ఏటా లేటే!
ఏటా లేటే!
Published Sun, Jul 17 2016 11:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
– ‘లేట్’ ఖరీఫ్‌తో రైతులకు తీవ్ర నష్టం
– అదనుదాటిపోయాక హెచ్చెల్సీ కింద పంటల సాగు
– పాలకులు కళ్లు తెరిస్తేనే అన్నదాతకు ప్రయోజనం
అదనులో పంట సాగు చేయడం ద్వారా ఆశించిన మేర దిగుబడులు సాధించొచ్చు. అలాంటిది ‘లేట్ ఖరీఫ్’ పేరుతో అదను దాటిన తర్వాత హెచ్చెల్సీ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. పాలకులు కళ్లు తెరిచి అదనులో నీరిస్తేనే అన్నదాతకు ప్రయోజనం ఉంటుంది.
అనంతపురం సెంట్రల్ : ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నీటి లభ్యత 151 టీఎంసీలుగా గత నెల 22న జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో లెక్కగట్టారు. ఈ లెక్కన హెచ్చెల్సీకి 23 టీఎంసీలు వస్తాయని అంచనా వేశారు. అధికారుల అంచనా ప్రకారం తుంగభద్రకు వరద నీరు అశాజనకంగానే వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో (శనివారం నాటి లెక్కల ప్రకారం) 39.862 టీఎంసీలు నిల్వ ఉంది. రెండురోజుల్లో 40 టీఎంసీలుకు నిల్వ చేరుకుంటుంది. ఏటా జలాశయంలో 40 టీఎంసీలు వచ్చిన వెంటనే హెచ్చెల్సీకి నీటిని విడదల చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మాత్రం పంటలకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేస్తారనేది ఇప్పటి వరకూ స్పష్టత లేదు. హెచ్చెల్సీ కర్ణాటకలో వంద కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాలువ పక్కన మాగాణి భూములు ఉండడంతో వెంటనే నీరు తీసుకొని పంటలు సాగు చేస్తారు. కానీ చివరన ఉన్న అనంతపురానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నీరొచ్చాక రిజర్వాయర్‌లలో స్టోరేజ్ చేసుకొని పంటలకు వదిలేందుకు దాదాపు నెలరోజులు అవుతోంది. దీని వలన పంటల సాగు తీవ్ర ఆలస్యం అవుతోంది.
ఆధిపత్యపోరుతో ఆయకట్టుకు శాపం
తుంగభద్ర ఎగువకాలువ కింద అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులు ఆధారపడి ఉన్నారు. కాలువ కింద సుమారు 2.84 లక్షల ఎకరాలు ఉంది. అయితే ప్రతి సంవత్సరం లక్ష ఎకరాల వర కు సాగునీరిస్తున్నారు. గతేడాది మరీ దయనీయంగా వర్షాభావం పేరుతో ఆయకట్టును కుదించి 55 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు మాత్రమే సాగు నీరందించారు. గతేడాది హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కలుపుకొని దాదాపు 25 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి. అయినా కూడా పంటలకు నీరివ్వలేకపోయారు. ఇందుకు కారణం అధికారపార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నెలాఖరుల్లో తెలుస్తుంది
హెచ్చెల్సీకి నీటి విడుదల విషయం ఈ నెలాఖరులోగా తెలుస్తుంది. ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశముంది. బోర్డు నీటిని విడుదల చేయడానికి అంగీకరిస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. నీటి సలహా మండలి సమావేశం కూడా త్వరలో నిర్వహించి ప్రజాప్రతినిధుల సలహాలు స్వీకరిస్తాం. – టి.వి.శేషగిరిరావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
Advertisement