
8 లక్షల హెక్టార్లు
- ఖరీఫ్ సాగు లక్ష్యం ఇదీ..
– ఇందులో వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లు
– కంది 50 వేలు, పత్తి 46 వేలు, వరి 22 వేల హెక్టార్లు
- అంచనా వేసిన వ్యవసాయ శాఖ
అనంతపురం అగ్రికల్చర్ : జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్-2017లో జిల్లా వ్యాప్తంగా 8,01,675 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వర్షాధారంగా 7,43,902 హెక్టార్లు కాగా, నీటి వసతి కింద 57,773 హెక్టార్లుగా గుర్తించింది. ప్రధాన పంట వేరుశనగ 6,04,693 హెక్టార్ల విస్తీర్ణంలో వేసే అవకాశముందని అధికారులు నివేదిక తయారు చేశారు. గత ఐదేళ్లలో ఖరీఫ్‌లో సాగైన వివిధ రకాల పంటల విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది సాగు లక్ష్యాలను అంచనా వేశారు. వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటలతో పాటు ఉల్లి, ఎండుమిర్చి, పొగాకు, చెరకు, పసుపు తదితర 25 రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణాన్ని కూడా అంచనా వేశారు. అత్యధికంగా వేరుశనగ కాగా, ఆ తరువాత కంది 50 వేల హెక్టార్లు, పత్తి 46 వేల హెక్టార్లు, వరి 22 వేల హెక్టార్లు, మొక్కజొన్న 18 వేల హెక్టార్లు, జొన్న 12 వేల హెక్టార్లు, ఆముదం 13 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని భావిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే అనుకున్న ప్రకారం సాగు చేసే పరిస్థితి ఉంటుంది. లేదంటే పంటల విస్తీర్ణం తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ విషయం గతంలోనూ పలుమార్లు స్పష్టమైంది. అనుకున్న ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపించి, సకాలంలో తొలకర్లు కురిస్తే సాధారణ సాగు విస్తీర్ణానికి కాస్త అటూఇటుగా పంటలు వేసే అవకాశం ఉంటుంది. గతేడాది కూడా 8.73 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణంగా అంచనా వేశారు. అననుకూల వర్షాల వల్ల సీజన్ ముగిసేనాటికి 7.72 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. గత నాలుగైదేళ్లుగా విస్తీర్ణం తగ్గుముఖం పట్టడంతో సాధారణ సాగు 9.05 లక్షల హెక్టార్ల నుంచి ప్రస్తుతం 8.01 లక్షల హెక్టార్లకు తగ్గించారు. ఐదేళ్ల కిందటి విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న పంటల విస్తీర్ణం కాస్త తగ్గింది. ఇదే తరుణంలో సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, ఉలవ, కంది, పత్తి పంటల విస్తీర్ణంలో కొద్దిగా పెరుగుదల కనిపించింది.
అధికారిక నివేదిక ప్రకారం ఈ ఖరీఫ్‌లో పంటల సాగు అంచనా ఇలా...
––––––––––––––––––––––––––––––––––––––––
పంట పేరు విస్తీర్ణం (హెక్టార్లలో) పంట పేరు విస్తీర్ణం (హెక్టార్లలో)
––––––––––––––––––––––––––––––––––––––––
వరి 22,169 వేరుశనగ 6,04,693
జొన్న 12,560 సజ్జ 2,191
మొక్కజొన్న 18,768 రాగి 1,420
కొర్ర 3,217 ఉలవ 6,335
పెసర 6,357 మినుము 495
కంది 50,570 అలసంద 1,320
పత్తి 46,161 పొద్దుతిరుగుడు 5,058
ఆముదం 13,292 సోయాబీన్ 834
మిరప 3,343 ఉల్లి 1,952
చెరకు 112 పొగాకు 15
పసుపు 30 ఇతరత్రా .. 781
––––––––––––––––––––––––––––––––––––––––