సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాన్ని సడలించడంతో అందరికీ పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లుగా ఇవి ఆంక్షల జాబితాలో ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుత కరోనా సమయంలో అందరికీ పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మూడు పప్పుధాన్యాలను ఓపెన్ క్యాటగిరీలో చేర్చి దిగుమతికి అనుమతించినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను కాపాడడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ఆంక్షల తొలగింపు గడువు అక్టోబర్ 31 వరకే ఉండడంతో వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగారు. రెండున్నర లక్షల టన్నుల కంది, ఒకటిన్నర లక్షల టన్నుల మినుము, 50–75 వేల టన్నుల పెసరపప్పును మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. గతేడాది పంటల కాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నాఫెడ్ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య) వద్ద బఫర్ నిల్వలు తరిగిపోవడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం దిగుమతులకు అనుమతించింది.
మీ దగ్గరున్న నిల్వలెంతో చెప్పండి..
నిత్యావసర వస్తువులు ప్రత్యేకించి పప్పుధాన్యాల నిల్వలు, వాటి ధరలు ఎంతెంత ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని పప్పుల ధరలు భారీగా పెరగడంతో కేంద్రం రాష్ట్రాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఎవరెవరి వద్ద ఎన్నెన్ని నిల్వలున్నాయో తేలనుంది. ధర పెరుగుతుందని కొంతమంది బడా వ్యాపారులు సరకును దాస్తుంటారు. ఇప్పుడా లెక్కలు కూడా తేలతాయని మార్కెటింగ్ శాఖాధికారి ఒకరు తెలిపారు.
తక్కువ ధరకు అమ్ముకోవద్దు..
ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల హెక్టార్లు, రబీలో 23.74 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తులన్నింటికీ కనీస మద్దతు ధర లభించింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రబీలో అపరాల సాగు బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే పంట దిగుబడి చేతికి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంది. పప్పు ధాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినందున రైతులు ఈసారి గిట్టుబాటు ధరలకు అపరాలను అమ్ముకోవచ్చునని, దళారుల మాట విని తక్కువ ధరలకు అమ్ముకోవద్దని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment