
మళ్లీ అన్యాయం ?
అనంత' రైతులకు మరోసారి అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది.
– 41 మండలాల్లో పంట నష్టం అంచనాలకు సన్నాహాలు
- 22 మండలాలకు మొండిచేయి
– కరువు నివేదికల తయారీలో జాప్యం చేస్తున్న వ్యవసాయశాఖ
అనంతపురం అగ్రికల్చర్ : 'అనంత' రైతులకు మరోసారి అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. హెక్టారుకు 285 కిలోలకు పైబడి వేరుశనగ పంట దిగుబడులు వచ్చాయంటూ పంట నష్టం అంచనాలు వేయకుండా 22 మండలాలకు మొండిచేయి చూపడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైనట్లు తెలిసింది. జిల్లాలోని ఉన్న 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చి ప్రభుత్వం చేతులు దులుపుకోగా... పాలకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా జిల్లా అధికారులు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. కరువు మండలాల జాబితా ఆధారంగా ఇతర జిల్లాలలో పంట నష్టం అంచనాలు, సహాయక చర్యలు ప్రారంభం కాగా 'అనంత'లో మాత్రం వేచిచూసే ధోరణి అవలంభిస్తుండటంపై పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖరీఫ్ సర్వనాశనం
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ 6.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేసిన వేరుశనగ, మరో 1.50 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ఇతర ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రక్షకతడి పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసినా ఒక్క శాతం కూడా ఫలితం కనిపించలేదనే వాస్తవం పంట కోత ప్రయోగాల్లో స్పష్టంగా వెల్లడైంది. పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) ఎలాగైనా ఎగ్గొట్టాలనే ఆలోచనతో రక్షకతడి ఇచ్చి ఎండిపోతున్న 3.72 లక్షల ఎకరాల పంటను కాపాడామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కలెక్టర్, వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. కానీ... క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండటంతో విపక్షాలు, రైతులు, రైతు సంఘాల నుంచి ఒత్తిళ్లు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లో జిల్లాలోని 63 మండలాలనూ రాష్ట్ర ప్రభుత్వం కరువు జాబితాలోకి చేర్చింది. కానీ... పంట నష్టం అంచనాలు (ఎన్యుమరేషన్) తయారు చేయకుండా వ్యవసాయశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు.
సగటు దిగుబడి 285 కిలోలు : జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ, ప్రణాళికశాఖ అధికారులు నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో కొన్ని చోట్లా 'సున్నా' దిగుబడులు కూడా వచ్చాయి. కొన్ని చోట్ల మాత్రం చెట్టుకు నాలుగైదు కాయలు కాశాయి. అయితే సరాసరి హెక్టారుకు 285 కిలోలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 285 కిలోల కన్నా 22 మండలాల్లో ఎక్కువగా దిగుబడులు రావడంతో అక్కడ నష్టం అంచనాలు అవసరం లేదనే భావనకు వచ్చినట్లు సమాచారం. తాడిపత్రి, గుత్తి, శింగనమల, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో 22 మండలాలు ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాదీ అన్యాయం
2015లో కూడా ఖరీఫ్ పంటలు దెబ్బతినడంతో ప్రభుత్వం జిల్లా అంతటినీ కరువు జాబితాలోకి చేర్చిన విషయం తెలిసిందే. కరువు జిల్లాగా ప్రకటించినా పంట నష్టం అంచనాలు తయారు చేయకపోవడంతో జిల్లా రైతులు నష్టపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కరువు సాయం అందలేదు. వాతావరణ బీమా పథకం కింద కేవలం 24 మండలాల పరిధిలోని 1.85 లక్షల మంది రైతులకు మాత్రమే రూ.109 కోట్లు పరిహారం మంజూరు చేశారు.
రెండు రోజులో నిర్ణయం
కరువు నివేదిక తయారీ జాప్యం, అందులోనూ కొన్ని మండలాలను పక్కన పెట్టారనే విషయంపై వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తిని వివరణ కోరగా... రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుని పంట నష్టం అంచనాలు చేపడుతామన్నారు.