారు అని చెప్పడానికి బదులు ఆ శాసనసభ్యుని తండ్రి ఒక్కరే అలాంటివారన్నట్లు చెప్పడం విడ్డూరం. తీరా ఆ ఎమ్మెల్యే వాస్తవం నిరూపిం చమనే సరికి పరకాల నీళ్లు నమలాల్సివచ్చింది. ఉమ్మడి రాష్ర్ట కార్మిక సంక్షేమ నిధి నుంచి కొంత సొమ్మును, అది ఆంధ్ర ప్రదేశ్‌కు రావలసిందే అయినా, ఇంకా అలాంటి నిధులను పంచమని ఆదేశమేలేకుండానే ఏకపక్షంగా తీసుకువచ్చి విజయవాడ బ్యాంకులో జమచేయడాన్ని సమర్థిస్తూ, తెలంగాణ అభ్యంతరాలను తిరస్కరిస్తూ పరకాల విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతవరకూ సరే. కానీ, లెక్కలు మొత్తం తీసి తెలంగాణ ప్రభుత్వంతో నిజం కక్కించేవరకు తాను నిద్రపోనని, ఈ నిధులు ఆంధ్రప్రదేశ్‌కే చెందినప్పటికీ తెలంగాణ యాగీ చేస్తున్నదని పరకాల అన్నారు. నిజానికి, ఇంతకంటే తీవ్రంగా వైరిపక్షాన్ని విమర్శించే దేవినేని ఉమ అమాత్యులు ఉన్నారు. కొసమెరుపు ఏమంటే, ఆ నిధులు మనవే అయినా సౌమ్యంగా చర్చించుకోకుండా, ఏకపక్షంగా తెచ్చుకోవడం సరైంది కాదని, ఆ సొమ్మును బ్యాంకులు జమ చేసుకోరాదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వివరించారు. ఉడతకెందుకు ఊళ్లేలే పని. పరకాలకెందుకు ప్రభువును మించిన ప్రభుభక్తి?