ఖరీఫ్‌ ప్రత్యామ్నాయం | ulava alternative crop of kharif season | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ ప్రత్యామ్నాయం

Published Tue, Sep 13 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

ఖరీఫ్‌ ప్రత్యామ్నాయం

ఖరీఫ్‌ ప్రత్యామ్నాయం

అనంతపురం అగ్రికల్చర్‌ : ఖరీఫ్‌లో ప్రధాన పంటలు వేసిన తర్వాత మిగిలిన భూముల్లో వర్షాధారంగా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేసుకోవచ్చునని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జాన్‌సుధీర్‌ రైతులకు సూచించారు. చివరిగా కురిసే వర్షాలకు, తర్వాత చలి, మంచుకే ఈ పంట చేతికొస్తుందన్నారు. బలమైన పశుగ్రాసంతో పాటు రైతుకు ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో ఉలవ పంట వేసుకునేందుకు అనుకూలమని ఆయన తెలిపారు.

విత్తనరకాలు, విత్తనశుద్ధి:  పీడీఎం–1 అనే రకం 105 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. పీజడ్‌ఎం–1 రకం 90 నుంచి 95 రోజుల్లో పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. పీహెచ్‌జీ–62 రకం 85 రోజులకు వస్తుంది. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పీహెచ్‌జీ–9 రకం 90 నుంచి 100 రోజులకు పూర్తవుతుంది. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్‌ మందుతో కలిపి విత్తనశుద్ధి చేయాలి.  

యాజమాన్యం: భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండుసార్లు మెత్తగా దున్ని తయారు చేసుకోవాలి. గొర్రుతో వరుసలో విత్తు పద్ధతిలో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు వేసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 10 కిలోల యూరియా, 65 కిలోల సూపర్‌ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను ఆఖరు దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి.

విత్తిన 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు దంతులతో కలుపు నివారణ చేసుకోవాలి పూత, పిందె ఏర్పడే సమయంలో కాయతొలిచే పురుగు పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు 2 మి.లీ క్వినాల్‌ఫాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి. వాతావరణంలో అధిక తేమ ఉండి రాత్రి,పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement