
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం గ్రామస్థాయిలో వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సేవలందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి వెల్లడించారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కేటాయింపులు, పంపిణీ అమలు తీరుపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో కలిసి సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా.. ఏపీలో మాత్రమే గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీ జరుగుతున్నదన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో సైతం ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే రైతులకు అందించడంలో ఆర్బీకేలు కీలకభూమిక పోషిస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్ 2022 కోసం 19.02 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని, వాటిని నెలవారీగా నిర్ధేశించిన మేరకు రాష్ట్రానికి కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటి వరకు గోదాముల నుంచి ఆర్బీకేలకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ ఖర్చులను కేంద్రం భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఏపీ ఎరువులకు ఇస్తున్న రాయితీలను కాంప్లెక్స్ ఎరువులకు కూడా ఇచ్చి ధరల వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, మన్‌సుఖ్ మాండవీయ సూచించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు, రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగినప్పటికీ.. సబ్సిడీని పెంచిన విషయాన్ని గుర్తించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment