కరువు మేఘాలు ! | insufficient rains in telugu states in kharif season | Sakshi
Sakshi News home page

కరువు మేఘాలు !

Published Sun, Aug 28 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

కరువు మేఘాలు !

కరువు మేఘాలు !

వరుసగా రెండేళ్లపాటు కరువు బారిన పడ్డ రాష్ట్రంపై ఈసారి కూడా వరుణుడు కరుణ చూపడం లేదు!

 ► చినుకు జాడ లేక ఎండుతున్న పంటలు
 ► అదనులో ముఖం చాటేస్తున్న వానలు..
 
► ఈ నెలలో సాధారణం కంటే అతి తక్కువ
 ► రాష్ట్రంలో గత 15 రోజుల్లో ఏకంగా 90 శాతం మేర లోటు
 ► ఆందోళన చెందుతున్న రైతన్నలు..
 ► మొక్కజొన్న, సోయా, పెసరలపై తీవ్ర ప్రభావం
 ► మరో వారంపాటు వానల్లేకుంటే సగం పంటలు ఎండిపోయే ప్రమాదం 
 
న్యూఢిల్లీ/హైదరాబాద్ : వరుసగా రెండేళ్లపాటు కరువు బారిన పడ్డ రాష్ట్రంపై ఈసారి కూడా వరుణుడు కరుణ చూపడం లేదు! పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది కూడా కరువు మేఘాలు కమ్ముకునేలా ఉన్నాయి. తొలకరి తొలినాళ్లలో మురిపించిన చినుకమ్మ.. ఇప్పుడు జాడ లేకుండా పోయింది. వర్షాలు బాగానే పడతాయన్న అంచనాల మధ్య ఆశతో పంటలు సాగు చేసిన రైతులంతా దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఖరీఫ్ కీలక దశలో వర్షాలు ముఖం చాటేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఈ నెల ప్రారంభం నుంచి పెద్దగా వర్షాల్లేకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. ఆగస్టులో భారీ వర్షాలు కురవాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సగానికిపైగా పంటలు వాడిపోయే దశకు చేరుకున్నాయని.. మరో వారం రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే అవి చేతికందడం కష్టమేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడిచిన మూడు వారాలు సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
 
వారం వారం కరువు దిశగా...
ఆగస్టు 11న భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆగస్టు 4 నుంచి 10 వరకు తెలంగాణలో 48.3 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాలి. కానీ 51 శాతం తక్కువగా.. కేవలం 23.6 మి.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇదే వారంలో అటు కోస్తాంధ్రలో 32.7 మి.మీ. మేర సాధారణ వర్షపాతం ఉండాలి. అయితే 75 శాతం తక్కువగా.. 8.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాయలసీమలో మరీ ఘోరంగా 87 శాతం తక్కువగా.. 22.8 మి.మీ. వర్షపాతానికిగాను 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.

- ఆగస్టు 18న విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆగస్టు 11 నుంచి 17 వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 54.3 మి.మీ. కురవాల్సి.. 5.3 మి.మీ.(90 శాతం తక్కువ) నమోదైంది. కోస్తాంధ్రలో 38.5 మి.మీ.కుగాను.. 5.9 మి.మీ(85 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. రాయలసీమలో 23.4 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను.. కేవలం 1.9 మి.మీ.(92 శాతం తక్కువ) కురిసింది.
 
- ఆగస్టు 25నాటి నివేదిక ప్రకారం ఆగస్టు 18 నుంచి 24 మధ్య తెలంగాణలో 49.0 మి.మీ. సాధారణ వర్షపాతం కురవాలి. అవయితే 3.7 మి.మీ.(92 శాతం తక్కువ) మాత్రమే నమోదైంది. ఇక కోస్తాంధ్రలో 36.7 మి.మీ. కురవాల్సి ఉండగా.. 5.8 మి.మీ.(84 శాతం తక్కువ), రాయలసీమలో 25.5 మి.మీ. కురవాల్సి ఉండగా.. కేవలం 0.3 (99 శాతం తక్కువ) వ ర్షపాతం నమోదైంది.

పంటలు ఎండుతున్నా.. సాధారణమే!
ఓవైపు పంటలు ఎండుతున్నా.. తొలకరిలో కురిసిన వర్షపాతం ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 24 వరకు తెలంగాణలో 549.4 మి.మీ. సాధారణ వర్షపాతానికిగాను 496.8 మి.మీ. నమోదైంది. కోస్తాంధ్రలో 385.7 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను 343.5 మి.మీ. కురిసింది. రాయలసీమలో 242.1 మి.మీ.లకుగాను.. 267.1 మి.మీ. నమోదైంది. సాధారణంగా మైనస్ 19 శాతం నుంచి ప్లస్ 19 శాతం వరకు సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. అంటే ఈ సీజన్‌లో మొత్తంగా చూస్తే ఇప్పటివరకు తెలంగాణ, ఏపీలో సాధారణ వర్షపాతం నమోదైనట్టు లెక్క. కానీ పంటలకు కీలకమైన గత మూడు వారాలుగా వానల్లేకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. మరో వారం ఇలాగే  ఉంటే కరువు బారిన పడక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
మొక్కజొన్న, సోయా, పెసరపై తీవ్ర ప్రభావం
 తెలంగాణలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు. అందులో అన్ని రకాల పంటలు కలిపి ఇప్పటివరకు 83.98 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో మొక్కజొన్న సాధారణ సాగువిస్తీర్ణం 12.12 లక్షల ఎకరాలు కాగా.. ఏకంగా 13.90 లక్షల ఎకరాల్లో (115%) సాగు చేశారు. పెసర సాధారణ సాగు విస్తీర్ణం 2.71 లక్షల ఎకరాలు కాగా.. 3.68 లక్షల ఎకరాల్లో (136%) సాగు చేశారు. ఖరీఫ్‌లో సోయా సాధారణ సాగు విస్తీర్ణం 4.98 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 7.36 లక్షల ఎకరాల్లో (148%) సాగు చేశారు. పత్తి 29.88 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 86 శాతం జరిగింది. వర్షాల్లేకపోవడంతో ఈ పంటల్లో ప్రస్తుతం సగానికిపైగా ఎండిపోయే దశకు చేరుకున్నాయని వ్యవసాయశాఖ చెబుతోంది.
 
 రాష్ట్రంలో ప్రస్తుతం ఏ పంట పరిస్థితి ఎలా ఉందంటే..?
 
 మొక్కజొన్న: పీచు దశలో ఉంది. ఇప్పుడే నీళ్లు బాగా అవసరం. కానీ వానల్లేవు. రాష్ట్రవ్యాప్తంగా 13.90 లక్షల ఎకరాల్లో పంట పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
 సోయాబీన్: 7.36 లక్షల ఎకరాల్లో పూత, కాత మీద ఉంది. ఇప్పుడు నీళ్లందితేనే పంట బాగుంటుంది. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో పంట ఎండిపోయే దశకు చేరుతోంది.
 
 పత్తి: ఇది ఎక్కువగా నల్లరేగడి భూముల్లో వేస్తారు కాబట్టి ప్రస్తుతానికి కాస్త పర్వాలేదు. కానీ మరో వారందాకా వర్షాల్లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుంది.
 
 వరి: ఖరీఫ్‌లో 24.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాలి. సాధారణంగా ఇప్పటివరకు 14.42 లక్షల ఎకరాల్లో సాగు కావాలి. కానీ 11.31 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. నాట్లేసిన చోట కూడా చాలా ప్రాంతాల్లో ఎండిపోతోంది.
 
  పెసర: 3.68 లక్షల ఎకరాల్లో వేశారు. వానల్లేక పంటంతా ఎండిపోయే దశకు చేరుకుంటోంది.
 
 ఇవే కాదు.. మొత్తంగా అన్ని పంటలు కలిపి సగానికిపైగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది!!
 
 
 ఖరీఫ్ పంటలు అధ్వానం  - మంత్రికి జిల్లా వ్యవసాయాధికారుల నివేదన
 ప్రస్తుతం ఖరీఫ్ పంటలు అధ్వానంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. శనివారం సచివాలయంలో జిల్లా జేడీఏలు, ఇతర వ్యవసాయాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏలు జిల్లాల్లో పంటల పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మొక్కజొన్న అనేక చోట్ల ఎండిపోతోందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బోర్లల్లో తక్కువ నీరుండి పంటలకు సరిపోని పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు స్ప్రింక్లర్లు ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. వాటిని ఎలా అందించాలో ఉద్యానశాఖ కసరత్తు చేయాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఖరీఫ్ పంటలు నష్టపోతే ముందస్తు రబీకి సన్నాహాలు చేయాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోందని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది.
 
 జూన్ 1 నుంచి ఈ నెల 24 వరకు జిల్లాల వారీగా సాధారణ, నమోదైన వర్షపాతం (మి.మీ.లలో..)
 --------------------------------------------------------
 జిల్లా సాధారణం కురిసింది
 --------------------------------------------------------
 నిజామాబాద్                      661.9            623.1
 మెదక్                              514.4            372.0
 వరంగల్                           614.7             584.6
 కరీంనగర్                         627.1              564.3
 ఆదిలాబాద్                      777.3              813.1
 రంగారెడ్డి                         423.3              358.4
 హైదరాబాద్                     421.6              327.6
 మహబూబ్‌నగర్               306.8              269.5
 నల్లగొండ                        375.5              283.6
 ఖమ్మం                          647.1              592.5
 ===================================
 సరాసరి                         537.0               480.6
 ===================================

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement