యథా బాబు.. తథా భృత్యులు | Vital Vislashana | Sakshi
Sakshi News home page

యథా బాబు.. తథా భృత్యులు

Published Thu, Nov 6 2014 2:26 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

డాక్టర్ ఏపీ విఠల్ (మార్క్సిస్టు విశ్లేషకులు) - Sakshi

డాక్టర్ ఏపీ విఠల్ (మార్క్సిస్టు విశ్లేషకులు)

 విశ్లేషణ
 ఈ శాసనసభ ఎన్నికలకు ముందు మా ఊరి రైతునొకర్ని 'ఎట్లా ఉంది వాతావరణం?' అని అడిగాను. 'చంద్రబాబు గెలిచేటట్టే ఉన్నాడండీ!'అన్నాడు. మా రైతు మాట దాదాపు జనం మాటే! 'అదేమిటి? అట్లా ప్లేటు మార్చా వు?' అని అడిగితే - 'ఏమోనండి, ఆయనెవరో మోదీ, బీజేపీ నాయకుడు, పవన్‌కళ్యాణ్ చంద్రబాబు వైపు ప్రచారం చేస్తున్నారుగా.  పైగా చంద్రబాబు రైతులు, డ్వాక్రామహిళల రుణాలన్నీ తను ముఖ్యమంత్రి అయితే రద్దు చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఇంటింటికీ తిరిగి, అప్పులు కట్టకండి - మా బాబు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం రుణ మాఫీ పైనే పెడతాడని చెవిలో ఇల్లుకట్టుకు చెప్తున్నారు. అవతల జగన్ అట్టా అప్పులు రద్దు చేయడం ఉట్టిమాటే! ఓట్ల కోసం చెప్పే అబద్ధమేగానీ, అది జరిగే పనికాదు' అని చెబుతున్నాడాయె! ఎట్టా అయినా మడిసికి ఆశ ఉంటుంది గదా! అని చిన్న సైజు ఉపన్యాసం జెప్పి 'మనలో మనమాట. అదేదో ఎలినోవానో, ఏదో వచ్చిందట! సకాలంలో వర్షాలు పడవంట. కాలం గాని కాలంలో తుపానులు అవీ వచ్చి పంటలు పండవంటగదా! చెప్పుకుంటున్నారు' అని అంటుంటే ఛ! ఛ! అట్లా అనకూడదు. కరువు కాటకాలు. తుపానులు మనుషులు గెలిస్తే, ఓడిపోతే రావు. ఆ మాటకొస్తే 78లో దివిసీమ ఉప్పెన వచ్చింది. అప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు? అప్పుడు కాంగ్రెసోళ్లే గదా! పది వేల మంది చచ్చి పోయారుగా!' అన్నాను. 'అవును అదీ నిజమే' అన్నాడు మా రైతు.

 ఇటీవల తుపాను వచ్చి మన రాష్ట్రంలో ఉత్తరకోస్తా మూడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. విశాఖనగరం అల్లకల్లోలమైంది. మోదీ, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం బాగాలేకపోవడం వలన, కాశ్మీర్ వరదలు, మన రాష్ట్రంలో తుపును వచ్చిందని ఓ స్వాముల వారు సెలవిచ్చారు. ప్రస్తుత మంత్రి ఒకరు ఇటీవల విలేకరుల సమావేశం సాక్షిగా 2029 వరకూ, మా తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంటుంది. 2024 తర్వాత మా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడు అని ఒక ప్రకటనే చేశారు. అదేమో గానీ ఈయనే చంద్రబాబును అప్పటికి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశాడన్న మాట! చంద్రబాబుగారు విశాల హృదయంతో తేలికగా తీసుకున్నారు గనుక సరిపోయింది గానీ, నన్ను ముఖ్యమంత్రి నుంచి దించేందుకు నువ్వెవరివి? అని ఆగ్రహం తెచ్చుకున్నట్లయితే? అమాత్యుల పదవికే గండం వచ్చేది కదా! ఆయన విలేకరులను తక్కువ అంచనా వేశారు. ఒక గడుసు విలేకరి, మరి అప్పు డు లోకేష్ మంత్రివర్గంలో మీ అబ్బాయి ఉంటాడా? అని అడిగితే ఆ అమా త్యులు కాస్త సిగ్గుగా మా వాడి ఇష్టాయిష్టాలను బట్టి, అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది అని చెప్పారు. ఇంకా నయం. ఈ మంత్రివర్యుల బోళాతనం చూసి, మా వాడి ప్రస్తావన దేనికి? నేనప్పటికి అరవైలలోనే ఉంటాను కదా! అని అంటాడేమో అనుకున్నాను.

 ఇవి నవ్వుకునే అంశాలయితే, కొందరు అధికార పార్టీ నేతలు చిర్రుబుర్రు లాడుతున్నారు విలేకరుల ప్రశ్నకు. ఈ మధ్య తెలుగుదేశంలో పాత నేతలను పాతగుడ్డలు మూటగట్టినట్లు పక్కన పెట్టి, కార్పొరేట్ రంగంలో నిష్ణాతులైన బడా పారిశ్రామికవేత్తలను చంద్రబాబు చేరదీస్తున్నారు కదా! అలాంటి కోటీశ్వరుడైన ఒక నేతను 'రాజధాని విషయంలో చక్రం తిప్పుతున్నవారూ, చంద్రబాబుకు అతి ముఖ్య సలహాదారూ మీరేనట కదా! మీకు రాజధాని ఎక్కడో ముందే తెలుసనీ, అందుకే నందిగామ ప్రాంతంలో భూములు కొన్నారని వింటున్నాం' అని అడిగారు. దానికాయన కించిత్ ఆగ్రహం చెంది,  'ఉన్నాయి, భూములు ఉండటం తప్పా, ఆ మాటకొస్తే గన్నవరం దగ్గర కూడా ఉన్నాయి. నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను. మీ దగ్గర డబ్బులుంటే  మీరూ కొనుక్కోవచ్చు! అందులో ఏముంది?'అన్నారు. నిజమే, తప్పేం లేదు. కాకుంటే 'డబ్బులు మీ దగ్గరే ఉంటాయ్! కొనుక్కోవలసింది మీరే, మాకంత సీన్ ఎక్కడ?' అని విలేకరులు అడగలేదు.

 తాజాగా జరిగిన ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే ముచ్చట్లు మరీను. వారి దర్పాన్ని, దబాయింపును చూస్తే (పదవి వచ్చే వరకూ) వినయ విధేయతలు రూపుదాల్చినట్లు ఉండే వీరేనా ఇలా మాట్లాడేది అనిపిస్తుంది. ఇటీవల గుం టూరు జిల్లా యడ్లపాడు వద్ద నేషనల్ హైవే మీద కార్లు రేస్‌లో పాల్గొన్నట్టు  అత్యంత వేగంతో వెళ్లాయి. అందులో ఒక కారు విజయవాడకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే కుమారుడు నడుపుతున్నాడట. ఆ పసివాడు గతంలో కూడా ఇలా మోటార్ బైక్ రేసు చేస్తూ మంగళగిరి టోల్‌గేట్ వద్ద పోలీసులకు చిక్కిపోయాడట. పోలీసులలో సైతం ఒక్కోసారి, రాజకీయ నేతలనూ వారి పుత్రరత్నాలనూ, బంధుగణాలనూ చూసినప్పుడు ఎక్కడలేని మావత్వం పెల్లుబుకుతుంది. అందుకే ఆ పసివాడిని వాళ్లు వదిలేశారు. ఈసారి కార్ల రేసులో పాల్గొన్న ఆ యువనాయకుడు అదుపుతప్పి రెండో కారును డీకొట్టాడు. రెండు కార్లు అంతెత్తు ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష వీక్షకుల కథనం. ఆ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. ఈ కారు నడిపిన ఎమ్మెల్యే కుమారుడికీ గాయాలయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 'నన్ను అప్రతిష్టపాలు చేయాలని అన్నెం పున్నెం ఎరుగని నా కుమారుణ్ణి టార్గెట్ చేయాలని చూస్తున్నారు. మా వాడు అత్యధిక వేగంతో ఏమీ వెళ్ల లేదు. 70-80 కి.మీ. వేగంలోనే ఉన్నాడు. అయినా ఎమ్మెల్యేలైనంత మాత్రాన, మా పిల్లలు మోటారు బైక్‌లు, కార్లు నడపకూడదా? అనుకోకుండా కుక్క అడ్డమొచ్చింది. నేషనల్ హైవేల మీద అంత ట్రాఫిక్‌లో కార్ల రేసు సాధ్యమా?’ అని కఠినంగా సమాధానమిచ్చారట. అవును మీరు ఎమ్మెల్యేలు మీకే బైకులు, కార్లు ఉంటా యి, ఉండాలి కూడా. అన్యులకు అలా ఉండే హక్కు ఎక్కడిదీ? చంద్రబాబు తన పార్టీ నేతల పిల్లలు ఇలా కార్ల రేసులో పాల్గొనేందుకు వీలుగా కొత్త రాజధాని చుట్టూ మూడంచెల రింగురోడ్డు, అందులో అవుటెస్టు రింగురోడ్డు, 10 లేన్లతో కార్ల రేసుకు అనుగుణంగానే (ఈ మాట స్వయంగా బాబుగారే అన్నారు) నిర్మించే దాకా ఆగరు.

 ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన రాజకీయనేత కూడా 'ప్రపంచంలో ఎవరూ చేయనట్లు ఈ తుపాను సందర్భంగా నష్టాన్ని నివారించాను' అని చెప్పుకున్నారు. కానీ  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటువంటి విపత్కర పరిస్థితి నుండి రెండేళ్ల క్రితం అతి తక్కువ ప్రాణనష్టంతో ఆ రాష్ట్రాన్ని గట్టెక్కించారన్న విషయం కూడా మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారు. ఇక వారి అంతేవాసులైన తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వంటి వారి సంగతేం చెప్పాలి? అయితే ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ మీడియా సలహాదారు కాదు. ప్రభుత్వ ఉద్యోగి. ఆ విషయం కూడా మర్చిపోయి, ఇంకా తాను విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడినన్నట్లు వ్యవహరించడం కూడని పని. ఆయన హుందాగా, ప్రభుత్వం తరఫున వాస్తవాలను వివరించాలి. కావాలంటే విపక్షాల వాదనలో అవాస్తవాన్ని విశదీకరించాలి. అంతేగానీ తెలుగుదేశం పార్టీ నేతలాగా వ్యవహరించరాదు. వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి అర్హుడు కానప్పటికీ వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడంటూ విలేకరుల సమావేశంలోనే పేరు పెట్టి మరీ చెప్పారు. కొందరు అనర్హులు ఈ పెన్షన్ పొందుతున్నారు అని చెప్పడానికి బదులు ఆ శాసనసభ్యుని తండ్రి ఒక్కరే అలాంటివారన్నట్లు చెప్పడం విడ్డూరం. తీరా ఆ ఎమ్మెల్యే వాస్తవం నిరూపిం చమనే సరికి పరకాల నీళ్లు నమలాల్సివచ్చింది.

  ఉమ్మడి రాష్ర్ట కార్మిక సంక్షేమ నిధి నుంచి కొంత సొమ్మును, అది ఆంధ్ర ప్రదేశ్‌కు రావలసిందే అయినా, ఇంకా అలాంటి నిధులను పంచమని ఆదేశమేలేకుండానే ఏకపక్షంగా తీసుకువచ్చి విజయవాడ బ్యాంకులో జమచేయడాన్ని సమర్థిస్తూ, తెలంగాణ అభ్యంతరాలను తిరస్కరిస్తూ పరకాల విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతవరకూ సరే. కానీ, లెక్కలు మొత్తం తీసి తెలంగాణ ప్రభుత్వంతో నిజం కక్కించేవరకు తాను నిద్రపోనని, ఈ నిధులు ఆంధ్రప్రదేశ్‌కే చెందినప్పటికీ తెలంగాణ యాగీ చేస్తున్నదని పరకాల అన్నారు. నిజానికి, ఇంతకంటే తీవ్రంగా వైరిపక్షాన్ని విమర్శించే దేవినేని ఉమ అమాత్యులు ఉన్నారు. కొసమెరుపు ఏమంటే, ఆ నిధులు మనవే అయినా సౌమ్యంగా చర్చించుకోకుండా, ఏకపక్షంగా తెచ్చుకోవడం సరైంది కాదని, ఆ సొమ్మును బ్యాంకులు జమ చేసుకోరాదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వివరించారు. ఉడతకెందుకు ఊళ్లేలే పని. పరకాలకెందుకు ప్రభువును మించిన ప్రభుభక్తి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement