సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఫలాలను 2022 ఖరీఫ్‌లో రైతులకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హెడ్ వర్క్స్ (జలాశయం), కుడి, ఎడమ కాలువలను 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీల)ను ఆలోగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు సంబంధించి ఇప్పటికే సర్వేను పూర్తి చేశారు. బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల అలైన్‌మెంట్ మేరకు ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిపై స్పష్టత వచ్చాక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. భూసేకరణకు సమాంతరంగా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు నిర్వహించి, వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నారు. (చదవండి: పోలవరంపై సానుకూలం)
యాక్షన్ ప్లాన్ మేరకు వేగంగా పనులు
►పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) మేరకు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలు, పునరావాసం కల్పన పనులను వేగవంతం చేసింది.
►2021 మే నాటికి స్పిల్ వే, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. వాటికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టాలని అధికారులకు నిర్దేశించింది.
►2021 జూన్‌లో గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, ఈసీఆర్‌ఎఫ్ పనులను వరద సమయంలోనూ కొనసాగించడం ద్వారా వచ్చే డిసెంబర్ నాటికి జలాశయం పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆలోగా జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీలు (అనుసంధానాలు), ప్రధాన కాలువల పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.
►పోలవరం కుడి కాలువ ద్వారా పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. అలాగే కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలి. ఎడమ కాలువ కింద తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించాలి.
►ఆయకట్టుకు నీళ్లందించాలంటే ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువలు తవ్వాలి. కానీ.. గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కనీసం సర్వే పనులు కూడా చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు పనులకు సమాంతరంగా డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఈ మేరకు సర్వే పనులు పూర్తి చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment