రామభద్రపురం(బొబ్బిలి): కొద్ది రోజులుగా టమాటా ధర పైపైకి చేరుతోంది. పంటలు సరిగ్గా పండకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వినియోగదారులు కూరగాయల వైపు చూడడానికే భయపడుతున్నారు. రామభద్రపురం కూరగాయల మార్కెట్‌లో ప్రస్తుతం టమాటా ధర 80 రూపాయలు పలుకుతోంది. అలాగే వంగ, చిక్కుడు, బెండ, ఆనప, పచ్చిమిరప ధరలు కూడా పెరిగాయి. వేసవిలో చాలామంది రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేసినప్పటికీ ఆశించిన దిగుబడి రాలేదని, అందుకే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కూరగాయల సాగు చేపడుతున్నప్పటికీ, అవి అందుబాటులో వచ్చేసరికి సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రామభద్రపురం మార్కెట్ నుంచి కూరగాయలను బెంగళూరు, బరంపురం, కొరాపుట్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అయితే టమాటా ధర ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల వ్యా పారులు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
రెతులకు నష్టమే..
టమాటా ధర బాగా పెరిగింది కాబట్టి రైతులు ఏమైనా లాభపడుతున్నారా అంటే అదీ లేదు. మార్కెట్‌కు సరుకు తీసుకురాగానే దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దళారులకు ఇవ్వకుండా సరుకు ఉంచుదామంటే, పచ్చి సరుకు కావడంతో ఎక్కడ పాడవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు విక్రయించాల్సివస్తోంది. కూరగాయల ధరలు బాగా పెరిగిపోవుడంతో కిలోకు బదులు అరకిలోతో సర్దుకోవాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
కూరగాయలు ప్రస్తుతం పది రోజుల కిందట
( కిలో. రూ.) (కిలో.రూ.)
దొండ 20 15
చిక్కుడు 60 40
బెండ 30 20
వంగ 40 20
బీర 30 22
ఆనప 15 10
టమాటా 80 30
మునగ 60 30
పచ్చిమిర్చి 60 30
టమాటా @ 80
Published Tue, Jul 18 2017 4:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
Advertisement