ఎమ్మిగనూరు/గుత్తి/మడకశిర/మడకశిర రూరల్: ‘వైస్సార్‌సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్ మా అధికారులను ఎలా బదిలీ చేస్తుంది? మోదీ చెప్పినట్లు పనిచేస్తారా? మా వాళ్లపైనా ఐటీ దాడులు చేస్తున్నారు. నిన్న కూడా చేశారు. నాపై దాడులు చేస్తారేమో! నా జోలికొస్తే మీరే గుణపాఠం చెప్పాలి. రోషం.. పౌరుషం చూపిస్తారుగా! అందుకు మీరంతా సిద్ధమేనా తమ్ముళ్లూ..?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బేలతనాన్ని ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆయన పర్యటించారు. తొలుత మధ్యాహ్నం 12.25 గంటలకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించారు. సోమప్ప సర్కిల్ చేరుకొని మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కడప ఎస్పీకి నోటీసులు ఇవ్వకుండానే ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. చివరకు పోలీసులు కూడా భయపడే పరిస్థితులు కల్పించారన్నారు. అయినా మన కోసం ధైర్యంగా పనిచేసే వారున్నారని, వైస్సార్‌సీపీ వాళ్లు తెలంగాణ పోలీసులను నమ్ముతారని, వాళ్లను శాశ్వతంగా అక్కడే ఉండేలా చేయండని కోరారు.
గుణపాఠం చెప్పాలంటూ వేడుకోలు
కోటిమంది డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ కానుకలిచ్చాననీ, ఎవరైనా తన జోలికొస్తే మీరే గుణపాఠం చెప్పాలంటూ వేడుకున్నారు. ఇప్పుడు తనను రక్షించుకోవాలని, తరువాత మిమ్మల్ని బాగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. పసుపు–కుంకుమ తీసుకున్న డ్వాక్రా మహిళలు, రుణమాఫీ, సబ్సిడీ ట్రాక్టర్లు పొందిన వారందరూ పార్టీ జెండా పట్టుకొని ప్రచారం చేయాలని, అప్పుడే తనకు నమ్మకం కుదురుతుందన్నారు. జాబు కావాలంటే మళ్లీ బాబు రావాలని యువకులంతా కోరుకుంటున్నారన్నారు. అదే జగన్ వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, మిమ్మల్ని చంపినా అడిగే వారుండరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా రూ.5 లక్షల వరకు వైద్యసేవలందిస్తామని, అన్ని మెడికల్ షాపుల్లో ఉచితంగానే మందులిస్తామని పేర్కొనటంతో ఆశ్చర్యపోవటం జనం వంతైంది. ఏప్రిల్‌లో రైతులకు 4, 5వ విడత రుణమాఫీ డబ్బు వేస్తామని, పసుపు–కుంకుమ డబ్బు కూడా వేస్తామని బాబు ‘కోడ్ ఉల్లంఘన’ వ్యాఖ్యలు చేశారు. అందరి ఇళ్లల్లో పెళ్లిళ్లు తానే చేస్తాననీ, పెళ్లి కానుకను లక్ష రూపాయలు చేస్తానని చెప్పారు. చేనేత రుణాలు మాఫీ చేశానని, వారికి 50%కే ముడిసరుకులు ఇచ్చానని, పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నామని, నగదు రహిత లావాదేవీలు చేపట్టామంటూ పొంతనలేని మాటలు చెప్పారు. ఇన్ని చేస్తున్నా అందరూ తనపైనే దాడులు చేస్తున్నారనీ, నరేంద్రమోదీ, అమిత్‌షా, కేసీఆర్, జగన్ ఏకమయ్యారని ఆరోపించారు.
62 ప్రాజెక్టులు కట్టా..
అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. గుత్తిలోని ఎంఎస్ హైస్కూలు ఆవరణలో బహిరంగ సభలో మాట్లాడారు. తాను సీఎం అయ్యాక 5 నదులను అనుసంధానం చేయించాననీ, 62 ప్రాజెక్ట్‌లను కట్టానన్నారు. హంద్రీనీవా, పట్టిసీమ ప్రాజెక్ట్‌ల ద్వారా తాగు, సాగు నీరు అందించానన్నారు. చివరిలో ‘‘అమ్మగారు, అయ్యగారు, తమ్ముళ్లు’’ మీ ఓటు నాకు వేయాలని అభ్యర్థించారు. వేస్తారా? వేయరా? చెప్పండని గద్దించినా ఎవరూ స్పందించకపోవడంతో ప్రసంగాన్ని ముగించారు. అనంతరం మడకశిరలో చంద్రబాబు మాట్లాడుతూ.. మడకశిరకు నీళ్లిచ్చే ఈ గడ్డపై అడుగుపెట్టినట్లు వ్యాఖ్యానించారు.
సీఎం సభకు వస్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి
సీఎం సభకు జనాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసిన ఆటో బోల్తా పడింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. మడకశిర మండలంలోని డి.అచ్చంపల్లి, మరువపల్లి గ్రామాల టీడీపీ కార్యకర్తలు ఆటోలో సీఎం సభకు బయల్దేరారు. వీరి ఆటో గౌడనహళ్లి సమీపంలో అదపు తప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న డి.అచ్చంపల్లికి చెందిన క్రిష్టప్ప (50) అక్కడిక్కడే మృతి చెందారు. 9 క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బుధవారం రాత్రి అనంతపురంలో సీఎం చంద్రబాబు రోడ్‌షో సందర్భంలోనూ గోడకూలి ఐదుగురు గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment