ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విజయోత్సవాలతో బిజీగా ఉన్న మోదీ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భక్తుల కుటుంబాల ఆర్తనాదాలు వినడం లేదని మండిపడ్డారు.
గత మూడు రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోని రియాసి, కతువా, దోడాలో మూడు వేర్వేరు ఉగ్రవాద దాడులు జరిగాయి. అయినప్పటికీ మోదీ ఎన్డీయే ఎన్నికల విజయోత్సవాలతో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ఇటీవలి ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ (కేరళ)తో పాటు తమ కుటుంబ కంచుకోట రాయ్‌బరేలీ (యూపీ)లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తనను మరో సారి ఎన్నుకున్నందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కేరళలోని వాయనాడ్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదో సమాధానం చెప్పాలని దేశం డిమాండ్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.
మేనిఫెస్టోకి అనుగుణంగా పేదలకు, రైతులకు కాంగ్రెస్ పనిచేస్తోందన్న రాహుల్ మా పని ఇప్పుడే ప్రారంభమైంది. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సూచించారు.
ప్రేమ ద్వేషాన్ని ఓడించింది..వినయం అహంకారాన్ని ఓడించింది
ప్రేమ ద్వేషాన్ని ఓడించింది..వినయం అహంకారాన్ని ఓడించింది. అదానీ,అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేసే విచిత్రమైన పరమాత్మ మోదీ. నా దేవుళ్లు పేద ప్రజలే, నా దేవుళ్లు వాయనాడ్ ప్రజలే మీరు నాకు ఏమి చెబితే అది చేస్తాను అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment