సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచే కాకుండా కేరళలోని వయనాడ్ నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేయడం అంటే ‘ మెజారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీకి భయపడి పారిపోవడమే’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. ‘మెజారిటీలైన హిందువుల వ్యతిరేకతకు భయపడి రాహుల్ గాంధీ హిందువులు తక్కువగా ఉన్న నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారని మోదీ విమర్శించారు’ అంటూ ఆ వెంటనే ‘టైమ్స్ నౌ’ ఛానల్ ట్వీట్ చేసింది. దాంతో పలువురు నరేంద్ర మోదీ ఫాలోవర్లు మెజారిటీలైన హిందువులకు భయపడి ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్నారంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. వాస్తవానికి వయనాడ్ జిల్లాలో హిందువులు 49.48 శాతం, ముస్లింలు 26.65 శాతం మంది ఉన్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఇచ్చిన ట్వీట్‌తో మోదీ ఫాలోవర్లు కాస్త తగ్గారు.
వయనాడ్‌లో ఏ మతస్థులు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని పక్కన పెడితే, రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ విమర్శించడం ద్వారా క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ లౌకిక స్వరూపాన్నే విమర్శించడం అవుతోంది. ఆయన ఒక్కరే కాదు, ఆయన పార్టీ నాయకులంతా మతం ప్రాతిపదికగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి కూడా కుల, మత, జాతి, భాష పరంగా ఓటు అడగరాదు, అదే కారణంగా ఓటు వేయరాదంటూ కోరరాదు’ ఈలెక్కన మోదీ కూడా ఈ నియమావళిని ఉల్లంఘించినట్లే. (చదవండి: కేరళ నుంచి రాహుల్ పోటీ ఎందుకు?)
ఇక మోదీ తరఫున ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో రెండు అడుగులు ముందుకేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. యూపీలోని ఓ ర్యాలీలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘2015లో గోమాంసం తిన్న ఓ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికితే దాన్ని అణచివేసేందుకు అప్పటి సమాజ్‌వాది పార్టీ ప్రయత్నించింది’ అంటూ విమర్శించగా, ఆ సభలో ముందు వరుసలో కూర్చున్న నాటి సంఘటనలో ప్రధాన నిందితుడు లేచి ఈల వేసి గోల చేశాడు. యూపీలోని దాద్రిలో 2015, సెప్టెంబర్ 28వ తేదీన గోమాంసం తిన్నాడన్న అనుమానంతో అక్లాఖ్ అనే ముస్లింను మూక దాడిలో చంపిన విషయం తెల్సిందే.
ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడు ఓ ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీని మరోసారి గెలిపిస్తే ‘మతపరమైన చట్టాలన్నింటిని సవరిస్తాం’ అని చెప్పారు. అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులకు, బౌద్ధులకు, సిక్కులకు సానుకూలంగా సవరిస్తారు కావచ్చు! 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి ప్రాతిపదికన సబ్‌కే వికాస్, అచ్చేదిన్ నినాదాలతో మోదీ, ఆయన పార్టీ నేతల గణం ప్రచారం చేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు మతపరంగా ఓటర్లను విభజించి ఓట్లు అడుగుతుందంటే ‘హంగు’ భయమే కావచ్చు! ఏదీ ఏమైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు వచ్చే వరకు నిరీక్షించకుండా ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు టీఎన్ శేషన్ మళ్లీ పుట్టాలేమో!
Comments
Please login to add a commentAdd a comment