సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.2620.12 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు గత ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మొన్నటి వరకూ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన వరప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితిపై ఆయన కలెక్టర్ల సదస్సులో సోమవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2018–19 ఖరీఫ్ సీజన్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, రబీలో 13 జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యన్నారు. అలాగే, 2019–20 ఖరీఫ్‌లో ఈనెల 21 వరకు 59.1 శాతం లోటు వర్షపాతం నమోదైందంటూ గణాంకాలతో వివరించారు. ‘2018–19లో ఖరీఫ్‌లో 347 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం రూ.900.40 కోట్లు విడుదల చేసింది.
16 లక్షల మంది రైతులకు రూ.1,832.60 కోట్ల పెట్టుబడి రాయితీ మొత్తాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే, రబీ సీజన్‌లో 257 కరువు మండలాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.644.97 కోట్ల కేంద్ర సాయం కోరింది. దీనిపై సీఎం హోదాలో మీరు మరోసారి లేఖ రాసి నిధులు విడుదలకు ప్రయత్నం చేయాలి. రబీ సీజన్‌లో రూ.787.52 కోట్లు, ఖరీఫ్ సీజన్‌లో 1832.60 కోట్లు కలిపి మొత్తం రూ.2620.12 కోట్ల పెట్టుబడి రాయితీని గత ప్రభుత్వం రైతులకు చెల్లించలేదు’.. అని వరప్రసాద్ వివరించారు. దీనికి స్పందించిన సీఎం జగన్.. గత ప్రభుత్వం అన్నీ ఇలాగే చేసిందని, అయినా మనం ప్రథమ ప్రాధాన్యం కింద రైతులకు పెట్టుబడి రాయితీ బకాయిలు విడుదల చేయాలి రావత్ అన్నా.. అని చెప్పారు.
విత్తన కొరత పాపం టీడీపీ సర్కారుదే..
ఖరీఫ్ సీజన్‌లో విత్తనాల కొరత అంశంపై కలెక్టర్ల సదస్సులో ఎక్కువసేపు చర్చ జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి, రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత ఉందని ప్రజాప్రతినిధులు ప్రధానంగా ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ఒక రకం వరి విత్తనం కొరత ఉందని మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. చిత్తూరు జిల్లాలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడంలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుని.. ఇది గత ప్రభుత్వం చేసిన పాపమని ఆరోపించారు. విత్తనాల సేకరణ కోసమున్న రూ.360 కోట్లను కూడా ఎన్నికల పథకాలకు గత ప్రభుత్వం మళ్లించిందని.. దీనివల్ల ఇప్పుడు విత్తనాలు కొనాలన్నా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. వచ్చే ఐదేళ్లకు దీర్ఘకాలిక దృక్పథంతో విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామన్నారు.
ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. ఏటా అవసరాల కంటే పది శాతం ఎక్కువ బఫర్ స్టాక్ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. జూన్ వరకూ వర్షపాత లోటు ఉన్న నేపథ్యంలో ఈ సీజన్‌లో వర్షాల అంచనా ఏమిటని ఆయన వాకబు చేశారు. ఒకవేళ వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోతే ప్లాన్–బి’ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. విత్తనాలు దొరక్కపోతే మిల్లెట్స్ అయినా ప్రత్యామ్నాయంగా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఏదో మాట్లాడబోగా.. ‘గత ప్రభుత్వం రూ.360 కోట్లను మళ్లించింది. మనం ప్రభుత్వంలోకి వచ్చి నెల కూడా కాలేదు. అధికారులు సమస్య తీర్చడానికి కిందా మీద పడుతున్నారు. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. లేనివి ఇప్పుడు సృష్టించలేరు కదా. రైతులు ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రావత్ అన్నా.. మీరు డబ్బు విడుదల విషయంలో కొంచెం ఉదారంగా ఉండండి..’ అని ఆదేశించారు. కరువు నేపథ్యంలో ఉద్యాన పంటల పరిరక్షణకు కూడా నిధులు అవసరమైతే తక్షణమే విడుదల చేయాలన్నారు. అనంతరం, కరువు నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం లాభదాయకత గురించి వ్యవసాయ సలహాదారు విజయ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
బ్యాగుల్లో ఇంటింటికీ సన్న బియ్యం
ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి జరిగిన చర్చలో ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ.. సర్కారు నిర్ణయం మేరకు ప్రజలకు వినియోగించుకునే బియ్యాన్నే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 10, 15 కిలోలుగా బ్యాగుల్లో ప్యాక్‌చేసి డోర్ డెలివరీ చేస్తామన్నారు. ధాన్యం ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల బకాయి ఉందని.. ఈ నిధులు విడుదల చేయాలని కోన శశిధర్ కోరారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న వివిధ రకాల ధాన్యం ఏడు జిల్లాల్లో పండదని, దీనివల్ల సేకరణ సమస్య రాకుండా చూడాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ.. ‘ గత ప్రభుత్వం అందరికీ బకాయిలు పెట్టింది. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా నిధులను ఎన్నికల పథకాలకు, చంద్రబాబుకు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు మళ్లించింది. ఇది ఎంత చెప్పినా తక్కువే. రావత్ అన్నా.. తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి. లేకపోతే ఈ సీజన్‌లో ధాన్య సేకరణకు రైతుల వద్దకు వెళ్తే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని ఆర్థిక శాఖ కార్యదర్శికి సూచించారు.
గ్రామ సచివాలయాల్లో సరుకుల నిల్వ
గ్రామ సచివాలయాల్లోని ఒక గదిలో నిత్యావసర సరుకులను నిల్వ చేస్తారు. ఒకవేళ ఇక్కడ అదనపు గది లేనిపక్షంలో పక్కనే ఒక గదిని సమకూర్చుకుని అక్కడ నిల్వచేయాలి. అక్కడి నుంచి గ్రామ వాలంటీర్లు నిత్యావసర సరకులు తీసుకెళ్లి తమ పరిధిలోని 50 ఇళ్ల వారికి డోర్ డెలివరీ చేస్తారు. పట్టణాల్లోనూ ఇదే తరహాలో వార్డు సచివాలయాల నుంచి వార్డు వాలంటీర్లు ఇంటింటికీ అందజేస్తారు.
ప్రతి పౌరుడూ ఒక మొక్క నాటాలి
రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ ఒక మొక్కను నాటాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలనేది తన ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి ఇంటిలో, స్కూళ్లు, ఆస్పత్రులలో, ప్రతి ప్రభుత్వ స్థలంలో మొక్కల నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు.
రైతులకు పగలే తొమ్మిది గంటల విద్యుత్
రాష్ట్రంలోని 18.15 లక్షల పంపు సెట్లకు 6,663 ఫీడర్ల ద్వారా పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని సదస్సులో ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. 3,854 ఫీడర్ల ద్వారా ఉ.5 నుంచి సా.7 వరకూ పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా ఈనెల 17 నుంచి ప్రారంభించామన్నారు. మరో 2,809 ఫీడర్ల ద్వారా కూడా విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను రూ.1,700 కోట్లతో పనులు చేపట్టామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో 57,450 వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, వాటిని త్వరగా జారీ చేయడంతోపాటు ఏటా 50 వేల వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలుచేస్తున్నామని వివరించారు. మరోవైపు.. రాష్ట్రంలో 1.7 కోట్ల మంది వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్తు సరఫరాలో పగటిపూట అంతరాయాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉండి ఉండవచ్చని, సబ్‌స్టేషన్లు, ఫీడర్లు పెంచాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఒకేసారి కాకుండా రెండు విడతల్లో తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని, దీనివల్ల భూగర్భ జలమట్టం పడిపోకుండా ఉంటుందని కొందరు మంత్రులు సూచించగా.. ఇందులో తనకేమీ అభ్యంతరంలేదని పగలు తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేస్తామన్న హామీ అమలుచేయాలన్నదే తన లక్ష్యమని సీఎం చెప్పారు.
ఐఏఎస్‌ల్లా కాదు... ప్రజాప్రతినిధుల్లా ఆలోచించండి
అర్హులైన పేదలకు న్యాయం చేసే విషయంలో చట్టం అంటూ గిరిగీసుకోవద్దని, అవసరమైన చోట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అవినీతిని ఏమాత్రం సహించవద్దని, అయితే అదే సమయంలో పేదలకు న్యాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల్లా కాకుండా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్లా ఆలోచించాలన్నారు.
మనమూ, వాళ్లూ ఒక్కటే... ఇది మన ప్రభుత్వం
‘మనమూ, వాళ్లూ ఒక్కటే. ఇది మన ప్రభుత్వం. మనం ప్రతిపక్షంలో లేం. మనది అధికార పక్షం. అధికారులంతా మన ప్రభుత్వంలో భాగమే. మనమూ, వాళ్లూ ఒక్కటే. ఈ విషయాన్ని మొదట నీ బుర్రలోకి ఎక్కించుకోవాలి’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చురక అంటించారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చ సందర్భంగా గిరిజా శంకర్‌ను ఉద్దేశించి మంత్రి అవంతి శ్రీనివాస్ అన్న మాటలపై సీఎం ఘాటుగా స్పందించి ఇలా వ్యాఖ్యానించారు.
మంగళగిరి – చినఅవుటపల్లి రహదారి నిర్మిస్తే...
గన్నవరం ఎయిర్‌పోర్టుకు స్థలం, విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి కలెక్టరు ఇంతియాజ్ ప్రస్తావించగా మంగళగిరి నుంచి చినఅవుటపల్లి వరకూ రహదారి నిర్మిస్తే విజయవాడలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘విజయవాడలో మొదట నిర్మాణంలో ఉన్న రెండు ఫ్లైఓవర్లను కనీసం ఆరు నెలల్లో పూర్తి చేయండి. ఇవి పూర్తయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు గురించి చూద్దాం. మంగళగిరి నుంచి చిన్నఅవుట్‌పల్లి వరకూ రహదారి నిర్మాణానికి భూమి ఉంది. దీన్ని నిర్మిస్తే గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి రాకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్లు కడుతూనే... ఉన్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్ ఇంతియాజ్ ఐకానిక్ వంతెన గురించి ప్రస్తావించగా.. ‘ఐకానిక్ కాదు, ముందు రోడ్డు పనులు ప్రారంభించి తర్వాత కలవండి’ అని సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment