
సాక్షి, హైదరాబాద్ :కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ సీజన్‌లోనే వీలైనంత ఎక్కువ గోదావరి నీటిని ఎత్తిపోసి గరిష్ట ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండే జూలై నుంచి వరద తీవ్రత తగ్గే వరకు వీలైనన్ని ఎక్కువ రోజులు నీటిని ఎత్తిపోసేలా రంగం సిద్ధం చేస్తోంది. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనిష్టంగా 90 రోజుల్లో 180 టీఎంసీల నుంచి గరిష్టంగా 120 రోజుల్లో 240 టీఎంసీలను ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నీటిని ఎక్కడికక్కడ చెరువులకు మళ్లించేలా తూముల నిర్మాణం వేగిరం చేయాలని సూచించారు.
ఇలా వరద..అలా ఎత్తిపోత..
ఈసారి జూన్ 11 తర్వాతే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేయడంతో రుతుపవనాలు పుంజుకొని గోదావరిలో ప్రవాహాలు ఉధృతం అయ్యేందుకు జూలై నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై చివరి నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. వరద ఆలస్యం కావడం సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి రానుంది. వరద ఆలస్యమైతే మరో 20–30 పనిదినాలు ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో మోటార్ల బిగింపు పూర్తిస్థాయిలో చేయడంతోపాటు వెట్‌రన్‌ను పూర్తి చేసే వీలు చిక్కనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సహా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీల్లో పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోయడం సులభమవుతుంది. జూలై మొదలు నవంబర్ వరకు గోదావరిలో ఉధృతంగా నీటి ప్రవాహాలుంటాయి. ఏటా ఈ కాలంలోనే 2 వేల నుంచి 3 వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తోంది.
ఈ నేపథ్యంలో కనీసం 90 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 180 టీఎంసీలను, గరిష్టంగా 120 రోజుల్లో 240 టీఎంసీలను ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు. 180 టీఎంసీల నీటిని ఎత్తిపోశాక అన్ని మోటార్లను నడపకున్నా అవసరమున్న మేర నీటిని తోడేలా ఒక్కో మోటార్‌ను నడిపించి నీటిని తీసుకోవాలని సూచించారు. ఈ నీటిని తోడేందుకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లలో 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక ఎత్తిపోసే నీటిని మిడ్‌మానేరుకు తరలించి అక్కడ వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి కనిష్టంగా 60 టీఎంసీలు మళ్లించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.
పునరుజ్జీవ పథకంలో ఒక టీఎంసీ నీటిని తీసుకునే వెసలుబాటు ఉన్నా ప్రస్తుతం అక్కడ అర టీఎంసీ నీటిని తీసుకునేలా పంపులు సిద్ధమవుతున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్–1 కిందే 9.60 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీరు సరిపోనుంది. ఇక స్టేజ్–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎస్సారెస్పీకి సహజంగా వచ్చే గోదావరి ప్రవాహపు నీళ్లు దీనికి సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 120 టీఎంసీలతో మేడిగడ్డ (16.17 టీఎంసీలు), అన్నారం (10.87 టీఎంసీలు), సుందిళ్ల (8.83 టీఎంసీలు), ఎల్లంపల్లి (20 టీఎంసీలు), మేడారం (0.78 టీఎంసీ), మిడ్‌మానేరు (25 టీఎంసీలు), అనంతగిరి (3.50 టీఎంసీలు), రంగనాయక్ సాగర్ (3 టీఎంసీలు), కొండపోచమ్మ సాగర్ (15 టీఎంసీలు) వద్ద నిల్వ చేసి అవసరాలకు తగినట్లు వాటి కింది కాల్వలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.
జూలై 15లోగా తూములు, చెరువులకి మళ్లింపు...
కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే గోదావరి నీటిని వీలైనన్ని చెరువులకు మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించాలని సూచించారు. మొత్తంగా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే గోదావరి నీటితో 3,011 చెరువులు నింపాలని అందుకు తగ్గట్లే తూముల నిర్మాణం చేయాలని సూచించారు. కాళేశ్వరం నీళ్లతో తొలి ప్రయోజనం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనుంది. ఎస్సారెస్పీ పరిధిలో మొత్తంగా 775 తూముల నిర్మాణం అవసరం ఉంటుందని ఇది వరకే గుర్తించారు. ఈ తూముల నిర్మాణం జరిగితే కాళేశ్వరం కాల్వల ద్వారా 1,192 చెరువులకు నీటిని మళ్లించే వెసలుబాటు ఉంటుందని గుర్తించి ఈ తూముల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇక కాళేశ్వరం పరిధిలోనే మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మ సాగర్ వరకు 158 తూముల నిర్మాణం అవసరం ఉంటుందని, వాటి ద్వారా గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను అభివృధ్ధి చేసి 2,100 చెరువులకు నీరందించే అవకాశం ఉంటుందని గుర్తించారు. తూముల నిర్మాణ పనులను జూలై 15 నాటికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెరువులన్నీ నింపితే కనిష్టంగా 35 టీఎంసీల నీటినిల్వ సాధ్యం కానుంది.