
ఖరీఫ్ కల్లోలం
వేరుశనగ సాగుకు జిల్లా పెట్టిందిపేరు. 85 శాతం మెట్ట ప్రాంతం ఉన్న జిల్లాలో దాదాపు 8 లక్షల మంది రైతుల బతుకులు వేరుశనగపై ఆధారపడ్డాయి.
► 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఆగస్టులో వర్షాభావం
► రూ.2,500 కోట్ల వేరుశనగ దిగుబడులపై రైతన్న ఆందోళన
► ఆదుకోని రక్షక తడి = పంటలను తొలగిస్తున్న రైతులు
అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ సాగుకు జిల్లా పెట్టిందిపేరు. 85 శాతం మెట్ట ప్రాంతం ఉన్న జిల్లాలో దాదాపు 8 లక్షల మంది రైతుల బతుకులు వేరుశనగపై ఆధారపడ్డాయి. అయితే ఇక్కడి కరువు పరిస్థితులతో పదేళ్లకు ఒకసారి కానీ పంట పండే పరిస్థితి లేదు. ‘ప్రత్యామ్నాయం’ అంటూ పాలక యంత్రాంగం గొప్పలు చెబుతున్నా, అది ఆచరణలోకి తేవడంలో ఘోరంగా విఫలమవుతోంది. ఇన్‌పుట్‌సబ్సిడీ, వాతావరణ బీమా లాంటి పథకాలు కూడా ఆదుకునే పరిస్థితి లేకపోవడంతో అన్నదాత ఇంట ఆక్రందనలు, ఆత్మహత్యల పరంపర నిత్యకృత్యంగా మారుతోంది.
ఆగస్టు సంక్షోభం
ఈ ఏడాది జూన్, జూలైలో కురిసిన వర్షాలు రైతు ఇంట ఖరీఫ్‌పై ఆశలు రేకెత్తించాయి. అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి ఎలాగోలా పంటలు సాగు చేశారు. జూలై మధ్యలో కొంత ఆందోళన కలిగించినా ఆఖరి వారంలో వర్షాలు పడటంతో అదుపులోకి వచ్చింది. కానీ... ఇపుడు ఆగస్టు సంక్షోభం నెలకొంది. 88.7 మి.మీ గానూ 25 రోజులవుతున్నా కేవలం 4.3 మి.మీల వర్షపాతమే నమోదైంది. ఆగస్టులో 94 శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. 20 ఏళ్లలో ఆగస్టులో ఎపుడూ ఇలా జరగలేదు.
రూ.వేల కోట్లు నష్టం
వర్షం లేకపోవడంతో 6.06 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉండటంతో ఏకంగా రూ.2,500 కోట్లు విలువ చేసే పంట కోల్పోయే ప్రమాదం నెలకొంది. మిగతా పంటలను కూడా పరిగణలోకి తీసుకుంటే అదనంగా మరో రూ.1,000 కోట్ల వరకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు జిల్లా రైతులు దాదాపు రూ.950 కోట్లు వరకు వెచ్చించి ఉంటారని ఓ అంచనా.
ఫలించని రెయిన్‌గన్ల ప్రయోగం
జిల్లాలో 3,900 రెయిన్‌గన్లు, 3 వేల సెట్లు స్ప్రింక్లర్లు, 1.28 లక్షల సంఖ్యలో పైపులు, 1,770 డీజిల్ ఇంజిన్లు సరఫరా చేశారు. జిల్లా అంతటా నీటి సమస్య ఎక్కువగా ఉన్నందున అరకొరగా రక్షకతడి ఇస్తున్నారు. రోజూ 700 నుంచి 900 వరకు రెయిన్‌గన్లను ఉపయోగించని పరిస్థితి నెలకొంది. మిగతావి కూడా 80 శాతం వరకు తెలుగు తమ్ముళ్లు వశం చేసుకోవడంతో అర్హులైన రైతులు లబోదిమోమంటున్నారు.